
మాస్క్ తీసిన తరువాత..
చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ముఖానికి మాస్క్ పెట్టుకోవడం కొవిడ్–19తో చేసే ఫైట్‌లో ముఖ్యమైనవి. వైరస్ బారిన పడకుండా పాటించే ఈ అలవాట్ల వల్ల చర్మం దెబ్బతింటే? ఇబ్బందే కదా! చర్మం పొడిబారకుండా, ర్యాషెస్ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- బయటికి వెళ్లి పనిచేసేవాళ్లు ఎక్కువసేపు మాస్క్ పెట్టుకునే ఉంటారు. ఇలాంటివాళ్లు క్లాత్ మాస్క్ వాడమని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ సలహా ఇస్తోంది.
- మాస్క్ పెట్టుకోవడం వల్ల ముక్కు, గెడ్డం, బుగ్గల దగ్గర, చెవుల వెనకాల చర్మం దెబ్బతింటుంది. దురద, ర్యాష్ వస్తాయి. మాస్క్ కింద చెమట పట్టి, మొటిమలు వస్తాయి. ఇవేకాకుండా చర్మానికి సంబంధించిన ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
- మాస్క్ పెట్టుకున్నా సమస్యలు రాకుండా ఉండాలంటే చర్మం శుభ్రం చేసుకోవడం, మాయిశ్చరైజర్ రాసుకోవడం వంటి రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్ అవసరం. అవి కూడా నాన్కోమెడోజెనిక్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలి. ఈ ప్రొడక్ట్స్ చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా చూస్తా
- జిడ్డు చర్మం ఉన్న వాళ్లు వాటర్ సాల్యుబుల్ మాయిశ్చరైజర్స్ వాడాలి.
- మాస్క్ వల్ల చర్మం ఒరుసుకు పోకుండా చూసుకోవాలి. జింక్ ఆక్సైడ్‌ను చర్మంపైన పలుచటి పొరలా వేస్తే అది చర్మానికి రక్షణ ఇస్తుంది. జింక్ ఆక్సైడ్‌ను డయపర్ ర్యాష్‌కు, బాగా పగిలిన చర్మానికి కూడా వాడతారు. దీన్ని ముక్కు లేదా చెవుల వెనక రాయాలి.
- చర్మం వత్తుకుపోయే దగ్గర బ్యాండేజ్ వేయాలి. కూలింగ్ రిలీఫ్ ఇచ్చే బ్యాండేజ్‌ల గురించి డాక్టర్ని లేదా ఫార్మసిస్ట్‌ను అడిగి తెలుసుకోండి.
- ఒకవేళ కురుపుల్లాంటివి అయితే వాటిని శుభ్రం చేసి యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ వాడాలి. బ్లిస్టర్, మాస్క్‌లకు మధ్య ప్రొటెక్టివ్ బ్యారియర్లా బ్యాండేజ్ వేయాలి.
- మొటిమలు వస్తే చర్మాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. వాటర్ సాల్యుబుల్ మాయిశ్చరైజర్ వాడాలి. బెంజోయిల్ పెరాక్సైడ్ లేదా సాలిసిలిక్ ఆమ్లం ఉన్న ప్రొడక్ట్స్ వాడాలి. మొటిమల్ని నొక్కడం, గిల్లడం వంటివి చేయొద్దు. అలాచేస్తే ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది. ఇవన్నీ మనం చేసుకోగలిగిన పనులు. అలాకాకుండా చర్మ సమస్యలు మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్ని కలవడం తప్పనిసరి.
చేతుల కోసం...
- చేతుల్ని ప్రతిసారీ కనీసం 20 సెకన్లు సబ్బు, నీళ్లతో కడగాలి. లేదా 60 శాతం ఆల్కహాల్ ఉన్న శానిటైజర్ వాడాలి. అయితే మనం వాడే హ్యాండ్‌వాష్‌లు చాలావరకు చర్మంలో ఉన్న నేచురల్ ఆయిల్స్‌ను పోగొడతాయి. దాంతో చేతులు పొడి బారి, పగిలిపోతాయి. ఇలాకాకుండా ఉండాలంటే సబ్బుతో, గోరువెచ్చని లేదా చల్లని నీళ్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి. బాగా వేడిగా ఉన్న నీళ్లతో సూక్ష్మక్రిములు నాశనం అవుతాయనుకుని చాలామంది వేడివేడి నీళ్లతో చేతులు కడుగుతుంటారు. ఇలా చేయడం పొరపాటు. వేడినీళ్లు చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి.
- యాంటీ బ్యాక్టీరియల్ క్లెన్సర్స్ వాడితే... ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే వ్యాధులు రావు అనుకుంటాం. కానీ ఇవంత ఎఫెక్టివ్‌గా పనిచేయవట. అదీకాక వాటిలో సువాసనల కోసం కెమికల్స్ వాడతారు. వాటివల్ల చర్మానికి హాని కలుగుతుంది.
- చేతులు కడిగాక మాయిశ్చరైజర్ రాసుకోవడం తప్పనిసరి. చేతుల తడారాక మాయిశ్చరైజర్ రాయాలి. అప్పటికీ చేతులు పొడిగా అనిపిస్తే మాయిశ్చరైజర్ ఆరాక మళ్లీ ఒకసారి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వీటిలో కూడా సువాసనలు లేనివి, రంగులు లేనివి వాడాలి. మాయిశ్చరైజర్‌ని ఎప్పుడూ అందుబాటులో ఉంచుకుని. మధ్యమధ్యలో రాసుకుంటూ ఉండాలి.
- కొన్ని సందర్భాల్లో ఒకట్రెండు రకాల మాయిశ్చరైజర్స్‌ని కలిపి రాసుకోవడం బెస్ట్. లైట్ వెయిట్ క్రీమ్స్ చర్మం బయటిపొరకు తేమను ఇస్తాయి. మా చేతులు బాగానే ఉన్నాయి... పొడిబారలేదు, పగల్లేదు అంటున్నరా! మంచిగా ఉన్నా కూడా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలాచేస్తే సమస్య రాకముందే నివారించినట్టు అవుతుంది.