ఛత్తీస్‎గఢ్‏లో భారీ ఎన్‌కౌంటర్... నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‎గఢ్‏లో భారీ ఎన్‌కౌంటర్... నలుగురు మావోయిస్టులు మృతి

రాయ్‎పూర్: ఛత్తీస్‎గఢ్‏లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. శనివారం (జూలై 26) బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. మావోయిస్టుల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనా స్థలం నుండి ఇన్సాస్, ఎస్ఎల్ఆర్ రైఫిల్స్‌తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా, బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు సంచారిస్తున్నారన్న సమాచారం రావడంతో కూంబింగ్ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే భద్రతా దళాలు, మావోయిస్టులు తారసపడగా.. ఇరువర్గాలు పరస్పరం కాల్పులు చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్లో నలుగురు మావోలు మరణించారు. కొందరు జవాన్లు స్వల్పంగా గాయపడ్డారని తెలిపారు. 

ALSO READ | ఇక శత్రువులకు చుక్కలే.. ఆర్మీలో రుద్ర బ్రిగేడ్, భైరవ్ బెటాలియన్ ప్రారంభం

కాగా, 2026 మార్చి 31 లోపు దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్రంలోని మోడీ సర్కార్ శపథం చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు ఆపరేషన్ కగార్ చేపట్టాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన ఛత్తీస్‎గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలలో భద్రతా దళాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య పలుమార్లు ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్లలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మరణించారు. మావోయిస్టు పార్టీ సుప్రీం లీడర్ నంబాల కేశవరావు, కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, సుధాకర్, భాస్కర్ వంటి కీలక నేతలతో సహా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఎన్ కౌంటర్లో మరో నలుగురు మరణించడంతో మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.