
- వేల మందిని లక్షల మందిగా చూపించి సొమ్ము కాజేసిన్రు
- రేషన్ స్కీంలో వందల కోట్ల కుంభకోణం గుర్తించిన ఏజీ
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న టేక్ హోం రేషన్ స్కీంలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. లబ్ధిదారుల ఎంపికతో పాటు పంపిణీ విషయంలోనూ తప్పుడు లెక్కలతో రూ. కోట్లు కొల్లగొట్టినట్లు ఆ రాష్ట్ర అకౌంటెంట్ జనరల్(ఏజీ) గుర్తించారు. బాలికలు, మహిళలకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీంను అమలు చేస్తోంది. అయితే, లబ్ధిదారులకు రూ. 6.94 కోట్ల విలువైన 1,125 టన్నుల రేషన్ పంపిణీ కోసం భారీ ఎత్తున ట్రక్కులను వినియోగించినట్లు రికార్డుల్లో చూపారు. కానీ ఆ వెహికల్స్ నెంబర్లను ఆర్టీఏలో చెక్ చేయగా.. వాటిలో బైకులు, కార్లు, ఆటోలు, ట్యాంకర్ల నెంబర్లు కూడా ఉన్నట్లు తేలింది. అలాగే లబ్ధిదారుల సంఖ్యలోనూ భారీగా తప్పుడు లెక్కలు చూపినట్లు వెల్లడైంది. ఈ కుంభకోణంపై ఏజీ ప్రభుత్వానికి 36 పేజీల రిపోర్ట్ ను అందజేశారు.
9 వేల మందిని 36 లక్షలుగా..
మధ్యప్రదేశ్లో 6 నెలల నుంచి 3 ఏండ్ల మధ్య పిల్లలు 34.69 లక్షల మంది, 14.25 లక్షల గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 0.64 లక్షల మంది ఔటాఫ్ స్కూల్ అడాల్సెంట్ గర్ల్స్ (11 నుంచి 14 ఏండ్ల మధ్యవాళ్లు) కలిపి మొత్తం 49.58 లక్షల మంది లబ్ధిదారులు ఈ స్కీం కింద రిజిస్టర్ అయినట్లు చూపారు. అయితే, 2018–19 మధ్య ఔటాఫ్ స్కూల్ అడాల్సెంట్ గర్ల్స్ కేవలం 9 వేల మంది aఉండగా.. వారి సంఖ్యను ఏకంగా 36.08 లక్షలుగా చూపారు. 8 జిల్లాల్లోని 49 అంగన్వాడీ సెంటర్లలో ముగ్గురు మాత్రమే ఔటాఫ్ స్కూల్ అడాల్సెంట్ గర్ల్స్ ఉండగా.. 63,748 మంది రిజిస్టర్ అయ్యారని, వారిలో 29,104 మందికి రేషన్ అందజేశామని రికార్డుల్లో రాశారు. ఇలా దాదాపు 110.83 కోట్ల మేరకు కుంభకోణం జరిగినట్లు ఆడిటర్ గుర్తించారు. రేషన్ ఉత్పత్తి ఖర్చును రూ. 58 కోట్లు పెంచి చూపారని, రూ. 62.72 కోట్ల విలువైన రేషన్స్ మాయమయ్యాయని గుర్తించారు.