
- గ్యాస్ కట్టర్తో లాకర్ తెరిచి దొంగతనం
- రూ.18 లక్షల నగదు కూడా ఎత్తుకెళ్లిన దొంగలు
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేటలో భారీ దొంగతనం జరిగింది. ఓ జువెలరీ దుకాణానికి కన్నం వేసి 8 కిలోల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. జువెలరీ షోరూం వెనుక భాగంలోని బాత్ రూమ్ గోడకు రంధ్రాలు చేసి షట్టర్ ను ధ్వంసం చేశారు. గ్యాస్ కట్టర్లతో లాకర్ తెరిచి బంగారాన్ని చోరీ చేశారు. రూ.18 లక్షల నగదు కూడా ఎత్తుకెళ్లారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంజీ రోడ్డులోని సాయి సంతోషి జువెలర్స్ షాపులో ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు ఈ ఘటన జరిగింది. సోమవారం ఉదయం షాపు తెరిచిన యజమాని తెడ్ల కిశోర్.. దొంగతనం జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో ఆధారాలు సేకరిస్తున్నారు. చోరీకి గురైన బంగారం విలువ రూ.7 కోట్ల దాకా ఉంటుందని భావిస్తున్నారు.
తెలిసిన వారి పనేనా?
జువెలరీ షాపులో దొంగలు పక్కా స్కెచ్ తో దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తున్నది. జువెలరీ షాప్ గురించి పూర్తిగా తెలిసిన వారే దొంగతనానికి పాల్పడరా అన్న సందేహాలు నెలకొన్నాయి. సాయి సంతోషి జువెలరీ షాప్ ను మరికొన్ని రోజుల్లో సొంత షాపులోకి మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారం రోజుల క్రితం గోల్డ్ షాపులో బంగారాన్ని దాచేందుకు ఉంచే తిజోరీని కొత్త దుకాణానికి మార్చారు. తిజోరీ స్థానంలో చిన్నపాటి బీరువాను ఉంచి లోపల షట్టర్ ను ఏర్పాటు చేసి ఒక సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశారు. దీని గురించి పూర్తిగా తెలిసిన వారే దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ షాపు సూర్యాపేట నడి బొడ్డున ఉండగా వాటి చుట్టూ మరో ఆరు షాపులు ఉన్నాయి. ఆరు షాపులకు రెండు బాత్ రూమ్ లు ఉండగా ఒక బాత్ రూమ్ జువెలరీ షాపులో ఉండగా మరొకటి బయట ఉంది.
అయితే దుకాణాల వెనుక నుంచి పూర్తిగా నిర్మానుష్యంగా ఉండడంతో దొంగలు అక్కడి నుంచే లోపలికి ప్రవేశించి బయట ఉన్న బాత్ రూమ్ కు కన్నం పెట్టి గోల్డ్ షాపులో ఉన్న బాత్ రూమ్ ద్వారా లోపలికి ప్రవేశించారు. బాత్ రూమ్ ద్వారా లోపలికి ప్రవేశించే ముందు సీసీటీవీ కెమెరాను దొంగలు డిస్‌కనెక్ట్ చేశారు. దొంగతనం చేశాక షాపులోకి వెళ్లకుండా స్ట్రాంగ్ రూంలో ఉన్న బంగారం, డబ్బును మాత్రమే దొంగలించారు. షాపులో మరో 2 కిలోల వరకు బంగారం ఉండగా సీసీటీవీ కెమెరాలు ఉంటాయన్న అనుమానంతో దొంగలు జాగ్రత్త పడ్డారు. దొంగతనం చేశాక గ్యాస్ కట్టర్, సిలిండర్లను అక్కడే వదిలేసి వెళ్లిపోవడంతో ఇది ప్రొఫెషనల్ దొంగల పని కాదని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగతనం చేసి పారిపోతుండగా 2 తులాల రింగ్, చెవిదిద్దులు దారిలో పడిపోగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
5 బృందాలతో గాలింపు
గోల్డ్ షాప్ యజమాని తెడ్ల కిశోర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్పీ నరసింహ, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, టౌన్ సీఐ వెంకటయ్య వివరాలు ఆరా తీశారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించి ఆధారాల కోసం వెతుకుతున్నారు. సమీపంలోని వ్యక్తులను కూడా విచారిస్తున్నారు. జువెలరీ షోరూం సిబ్బందిని విచారించి వేలిముద్రలు సేకరించారు. కేసును ఛేదించడానికి 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా.. దొంగతనం చేసేందుకు ఐదుగురు వ్యక్తులు రెండు నెలల పాటు రెక్కీ నిర్వహించారు.