మాస్టర్ ప్లాన్ అమలెప్పుడో?..నిర్మల్ మున్సిపాలిటీకి సంబంధించి 2022లో రూపకల్పన

మాస్టర్ ప్లాన్ అమలెప్పుడో?..నిర్మల్ మున్సిపాలిటీకి సంబంధించి 2022లో రూపకల్పన
  • జోన్ల మార్పుపై కొనసాగుతున్న సందిగ్ధత 
  • జీవో నంబర్ 220తో సరిపెట్టిన గత ప్రభుత్వం  
  • తమ అభ్యంతరాలపై నిర్ణయం వెలువడలేదని రైతుల ఆవేదన

 నిర్మల్, వెలుగు: నిర్మల్ మున్సిపాలిటీకి సంబంధించి మాస్టర్ ప్లాన్ మూడేళ్లయినా ఆమోదం పొందడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులు ఆగమేఘాల మీద రూపొందించిన ఈ ప్లాన్ పై అంతటా వ్యతిరేకత వచ్చింది. అప్పట్లో కొంతమంది దీన్ని తమకు అనుకూలంగా తయారు చేయించుకున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే, 1990 మాస్టర్ ప్లాన్ ప్రకారం సోఫీనగర్​ ఇండస్ట్రియల్ జోన్ లో కొనసాగింది. 2022లో రూపొందించిన కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం పచ్చని పంట పొలాలున్న మంజులాపూర్, తల్వేద గ్రామాలను ఇండస్ట్రియల్​జోన్​గా గుర్తించారు.

  దీనిపై జిల్లా వ్యాప్తంగా అప్పట్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. రైతులు కూడా రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించి, మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో గత ప్రభుత్వం ప్లాన్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రైతులు, స్థానికుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతే ముందుకెళ్తామని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు చెప్పడంతో ఆందోళనలు తాత్కాలికంగా ఆగిపోయాయి.

400కు పైగా అభ్యంతరాలు

కొత్త మాస్టర్ ప్లాన్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత అధికారులు  జీవో 220ని జారీ చేశారు. దీని ప్రకారం అప్పటికే రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను ఫార్మల్ అప్రూవల్(తాత్కాలికంగా) అమలు చేయాలని, ఆ తర్వాత రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. స్థానికుల నుంచి 400కు పైగా అభ్యంతరాలు వచ్చాయి.

 అయితే వాటిని ఆన్ లైన్ చేసిన ఇక్కడి మున్సిపల్ అధికారులు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు పంపారు. ఈ వ్యవహారమంతా జరిగి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటివరకు కొత్త మాస్టర్ ప్లాన్ పై ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

కొంతమందికే ప్రయోజనమన్న ఆరోపణలు

బీఆర్ఎస్ హయాంలో రూపొందిన జీవో 220 కొంతమందికే ప్రయోజనం చేకూర్చుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న భూములు కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్ లోకి మారిపోయాయి. అయితే గ్రీన్ జోన్ లో ఉన్న గ్రామాలు మాత్రం ఇప్పటికీ కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇండస్ట్రియల్ జోన్ లోనే ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

తమ నుంచి అభ్యంతరాలను స్వీకరించిన ఉన్నతాధికారులు ఇప్పటివరకు వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవడం గానీ, మాస్టర్ ప్లాన్ ను సవరించడం గానీ చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తమ గ్రామాలను కొత్త మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రియల్, కమర్షియల్ జోన్ నుంచి తొలగించాలని కోరుతున్నారు.

జోన్ల మార్పు సాధ్యం కావట్లే..

గతంలో కమర్షియల్ జోన్ అనే విషయం తెలియక చాలామంది ఇంటి నిర్మాణాల కోసం ఆ జోన్ లోని  భూములను కొనుగోలు చేశారు. అయితే  కొత్త మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనల్లో కొన్ని ప్రాంతాల్లోని కమర్షియల్ జోన్ భూములను రెసిడెన్షియల్ జోన్ గా మార్చారు. కొత్త మాస్టర్ ప్లాన్ అమలు కాకపోవడంతో జోన్ల మార్పు సాధ్యం కావడం లేదు. దీంతో ప్రస్తుతం కమర్షియల్ జోన్ లో భూములు ఉన్నవారికి ఇండ్ల నిర్మాణం కోసం మున్సిపాలిటీ అనుమతి ఇవ్వడం లేదు. కొత్త ప్లాన్ అమలైతేనే ఈ సమస్య పరిష్కారం కానుంది.