రూపాయికే పాఠాలు బోధిస్తున్న బడిపంతులు

రూపాయికే పాఠాలు బోధిస్తున్న బడిపంతులు

పిల్లలకు చదువు చెప్పాలంటే ఎవరైనా వేలల్లో ఫీజు వసూలు చేస్తారు. వేలల్లో ఫీజులు కట్టడం చాలామంది పేరెంట్స్కు భారంగా మారింది. అయితే,  బిహార్కు చెందిన ఒక ఉపాధ్యాయుడు మాత్రం ఒక్క రూపాయికే పాఠాలు చెప్తున్నాడు. తన ఇంటినే స్కూల్‌గా చేసి, పేద విద్యార్థులకు ఒక్క రూపాయికే పాఠాలు చెప్తున్నాడు.

బీహార్లోని సమస్తిపూర్ అనే చిన్న ఊళ్లో టీచర్‌గా  పని చేశాడు లోకేశ్ శరణ్. అరవై ఒక్క ఏళ్ల ఈ టీచర్కు ఒకప్పుడు సొంత స్కూల్ ఉండేది. తన తండ్రి చాలా ఏళ్లక్రితం స్టార్ట్ చేసిన స్కూల్లోనే పనిచేసేవాడు. పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతోనే పాఠాలు చెప్పేవారు ఆ స్కూల్లో. అయితే, అనేక ప్రైవేట్ స్కూళ్ల రాకతో, స్కూల్ నడపడం కష్టమైంది. దీంతో లోకేశ్ తండ్రి, 2013లో ఆ స్కూల్ను మూసేశారు. దీనివల్ల కొందరు పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ భారంగా మారింది. సరైన వసతులు లేని స్కూల్స్‌లో  చేరి, సరైన విద్య పొందలేకపోతున్నారు. అయితే, అలాంటి పేద విద్యార్థులకు మంచి చదువు అందకపోవడం లోకేశ్‌ను ఆలోచింపజేసింది. వాళ్ల చదువు కోసం ఏదైనా చేయాలనుకున్నాడు.

ఒక్కరూపాయికే చదువు
రవాణా, ఫీజులు వంటి అనేక కారణాలతో పిల్లలు రెగ్యులర్గా స్కూల్కు వెళ్లలేకపోతున్నారు. దీంతో వాళ్ల చదువుకు ఆటంకం కలుగుతోంది. అలాంటి పిల్లలు ప్రతి రోజూ తన ఇంట్లోనే చదువుకునేలా చేయాలనుకున్నాడు. ఇందుకోసం ఇంట్లో వాకిలితోపాటు, పక్కనే ఉన్న స్థలంలో చిన్న స్కూల్ ఏర్పాటు చేశాడు. దాదాపు నలభై మంది కలిసి చదువుకునేలా బ్లాక్బోర్డ్, బెంచీలు వంటివి సెట్ చేశాడు. పిల్లలకు ప్రతి రోజూ ఉదయం స్కూల్ టైమ్కంటే ముందు, లేదా స్కూల్ తర్వాత పాఠాలు చెప్తున్నాడు. అయితే, పిల్లల దగ్గర్నుంచి ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా వసూలు చేస్తున్నాడు.

చదువు ఒక్కటే కాదు..
ఇక్కడ చదువు ఒక్కటే కాకుండా, పిల్లల హ్యాండ్ రైటింగ్, రీడింగ్, ఇతర కరిక్యులర్ యాక్టివిటీస్ నేర్పిస్తారు. చదువుతోపాటు అన్నిరకాల స్కిల్స్ నేర్పిస్తాడు. పిల్లలు ఎందులో వీక్గా ఉన్నారో, వాటిపై రోజూ క్లాసెస్ చెప్తారు. అయితే, తన ఇంట్లోనే కాకుండా, ఎక్కడికైనా వెళ్తే రోడ్డు పక్కన చదువుకుంటూ కనిపించే పిల్లలకు కూడా ఏదో ఒక రకంగా సాయం చేస్తుంటాడు. చుట్టుపక్కల ఉన్న స్కూల్స్కు వెళ్లి, వాళ్లకు కూడా పాఠాలు చెప్తాడు. పేద పిల్లలు చదువులో రాణించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న లోకేశ్ను స్థానికులు అభినందిస్తున్నారు.