- ఏండ్ల తరబడి నిలిచేలా శాశ్వత పనులకు చర్యలు
 - టెండర్ ప్రక్రియ ప్రారంభించిన ఆఫీసర్లు
 - వచ్చే ఏడాది జరగనున్న మహాజాతరకు రూ. 150 కోట్లు
 - త్వరలో మేడారంలో పర్యటించనున్న సీఎం
 - గిరిజన సంప్రదాయాల ప్రకారమే మేడారం అభివృద్ధి
 - 100 రోజుల్లో పనులు పూర్తయ్యేలా కార్యాచరణ
 - మంత్రులు పొంగులేటి, సురేఖ, సీతక్క, అడ్లూరి
 
ములుగు, వెలుగు : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం అభివృద్ధిపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా రూ. 236 కోట్లతో ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించిన సర్కార్.. ఈ నిధులతో వందేండ్ల పాటు నిలిచేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు చర్యలు ప్రారంభించింది.
దీంతో పాటు వచ్చే ఏడాది జరగనున్న మహాజాతరకు తరలిరానున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పించేందుకు మరో రూ. 150 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో జాతర నాటికి సివిల్, నాన్ సివిల్ వర్క్స్‌ను పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
శాశ్వత పనుల కోసం రూ. 236 కోట్లు
మేడారం జాతర టైంలో చేపట్టే పనులు మళ్లీ జాతర వచ్చే వరకు శిథిలావస్థకు చేరుతుండడంతో మరోసారి నిధులు కేటాయించి చేసిన పనులే మళ్లీ మళ్లీ చేయాల్సి వచ్చేది. ఇకపై అలాంటి సమస్య తలెత్తకుండా ప్రస్తుత ప్రభుత్వం శాశ్వత పనులకు పూనుకుంటోంది.
ఇందుకోసం ప్రత్యేకంగా రూ. 236 కోట్లతో మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. ఈ నిధులతో మేడారం వద్ద ప్యూరిఫైడ్ వాటర్, క్యూలైన్లలో తాగునీటి వసతి, క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించేలా పైకప్పు వేయనున్నారు. ఈ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. మేడారం, చిలుకలగుట్ట, ఊరట్టం, తాడ్వాయి, నార్లాపూర్, బయ్యక్కపేట తదితర రోడ్లను విస్తరించనున్నారు.
మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గద్దెల అభివృద్ధికి రూ.58.2 కోట్లు, కళాకృతి పనులకు రూ.6.8 కోట్లు, జంపన్నవాగు అభివృద్ధికి రూ.39 కోట్లు, భక్తులకు వసతి కోసం రూ.50 కోట్లు కేటాయించనున్నారు. ముఖ్యంగా భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా క్రౌడ్ మేనేజ్‌మెంట్ చేసేలా చర్యలు చేపడుతున్నారు.
అలాగే భక్తులకు విడిది కేంద్రాలతో పాటు, జంపన్నవాగుకు ఇరువైపులా సుందరీకరణ పనులు సైతం చేపట్టనున్నారు. మేడారం వద్ద చేయనున్న పనులను కుంభమేళాలు నిర్వహించే సంస్థలకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
వచ్చే జాతర కోసం ప్రత్యేకంగా రూ. 150 కోట్లు
వచ్చే ఏడాది జరగనున్న మేడారం మహాజాతరకు తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు మాస్టర్ ప్లాన్‌తో సంబంధం లేకుండా రూ. 150 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో రూ.90.87 కోట్లను సివిల్ వర్క్స్‌కు, రూ.59.13 కోట్లను నాన్ సివిల్ వర్క్స్‌కు కేటాయించారు.
సివిల్ వర్క్స్ కింద రోడ్లు వేయడం, అవసరమైన అతిథిగృహాలు, పూజారుల వసతి గృహాలు నిర్మించడంతో పాటు జంపన్న వాగు వద్ద వాటర్ మేనేజ్‌మెంట్, బ్యాటరీ ట్యాప్స్ ఏర్పాటు వంటి పనులు చేపట్టారు.
అలాగే శానిటేషన్, ఆర్టీసీ, పోలీస్ బందోబస్త్, పార్కింగ్, మెడికల్ క్యాంప్‌ల ఏర్పాటు, టూరిజం, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించేందుకు నాన్ సివిల్ వర్క్స్‌కు సంబంధించిన నిధులను వాడనున్నారు. మొత్తం రూ. 150 కోట్లను డిపార్ట్‌మెంట్ల వారీగా కేటాయించారు.
ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా మార్పులు
మేడారంలో చేపట్టే ప్రతీ పనిని ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగానే చేపట్టనున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.
ఆదివాసీ పూజారుల సూచన మేరకే సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్ద రాజు గద్దెలను ఒకే వరుసలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. జాతర టైంలో క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో ఇబ్బందులు ఎదురవడం, గద్దెల వద్ద భక్తుల తలలపై కొబ్బరికాయలు, బంగారం పడడం వంటి ఘటనలు జరుగుతుండంతో వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
హైదరాబాద్, వెలుగు : మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయాన్ని గిరిజన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారమే అభివృద్ధి చేయనున్నట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు.
మేడారం జాతర నిర్వహణ, ఆధునికీకరణ, మాస్టర్ ప్లాన్‌పై శుక్రవారం సెక్రటేరియట్‌లో ఎంపీ బలరాం నాయక్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నుంచి ఆమోదం వచ్చిన వెంటనే పనులను ప్రారంభించాలని, 100 రోజుల్లో పనులు పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని ఆఫీసర్లకు సూచించారు.
మాస్టర్ ప్లాన్‌ను ఇప్పటికే సీఎం పరిశీలించారని, వచ్చే వారంలో మేడారంలో సీఎం పర్యటించనున్నందున తగిన ప్రణాళికలు, సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మేడారం పూజారుల ఆలోచనలకు అనుగుణంగానే ఆధునికీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ తుది నమూనా ఇంకా ఖరారు కాలేదని, మేడారం ఆలయ ప్రాంగణ మూల స్వరూపంలో ఎలాంటి మార్పులు చేయడం లేదన్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ ఆవరణలోనే స్వల్ప మార్పులు చేస్తామన్నారు. పూజారుల కోరిక మేరకు సమ్మక్క, సారలమ్మ గద్దెల వరుస క్రమంలోనే పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను నిర్మిస్తామని, భక్తులందరూ దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
ఆదివాసీ, కోయ ఆచార సంప్రదాయాలు, కట్టుబాట్లకు అనుగుణంగా ఆధునీకరణ పనులు చేపడుతామని పేర్కొన్నారు. సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ పాల్గొన్నారు.
త్వరలో సీఎం పర్యటన
మేడారం మహాజాతర కోసం చేపడుతున్న అభివృద్ధి పనులతో పాటు మాస్టర్ ప్లాన్ అమలుకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి మేడారం రానున్నట్లు తెలుస్తోంది. సీఎం వెంట మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు ఇతర మంత్రులు, ఆఫీసర్లు రానున్నట్లు సమాచారం.
