
మెదక్ టౌన్, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అలర్ట్గా ఉందని, నిరంతరం వరద సహాయక చర్యల్లో పాల్గొంటుందని కలెక్టర్ రాహుల్ రాజ్తెలిపారు. శుక్రవారం హవేలీ ఘనపూర్ మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మండలంలోని పోచమ్మరాల్ సమీపంలో జాతీయ రహదారిపై కొట్టుకుపోయిన బ్రిడ్జిని, ఆర్మీ బృందం చేపట్టిన చర్యలను పరిశీలించారు.
మంజీరా పరివాహక గ్రామాలు సర్ధన, బూర్గుపల్లిలో రోడ్డు కొట్టుకుపోగా తాత్కాలిక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసిందన్నారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్న కుమార్, తహసీల్దార్ సింధు రేణుక, సీఐ రాజశేఖర్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.