నిజాంపేట, వెలుగు: మెదక్ జిల్లా నిజాంపేట మండలం ఖాసీంపూర్ గ్రామంలో తమను కులం నుంచి బహిష్కరించారని ఆరు కుటుంబాలకు చెందిన బాధితులు బుధవారం మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కథనం ప్రకారం.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ కులానికి చెందిన వారంతా ఒక సర్పంచ్ అభ్యర్థికి మద్దతు ఇవ్వగా, ఆరు కుటుంబాలు ఆ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదు. దీంతో రెండు నెలలుగా వారిని కులం నుంచి బహిష్కరించారని బాధితులు తెలిపారు. వారితో ఎవరూ మాట్లాడొద్దని, సామాజికంగా దూరం పాటించాలని ముదిరాజ్ కుల పెద్దలు ఆదేశించినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని, జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు స్థానిక పోలీసు అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.
