ఉమ్మడి మెదక్ ​జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ ​జిల్లా సంక్షిప్త వార్తలు


4 రోజుల్లో రూ.42 కోట్ల మద్యం అమ్మకాలు

సిద్దిపేట, వెలుగు :  దసరా పండగ సిద్దిపేట జిల్లా అబ్కారి శాఖకు కాసుల వర్షాన్ని కురిపించింది. పండుగ రోజున మద్యం అమ్మకాలు ఏకంగా రూ.15.61 కోట్లు దాటగా, గత నాలుగు రోజుల్లో రూ.42 కోట్లు దాటాయి. సెప్టెంబర్ నెలంతా 121.23 కోట్ల అమ్మకాలు జరగగా,  అక్టోబరు మొదటి ఐదు రోజుల్లో 2న గాంధీ జయంతి సందర్భంగా అన్ని వైన్​ షాపులు బంద్​ ఉండగా మిగతా నాలుగు రోజుల్లోనే రూ.42 కోట్లు దాటింది. జిల్లాలో మొత్తం 69 వైన్​షాపులు, 12 బార్లు ఉండగా దసరాకు రెండు రోజుల పాటు మద్యం ప్రియులతో కిటకిటలాడాయి. గ్రామాల్లో బెల్టు షాపుల్లోనూ జోరుగా మద్యం అమ్మకాలు సాగాయి. జిల్లాలో దాదాపు వెయ్యికి పైగా బెల్టు షాపులు ఉన్నా ఎక్సైజ్ అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇదిలా ఉండగా కొన్ని షాపుల్లో కల్తీ మద్యం అమ్మకాలు జరిపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


పెట్రోల్ లో నీళ్లు!

కొమురవెల్లి మండల కేంద్రంలోని ఇండియన్​ పెట్రోల్ బంక్ లో బుధవారం పెట్రోల్ లో నీళ్లు రావడంతో వాహనదారులు ఆందోళన చెందారు. వాహనాలు నడవకుండా దారిలో నిలిచిపోవడంతో ఇబ్బంది పడ్డామని పలువురు వినియోగదారులు బంక్ యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని ఇండియన్ ఆయిల్ కంపెనీ గోడౌన్​యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లామని, తమ దగ్గర పెట్రోల్ కొనుగోలు చేసినవారికి నష్టం జరగకుండా చూస్తామని బంక్ ​సిబ్బంది హామీ ఇవ్వడంతో వినియోగదారులు శాంతించారు.

వెంకటస్వామికి భారత రత్న ఇవ్వాలి


జహీరాబాద్, వెలుగు :   మాజీ కేంద్రమంత్రి, దివంగత గడ్డం వెంకటస్వామి జయంతిని మాలమహానాడు ఆధ్వర్యంలో బుధవారం జహీరాబాద్  నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండల కేంద్రంలో  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జహీరాబాద్ తాలూకా అధ్యక్షుడు దీపక్ ఆకాశ్ మాట్లాడుతూ దళిత జాతి గర్వించదగ్గ గొప్ప నేత వెంకటస్వామి అని,  ఆయనకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కార్మికుల హక్కుల కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. వెంకటస్వామి ట్రస్టు ద్వారా ఎన్నో మంచి పనులు చేశారన్నారు. కార్యక్రమంలో మాలమహానాడు  నాయకులు సిద్ధూ, మనోజ్, ప్రశాంత్, వంశీ, దన్ను, శ్రీకాంత్, బాలు పాల్గొన్నారు. 


బీఆర్ఎస్​తో దేశవ్యాప్తంగా అభివృద్ధి
ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి

మెదక్​టౌన్, వెలుగు :  బీఆర్​ఎస్​తో దేశవ్యాప్తంగా తెలంగాణ తరహా అభివృద్ధి జరుగుతుందని మెదక్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి అన్నారు. టీఆర్​ఎస్​ను బీఆర్​ఎస్​గా మార్చిన సందర్భంగా గురువారం మెదక్​లోని ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసులో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కేక్​కట్ చేశారు. కార్యక్రమంలో మెదక్​ మున్సిపల్​వైస్​ చైర్మన్ మల్లికార్జున్​గౌడ్, పార్టీ మెదక్ టౌన్​ ప్రెసిడెంట్​ గంగాధర్, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, పార్టీ లీడర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ వర్షం కురిసింది. వర్గల్ మండలంలో అత్యధికంగా 98.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్, పాత బస్టాండ్, శివాజీ నగర్, హైదరాబాద్ రోడ్డులో భారీగా నీళ్లు నిలువడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు.

బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ

సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట పట్టణంలోని 24 వార్డులో బుధవారం అర్ధరాత్రి టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య  గొడవ జరిగింది. స్థానికులు, పోలిసులు తెలిపిన ప్రకారం.. సిద్దిపేట పట్టణం భరత్ నగర్ లో దేవీనవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం వద్ద టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య రాజకీయపరంగా మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. ఒక్కసారిగా కొంతమంది యువకులు బీజేవైఎం లీడర్ నీలం దినేశ్ ​ఇంటిపై కర్రలు, కట్టెలతో దాడిచేశారు. అతడి ఇంట్లో వారిని గాయపర్చారు. దీంతో వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ డాక్టర్లు అందుబాటులో లేరు. దీంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధర్యంలో ఆసుపత్రి ముందు నిరసన తెలిపారు. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నాడు మున్సిపల్ చైర్ పర్సన్ కు వ్యతిరేకంగా పోటీ చేశారనే కారణంతోనే నీలం దినేశ్, అతడి తల్లిదండ్రులు, సన్నిహితులపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళనకారులకు సర్దిచెప్పారు. గాయపడిన వారికి హాస్పిటల్ లో చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. అనంతరం దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ లీడర్లు సిద్దిపేట వన్ టౌన్ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

కలెక్టరేట్​లో యోగా కేంద్రం ప్రారంభం

సంగారెడ్డి టౌన్ , వెలుగు : ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి ఏకైక సాధనం యోగ అని సంగారెడ్డి అడిషనల్​ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్​ఆవరణలో వెంకట సాయి ఫ్రెండ్స్ అసోసియేషన్ పోతిరెడ్డిపల్లి స్పాన్సర్​ చేసిన  యోగా కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు శంకరి విజయేందర్ రెడ్డి, సభ్యులు నాయి కోటి రామప్ప, వెంకటేశం, వెంకటేశ్వరరావు , మోహన్ రెడ్డి, కిరణ్, అల్లం రెడ్డి, కృష్ణ రెడ్డి నవాజ్ రెడ్డి, సతీశ్, మురళి ,అంజయ్య, విజయ భాస్కర్, అశోక్, రమేశ్​ పాల్గొన్నారు.

పీఏసీఎస్​ గోడౌన్​కు భూమిపూజ 

మెదక్ (కౌడిపల్లి), వెలుగు: పీఏసీఎస్​చైర్మన్​ బాన్సువాడ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ జాతీయ రహదారి పక్కన పీఏసీఎస్​ భవనానికి గురువారం నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్ రెడ్డి భూమి పూజ చేశారు. గోడౌన్​ నిర్మాణానికి రూ.54 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్​ వైస్ చైర్మన్ చిన్న చిన్నంరెడ్డి, సీఈవో దుర్గా గౌడ్, సర్పంచుల ఫోరం ప్రెసిడెంట్​వెంకటేశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ దివ్యా మహిపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ నవీన్ కుమార్ గుప్తా, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గుంజరి ప్రవీణ్ కుమార్, చంద్రం కృష్ణ గౌడ్, వెంకట్ రెడ్డి, డైరెక్టర్లు మల్లేశ్​యాదవ్, రమేశ్​గుప్తా,  రైతులు పాల్గొన్నారు.

ఆలయ నిర్మాణానికి హామీ 

కౌడిపల్లి లో ముదిరాజ్ లు మీటింగ్​లు ఏర్పాటు చేసుకునేందుకు రూ.20 లక్షలతో నిర్మించిన షెడ్​ను గురువారం ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. కౌడిపల్లిలో తన సొంత నిధులతో పెద్దమ్మ దేవాలయాన్ని నిర్మిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హమీ ఇచ్చారు.

శివ్వంపేటలో పార్కు...

మెదక్ (శివ్వంపేట), వెలుగు : శివ్వంపేట మండల కేంద్రంలో స్థానిక జడ్పీటీసీ సభ్యుడు పబ్బా మహేశ్​గుప్త తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన పార్కును దసరా పండుగ సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా మహేశ్​ గుప్తా సొంత నిధులతో  ప్రజా సమస్యలు పరిష్కరించడం గొప్పవిషయమన్నారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ మహేశ్​గుప్తా,  స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు రమణగౌడ్, జడ్పీ కో- ఆప్షన్ సభ్యులు మన్సూర్,  టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సుధీర్ రెడ్డి, నాయకులు పైడి శ్రీధర్ గుప్తా,  సీనియర్ నాయకుడు  కృష్ణారావు,  ఉప సర్పంచ్ పద్మా వెంకటేశ్,  గ్రామ కమిటీ అధ్యక్షుడు ముద్దగాల లక్ష్మీనర్సయ్య, వార్డు సభ్యులు పోచాగౌడ్,  కొండల్   పాల్గొన్నారు.