ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

జోగిపేట, వెలుగు :  ‘అందోల్​ నియోజకవర్గ అభివృద్ధి విషయమై చర్చకు తాను సిద్ధంగా ఉన్నాను. మీరు రెడీనా?’ అంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌‌ సవాల్‌‌ విసిరారు. మంగళవారం క్యాంపు ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత  దామోదర పత్తాలే రని, కరోనా సమయంలోనూ కనిపించలేదన్నారు.   2014 కంటే ముందు గ్రామాల్లో జరిగిన పనులు, కేసీఆర్‌‌ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని పోల్చి చూసుకోవాలన్నారు. కేసీఆర్‌‌పై ప్రజలకు విశ్వాసం ఉందని, రాబోయే రోజులో కాంగ్రెస్‌‌ పార్టీకి తగిన గుణపాఠం తప్పదన్నారు. 

అర్హులందరికీ ‘ఆసరా’

పుల్కల్/వెలుగు :  అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందుతాయని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. చౌటకూర్ మండల పరిధిలోని లబ్ధిదారులకు మంగళవారం సరాఫ్​పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్​లో ఆయన పింఛన్​ కార్డులతోపాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. 

ఈటల అసత్య ప్రచారాలు మానుకోవాలె
ఎమ్మెల్యే సతీశ్​కుమార్​

కోహెడ (హుస్నాబాద్​), వెలుగు : హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అసత్య ప్రచారాలు మానుకోవాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్ అన్నారు. రాష్ట్రంలో గురుకుల, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రుల మనోభావాలను ఆయన దెబ్బ తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల కింద హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడిలో విద్యార్థుల భోజనం నాణ్యతపై ఈటల చేసిన అనుచిత వ్యాఖ్యలను వొడితెల ఖండించారు. మంగళవారం హుస్నాబాద్​లో ఆయన మీడియాతో మాట్లడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వం ఒక్కో స్టూడెంట్​పై రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తోందన్నారు. మెను ప్రకారం పౌష్టికాహారం అందిస్తోందని తెలిపారు. వాటి నిర్వహణపై చర్చకు సిద్ధమా అని సవాల్​ విసిరారు. రానున్న ఎన్నికల్లో ఈటలకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

మత్స్యకారుల అభివృద్ధికి కృషి

మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి టీఆర్ఎస్​ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​ అన్నారు. మంగళవారం ఆయన హుస్నాబాద్​ ఎల్లమ్మ చెరువులో చేప పిల్లలను వదిలారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లోని 134 చెరువు, కుంటల్లో రూ.63.31 లక్షల విలువైన చేప పిల్లలను వదిలినట్లు ఆయన తెలిపారు.             

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి 

చేర్యాల, వెలుగు : తెలంగాణ  పోరాట యోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సదర్భంగా మంగళవారం ఉమ్మడి మెదక్​ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహాలకు, ఫొటోలకు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేర్యాల మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో  నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు మార్గ దర్శకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. సంగారెడ్డి పరిశోధన కేంద్రం వద్ద జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ , కలెక్టర్ డాక్టర్ శరత్, ఎస్పీ రమణ్ కుమార్, అడిషనల్​ కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, మెదక్ ​కలెక్టరేట్​లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్​లో అడిషనల్​ కలెక్టర్​ ప్రతిమాసింగ్, జిల్లా బీసీ డెవలప్​మెంట్​ ఆఫీసర్​ కేశూరామ్​, సిద్దిపేట కేంద్రంలోని సుడా పార్క్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్, ఇతర ప్రాంతాల్లో పలువురు నాయకులు, అధికారలు పాల్గొన్నారు. 

బ్రహ్మచారిణి రూపంలో వనదుర్గా దర్శనం

పాపన్నపేట, వెలుగు : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడుపాయల వన దుర్గాభవాని మాత మంగళవారం బ్రహ్మచారిణి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని మూలవిరాట్ తో పాటు, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గోకుల్ షెడ్ లో ప్రతిష్ఠించిన ఉత్సవ విగ్రహాన్ని పట్టువస్త్రాలతో అలంకరించి పూజలు చేశారు. ఆలయ చైర్మన్ సాతెల్లి బాలాగౌడ్, ఈవో సారా శ్రీనివాస్​ భక్తులకు సౌకర్యాలు కల్పించారు. 

బతుకమ్మ సంబరాల్లో మెదక్ ఎమ్మెల్యే

మెదక్​, వెలుగు : హైదరాబాద్ లోని తెలంగాణ భవన్​లో మంగళవారం జరిగిన బతుకమ్మ సంబరాల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత, హైదరాబాద్ నగర మేయర్​ విజయలక్ష్మి తదితరులతో కలిసి పద్మా దేవేందర్​ రెడ్డి బతుకమ్మ పేర్చారు. అనంతరం వారితో కలిసి బతుకమ్మ ఆడారు. 

దేవి ఆశీస్సులతోనే దుబ్బాక అభివృద్ధి
ఎమ్మెల్యే రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు: అమ్మవారి ఆశీస్సులతోనే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే రఘునందన్​రావు తెలిపారు. దేవి నవరాత్రుల సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో ప్రతిష్ఠించిన అమ్మవారికి ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. నియోజక వర్గ ప్రజలు పాడి పంటలు, సుఖ సంతోషాలతో ఉంచాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం మిరుదొడ్డి మండలం అక్బర్​పేట సర్పంచ్​ధర్మారం స్వరూప భిక్షపతి కారును, ట్రాక్టర్​ను గుర్తుతెలియని దుండగులు తగుల పెట్టిన విషయాన్ని తెలుసుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దుండగులను అరెస్ట్​ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఏసీపీ దేవారెడ్డికి సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంబటి బాలేశ్​గౌడ్, చింత సంతోష్​, మచ్చ శ్రీనివాస్​, పుట్ట వంశీ, సుంకోజి ప్రవీణ్​ పాల్గొన్నారు.