కోడి రూ.400..యాటకు రూ.10 వేలు..మేడారంలో ఏది కొన్నా డబుల్ రేట్లు

కోడి రూ.400..యాటకు రూ.10 వేలు..మేడారంలో ఏది కొన్నా డబుల్ రేట్లు
  •     చిల్డ్ బీర్‍ రూ.270.. క్వార్టర్ సీసా రూ.400
  •     కొబ్బరికాయల జత రూ.100.. పుచ్చకాయ రూ.300   
  •     బాత్రూం సైజ్‍ గదికి రోజు కిరాయి రూ.5 వేలు  
  •     కొనలేక తలలు పట్టుకుంటున్న భక్తులు

వరంగల్‍, వెలుగు:  మేడారం మహా జాతరలో ఏది కొనాలన్నా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొబ్బరికాయ మొదలు కోడి, ఊదు పుల్ల, యాట పిల్ల ఇలా ఏది కొందామన్నా రేట్లు మండిపోతున్నాయి. అమ్మవారి మొక్కుల్లో భాగంగా  కొబ్బరికాయలు కొట్టాలన్నా.. కోడిని కోయాలన్నా సామాన్య భక్తులకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. దర్శనం అనంతరం ఎండ తట్టుకోలేక చల్లగా ఓ బీరు కొట్టాలన్నా.. రాత్రిపూట చలికి ఓ పెగ్‍ వేయాలన్నా రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. బయట మార్కెట్‍లో దొరికే ధరలకు ఇక్కడి షాపులోళ్లు అమ్ముతున్న ధరలకు పొంతనే లేదు. అన్నింటిపై డబుల్‍ రేట్లు వసూలు చేస్తున్నారు. ఎక్కువ పైసలు పెట్టినా జాతరలో దొరుకుతున్న వస్తువులన్నీ సెకండ్​గ్రేడ్​వే. దీంతో మొక్కు తీర్చుకునేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు జాతర ఖర్చు లిమిట్‍ దాటుతోంది.

అన్నింటిపై అదనమే 

జాతరలో వ్యాపారులు చెప్పిందే రేటు.. ఇచ్చిందే సరుకు అవుతోంది. బయట రూ.15–30కు దొరికే కొబ్బరికాయ జతను ఇక్కడ రూ.100కు విక్రయిస్తున్నారు. కిలోన్నరకు అటూఇటుగా ఉండే కోడిని రూ.270–300 చెబుతున్నారు. దానిని కోసి చికెన్‍ ఇవ్వడానికి ఒక్కో దానికి రూ.100 అడుగుతున్నారు. మొత్తంగా రూ.400 ఖర్చు చేయాల్సి వస్తోంది. నాటు కోడికి రూ.500 నుంచి రూ.550 వరకు పెట్టాల్సి వస్తోంది. 

యాట మొక్కుఉన్నోళ్లకు రూ.5 వేలు ఎక్స్ ట్రా

యాట మొక్కు ఉన్నోళ్లు జాతరలోని ధరలు చూసి తలలు పట్టుకుంటున్నారు. 12 నుంచి 14 కిలోల మేకను రూ.8 వేల నుంచి రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. యాటను కోయడానికి ఛార్జీ కింద రూ.900 నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు. కాళ్లు కాపితే రూ.350 నుంచి రూ.400 తీసుకుంటున్నారు. ఇదంతా జరిగాక బరువు చూస్తే 6–7 కిలోల దాటడం లేదు. మొత్తంగా బయట రూ.4వేల నుంచి 5 వేలకు దొరికే మటన్‍కు ఇక్కడ రూ.10 వేలు దాటుతోంది. 

పెగ్గు లేసుడు కష్టమే

జాతరలో లిక్కర్ దందా నడుస్తోంది. అఫిషియల్‍గా పదుల సంఖ్యలో మాత్రమే వైన్‍ షాపులకు పర్మిషన్‍ ఉండగా.. అన్‍ అఫిషియల్‍గా జాతర చుట్టూరా వందల షాపులు నడుస్తున్నాయి. ఇష్టారీతిన డబుల్‍ రేట్లు వసూలు చేస్తున్నారు. లైట్‍ బీర్‍ బయట వైన్‍ షాపుల్లో రూ.150 ఉండగా ఇక్కడ రూ.250 నుంచి రూ.260 తీసుకుంటున్నారు. రూ.160 స్ట్రాంగ్‍ బీర్‍ ను రూ.260 నుంచి రూ.280 వరకు అమ్ముతున్నారు. రూ.200 నుంచి రూ.280 మధ్యన ఉండే, పేద, మధ్యతరగతివారు ఎక్కువగా తాగే క్వార్టర్‍ లిక్కర్​ను రూ.320 నుంచి రూ.450 వరకు విక్రయిస్తున్నారు. రూ.840ల రాయల్‍ స్టాగ్‍ ఫుల్​బాటిల్​పై అదనంగా రూ.350 నుంచి రూ.400 దండుకుంటున్నారు. నలుగురైదుగురితో కలిసి జాతరకు వచ్చిన వారికి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. బయట రూ.30–40లకు దొరికే చిన్న పిల్లల ఆట వస్తువులు రూ.100 ఫిక్స్​డ్​రేట్‍ పెట్టేశారు. లీటర్‍ పెట్రోల్‍ రూ.109 ఉండగా జాతరలో రూ.220, డీజిల్‍ రూ.98 ఉండగా రూ.200కు అమ్ముతున్నారు. చివరకు రూ.100 విలువ చేసే నాలుగు కిలోల పుచ్చకాయను రూ.300 నుంచి రూ.400కు విక్రయిస్తున్నారు.

10 గదులకు కలిపి ఒకటే బాత్రూమ్

మేడారం జాతరలో ఫ్యామిలీతో కలిసి రెండ్రోజులు ఉండాలనుకునేవారికి అతిపెద్ద ఖర్చు గది కిరాయిలే. జాతర ఖర్చు మొత్తం ఒక్క ఎత్తయితే.. షెల్టర్ కోసం అంతకు రెండింతలు పెట్టాల్సి వస్తోంది. జాతర జరిగే ప్రధాన తేదీలకు రెండు రోజుల ముందు నుంచే స్థానికులు ఇండ్ల కిరాయిలను ఆకాశానికి ఎత్తేశారు. వన్​డే సింగిల్‍ రూముకు రూ.5 వేలు తీసుకుంటున్నారు. సదరు రూముకు కనీసం సపరేట్‍ బాత్రూమ్ ఫెలిసిటీ లేదు. 10 గదులకు కలిపి ఒకటే బాత్రూమ్ ఉంటోంది. కొందరు ఓనర్లు వారి ఇంటి ముందు లేదా ఇంటి వెనకాల సిమెంట్‍ సంచులతో పరదాలు కట్టి, వాటికి సైతం రూ.2 వేల నుంచి రూ.3 వేలు వరకు వసూలు చేస్తున్నారు.

జాతరలో కల్తీ లిక్కర్‍.. కెమికల్​ ఫుడ్‍

మేడారం(వరంగల్‍) :  మేడారం సమ్మక్క, సారక్క జాతరలో అడుగడుగునా కల్తీ ఫుడ్​అమ్ముతున్నారు. డబుల్​రేట్​పెట్టినా మంచి ఫుడ్​దొరకడం లేదు. అమ్మవారి బెల్లం ప్రసాదం నుంచి లిక్కర్‍, ఫాస్ట్​ఫుడ్, బిర్యానీ వరకు భక్తులకు కల్తీవే అంటగడుతున్నారు. ఈ తరహా బిజినెస్‍ చేస్తున్నవారిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. యాక్షన్​తీసుకోవాల్సిన అధికారులు మమ అనిపించి వెళ్లిపోయారు. జాతరతోపాటు చుట్టూరా దాదాపు 50 వేలకు పైగా షాపులు నడుస్తుండగా, నలుగురైదుగురు ఫుడ్‍ సేఫ్టీ ఆఫీసర్లు మాత్రమే పనిచేస్తున్నారు. జాతరలో అఫిషియల్​గా 22 వైన్‍ షాపులు ఉన్నాయి. అన్‍అఫిషియల్‍గా వేల బెల్ట్​షాపులు నడుస్తున్నాయి. టెంపరరీ షాపుల్లో కూల్​డ్రింక్స్​అమ్మే ఫ్రిజ్​ఉందంటే అక్కడ లిక్కర్‍ దొరుకుతున్నట్లే. ఇదే అదునుగా మెజార్టీ నిర్వాహకులు అడుగడుగునా కల్తీ లిక్కర్​విక్రయిస్తున్నారు. ఎక్కువ ధర ఉండే స్కాచ్‍ బాటిళ్లలో చీప్​లిక్కర్‍ లేదంటే నీటితో కలిపి కల్తీ చేస్తున్నారు. అలాగే కెమికల్స్​ కలిపిన ఫుడ్‍ ను అమ్ముతున్నారు. ఫాస్ట్​ఫుడ్‍, బిర్యానీ, చక్కెర పదార్థాలతో తయారుచేసే  ప్రసాదాలను అడుగడుగున కల్తీ చేస్తున్నారు. బిర్యానీల్లో రోజులకొద్ది మరిగిన నూనెలను వాడుతున్నారు. బెల్లం విక్రయాలు సైతం ఇదే తరహాలో సాగుతున్నాయి. మేడారం జాతరకు వారం ముందు ఫుడ్‍ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీల పేరుతో వచ్చి మమ అనిపించారు. జాతరలో వేలాది షాపులు ఉండటం.. ఉమ్మడి వరంగల్‍, ఖమ్మం, ఆదిలాబాద్‍ జిల్లాల్లో ఆఫీసర్లు, సిబ్బంది కలిపి కేవలం 10 నుంచి 15 మంది మాత్రమే ఉండటంతో చేతులెత్తేశారు. 

ఏదీ కొనేటట్టు లేదు

జాతరలో కోడి నుంచి కొబ్బరికాయ వరకు, మంచినీళ్ల బాటిల్ నుంచి బీర్‍ బాటిల్​వరకు ఏదీ కొనేటట్టు లేదు. షాపోళ్లు ఏదడిగినా డబుల్‍ రేటు చెబుతున్నరు. ఫ్యామిలీతో వస్తే రూ.8 వేల నుంచి రూ.10 వేలు ఖర్చవుతుందనుకున్న. డబుల్​రేట్లతో రూ.15 ఖర్చయింది. ఒకట్రెండు వస్తువులు తప్పించి, మిగిలినవన్నీ ఇంటికాన్నుంచి తెచ్చుకోవడమే బెటర్‍.

- శ్యామ్‍ నాయక్‍, నయీంనగర్‍, హనుమకొండ

‘‘మేడారం మహాజాతరకు వచ్చిన ఓ ఫ్యామిలీ నాలుగు కిలోల బరువు ఉన్న రెండు బ్రాయిలర్‍ కోళ్లు తీసుకుంది. కిలోకు రూ.180 చొప్పున రూ.720 చెల్లించింది. దానిని స్కిన్​లెస్‍ చేయడానికి ఒక్కో కోడికి రూ.60 రూపాయల చొప్పున రూ.120 ఇచ్చింది. మొత్తంగా చికెన్​కోసం ఆ ఫ్యామిలీ రూ.850 – 950 ఖర్చు పెట్టింది. స్కి న్‍లెస్‍ చేయించాక చివరికి 2 కిలోల చికెన్ చేతికొచ్చింది. బయట కిలో చికెన్‍ రూ.200 ఉండగా జాతరలో రూ.450 ఖర్చు పెట్టాల్సి వచ్చింది.’’