జనవరిలోపు మేడారం జాతర పనులు పూర్తి చేయాలి: మంత్రి సీతక్క

జనవరిలోపు మేడారం జాతర పనులు పూర్తి చేయాలి: మంత్రి సీతక్క

మంగపేట, వెలుగు: ఈనెలలోపు మేడారం జాతర పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. జిల్లా కలెక్టర్  ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్ తో కలిసి శుక్రవారం జాతర పనులను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.  మొదటగా వీఐపీ పార్కింగ్  స్థలం, ఆర్టీసీ బస్టాండ్, హరిత హోటల్, జంపన్న వాగు స్నానఘట్టాలు, స్తూపం రోడ్డు, కొత్తూరు సమీపంలోని టాయిలెట్ల పనులను  పరిశీలించారు.

 అనంతరం కన్నేపల్లి గ్రామంలోని సారలమ్మ దేవాలయ పరిసరాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఈ సందర్బంగా స్థానిక పూజారి కాక  రంజిత్..  దేవాలయ సమీపంలో టాయిలెట్లు, తాగునీరు, లైటింగ్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి.. సంబంధిత అధికారులను పిలిచి కన్నెపల్లి గ్రామంలో భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో సీతక్క మాట్లాడారు. వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు.