నేటి నుంచి మేడారం హుండీల లెక్కింపు

నేటి నుంచి మేడారం హుండీల లెక్కింపు

వరంగల్‍, వెలుగు: మేడారం మహా జాతరలో ఏర్పాటు చేసిన హుండీలను గురువారం నుంచి లెక్కించనున్నారు. ఇప్పటికే హుండీలను హనుమకొండలోని పబ్లిక్‍ గార్డెన్ పక్కనే ఉన్న టీటీడీ కల్యాణ మండపానికి తరలించారు. బుధవారం తిరుగువారం జరిగిన నేపథ్యంలో మిగతా హుండీలను సైతం తీసుకొచ్చి లెక్కింపు మొదలుపెట్టనున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు సమ్మక్క, సారలమ్మ జాతర జరగగా మొత్తం 535 హుండీలను ఏర్పాటు చేశారు.

ఇందులో సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద 215 చొప్పున, గోవిందరాజు, పగిడిద్ద రాజు గద్దెల వద్ద 26 చొప్పున హుండీలతోపాటు, మరో 30 క్లాత్‍ హుండీలను ఏర్పాటు చేశారు. మిగతావి తిరుగువారం కోసం పెట్టారు. లెక్కింపు జరిగే టీటీడీ కల్యాణ మండపం చుట్టూరా సీసీ కెమెరాలు బిగించడంతోపాటు, 24 గంటలూ పోలీస్‍ సెక్యూరిటీ ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఒడి బియ్యం, కరెన్సీ, నాణేలు, బంగారం, వెండిని వేర్వేరుగా లెక్కించనున్నారు. మొత్తం హుండీలను తెరిచి కానుకలను లెక్కించేందుకు సుమారు 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.