ఈసారీ టెంపరరీ పనులే..మరో ఆర్నెళ్లలో మేడారం మహా జాతర

ఈసారీ టెంపరరీ పనులే..మరో ఆర్నెళ్లలో మేడారం మహా జాతర
  • రూ.200 కోట్లు ఇస్తానని ఐదేండ్ల కింద హామీ ఇచ్చి మరిచిన సీఎం కేసీఆర్‌‌‌‌
  • ఈసారి  కూడా రూ.75 కోట్లతో ప్రపోజల్స్​ పంపిన ఆఫీసర్లు
  • ఏటా నిర్వహణ ఖర్చులే తప్ప పర్మినెంట్​ పనుల్లేవు..
  • సరిపోను సౌలతులు కల్పించకుంటే భక్తులకు ఇబ్బందులే

జయశంకర్‌‌ ‌‌భూపాలపల్లి, వెలుగు:  సీఎం కేసీఆర్​ తల్లుల సాక్షిగా ఇచ్చిన హామీకి  ఐదేండ్లు దాటింది.  మధ్యలో రెండు జాతర్లు పోయాయి. 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మరోసారి మేడారం మహాజాతర జరగబోతున్నది. దీనికి ఇంకా ఆరు నెలల గడువే ఉంది.  ఈ సారైనా మేడారంలో పర్మినెంట్​ అభివృద్ధి పనుల కోసం సీఎం కేసీఆర్‌‌‌‌  ఫండ్స్​ కేటాయిస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్న భక్తులకు మరోసారి నిరాశ తప్పేలా లేదు.  ఎందుకంటే 2024 మహా జాతర కోసం కేవలం రూ.75 కోట్లతో ములుగు కలెక్టర్‌‌‌‌ కృష్ణ ఆదిత్య ప్రభుత్వానికి ప్రపోజల్స్‌‌‌‌ పంపించారు. వీటిలో ఎక్కువ ఫండ్స్​ జాతర నిర్వహణ ఖర్చుల కోసం పెట్టాల్సినవే!  అంటే ఈసారి కూడా చిన్నా చితకా పనులు తప్ప పర్మినెంట్​ పనులు ఉండవని సర్కారు చెప్పకనే చెప్పింది.

మూడు జాతరలుగా ఇదే పరిస్థితి..

మహాజాతర విషయంలో సీఎం కేసీఆర్‌‌‌‌ హామీ ఇచ్చిన తర్వాత రెండు సార్లు  సమ్మక్క సారలమ్మ జాతర్లను ప్రభుత్వం నిర్వహించింది.  2020లో రూ.184 కోట్లతో ప్రపోజల్స్‌‌‌‌ పంపితే రూ.75 కోట్లు, 2022లో రూ.100 కోట్లతో ప్రపోజల్స్‌‌‌‌ పంపిస్తే రూ.75 కోట్లు శాంక్షన్​ అయ్యాయి. వీటిలో రూ.50 కోట్లకు పైగా ఫండ్స్​ కేవలం జాతర నిర్వహణ కోసమే ఖర్చు చేశారు. మిగిలిన వాటితో చిన్న, చితకా పనులు మాత్రమే చేశారు.  సమ్మక్క సారలమ్మ మహా జాతర శాశ్వత అభివృద్ధి పనుల కోసం  రూ.200 కోట్లు కేటాయిస్తామని 2018లో సీఎం కేసీఆర్‌‌ ‌‌స్వయంగా గద్దెల వద్ద హామీ ఇచ్చారు.  కానీ ఆ ఫండ్స్​ ఇప్పటివరకు రిలీజ్​ చేయలేదు.  మరో ఆరు నెలల్లో 2024 మేడారం మహా జాతర ఉండగా  సీఎం హామీ మరోసారి తెరపైకి వచ్చింది. 

ఈ సారి కూడా రూ.75 కోట్లతో  ప్రపోజల్స్‌‌‌‌

ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో 21 ప్రభుత్వ శాఖలు భాగస్వామ్యమవుతాయి.  ఈ శాఖల ద్వారా చేపట్టబోయే పనుల కోసం మేడారంలో ఇటీవల కలెక్టర్‌‌‌‌ కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో రివ్యూ  జరిగింది. రాబోయే మహాజాతర కోసం ఈ సారి కేవలం రూ.75 కోట్లతో ప్రభుత్వానికి ప్రపోజల్​ పంపించారు.  శాఖల వారీగా ఈ పనులను పరిశీలిస్తే 70 శాతానికి పైగా ఫండ్స్​ జాతర నిర్వహణ కోసం రెగ్యులర్‌‌‌‌గా చేసే ఖర్చులే.  భక్తుల కోసం ఏర్పాట్లు, ఉద్యోగుల టీఏ, డీఏలు బిల్లులు, టెంట్లు, లైట్లు, కలర్స్‌‌‌‌, వెహికల్స్‌‌‌‌ తదితర ఖర్చులే ఉన్నాయి.  నిరుడు జాతర నిర్వహణకు రూ.100 కోట్లతో ప్రపోజల్స్‌‌‌‌ పంపిస్తే రూ.75 కోట్లు  శాంక్షన్​ కాగా ఈ సారి రూ.75 కోట్లతో ప్రపోజల్స్‌‌‌‌ పంపితే ఎన్నికోట్లు మంజూరవుతాయో ఆఫీసర్లకు కూడా తెలియడం లేదు.

ఈ పనుల మాటేమిటి ?

గతంలో మేడారం మహా జాతర అంటే ప్రభుత్వం కేటాయించిన ఫండ్స్​తో మేడారం నుంచి చుట్టూ 50 కిలోమీటర్ల వరకు పనులు చేసేవారు. ముఖ్యంగా కొత్త రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, కంకర, మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా మార్చడం, రోడ్లను వెడెల్పు చేయడం వంటి పనులు చేపట్టేవారు. కానీ ఈ సారి మేడారం పరిసర ప్రాంతంలో ఉన్న అంతర్గత రోడ్లను బాగు చేయడానికే ఆఫీసర్లు మొగ్గు చూపించారు. జంపన్నవాగులో  ఊరట్టం కాజ్‌‌‌‌వే దెబ్బతిని మహారాష్ట్ర,  ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌ భక్తులు మేడారం చేరడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.  చుట్టూ తిరిగిరావాల్సి వస్తోంది. మేడారం వచ్చే  రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇవే కాకుండా లింక్‌‌‌‌రోడ్లు, అంతర్గత రోడ్లతో పాటు  చిలుకలగుట్ట రోడ్డు కూడా దెబ్బతింది. భక్తులు గంటల కొద్దీ నిలబడే క్యూలైన్లలో యూరినల్స్, టాయిలెట్ల ​సౌలత్​ కల్పించాల్సి ఉంది. అంతర్గత డ్రైనేజీ, శాశ్వత అభివృద్ధి పనుల భూసేకరణ కోసమే రూ.40 కోట్ల వరకు అవసరం ఉంది.  ఈ పనులు కావాలంటే కనీసం రూ.200 కోట్లకు పైగా ఫండ్స్​ కావాలి. 2018లో మహా జాతర కొచ్చిన సీఎం కేసీఆర్‌‌ వచ్చే జాతర నాటికి రూ.200 కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చి ఐదేండ్లైనా నెరవేర్చకపోవడంపై గిరిజనులు ఆగ్రహంతో ఉన్నారు. 

 ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం  అభివృద్ధిని గత పాలకులెవ్వరూ పట్టించుకోలేదు. అందువల్ల భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. మేడారం శాశ్వత అభివృద్ధి కోసం రూ.200 కోట్లు మంజూరు చేస్తా.. జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి కలెక్టర్‌‌‌‌ వెంటనే సంబంధిత అన్ని శాఖల అధికారులతో సమావేశమై ఎక్కడెక్కడ ఏయే పనులు చేపట్టాల్సిన అవసరం ఉందో  గుర్తించి వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించండి..2018 మహా జాతరలో సీఎం కేసీఆర్‌‌‌‌ 

ప్రభుత్వానికి  ప్రపోజల్స్‌‌‌‌ పంపించాం..

 మేడారం మహాజాతర 2024 నిర్వహణ కోసం ఇటీవల మేడారంలో ఆఫీసర్లతో మీటింగ్‌‌‌‌ పెట్టాం. మహాజాతర నిర్వహణకు అవసరమైన ఫైల్స్‌‌‌‌ రెడీ చేసి ప్రభుత్వానికి ప్రపోజల్స్‌‌‌‌ పంపించాం.  21 ప్రభుత్వ శాఖల తరపున రూ.75 కోట్లు  శాంక్షన్​ చేయాలని కోరాం.  ఫండ్స్​ శాంక్షన్​ కాగానే టెండర్లు పిలిచి పనులు చేపడుతాం.

కృష్ణ ఆదిత్య, ములుగు కలెక్టర్‌‌‌‌