అమ్మలు అడవికి.. భక్తులు ఇండ్లకు

అమ్మలు అడవికి.. భక్తులు ఇండ్లకు
  • ముగిసిన నాలుగురోజుల మేడారం మహాజాతర
  • జనవరి నుంచి శనివారం వరకు కోటి 30 లక్షల మంది భక్తుల రాక

మేడారం(జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి), వెలుగు: త్యాగాల తల్లీబిడ్డలు సమ్మక్క, సారలమ్మ వన ప్రవేశం చేయడంతో శనివారం మేడారం మహాజాతర ముగిసింది. అక్కడక్కడ స్వల్ప ఇబ్బందులు తప్ప జాతర ప్రశాంతంగా ముగిసిందని అధికారులు ప్రకటించారు. నాలుగురోజుల మహాజాతరకు  60లక్షల మంది భక్తులు వచ్చారని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌ రావు, ఇంద్ర కరణ్‌‌‌‌ రెడ్డి చెప్పారు. జనవరి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కోటీ 30 లక్షల మంది మేడారానికి వచ్చారని వాళ్లు వివరించారు. అక్కడక్కడ స్వల్ప ఇబ్బందులు తప్ప మేడారం జాతర ప్రశాంతంగా ముగిసినట్లుగా రాష్ట్ర మంత్రులు ఎర్ర బెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌ రావు, ఇంద్ర కరణ్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ప్రకటించారు. నాలుగురోజుల మహాజాతరకు  60లక్షల మంది భక్తులు వచ్చారని, జనవరి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కోటీ 30 లక్షల మంది వచ్చారని వారు వివరించారు. 

వన ప్రవేశ కార్యక్రమం జరిగింది ఇలా..!
గిరిజన ఆచార సంప్రదాయాల ప్రకారం మేడారం దేవతల వన ప్రవేశ కార్యక్రమాలు జరిగాయి. వనప్రవేశంలో భాగంగా శనివారం సాయంత్రం 6.30 గంటలకు మేడారంలోని గద్దెల వద్ద సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు పూజలు ప్రారంభమయ్యాయి. డోలు వాయిద్యాలు, కొమ్ముబూరలు లయబద్ధంగా వాయిస్తూ, ఊదుతూ గద్దెలపై పూజలు చేశారు. ఎవరికీ కనిపించకుండా చుట్టూ చీరలు అడ్డుగా పెట్టారు. సుమారు అరగంట పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. తొలుత సమ్మక్క తల్లి పూజారులు సమ్మక్కను తీసుకుని గద్దె దిగారు. ఆ తర్వాత విడిది గృహం వద్దకు చేరుకుని నాగులమ్మను తాకి అక్కడ్నుంచి వేగంగా చిలుకలగుట్టకు పయనమయ్యారు. ఆ తర్వాత పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజు, గోవిందరాజును తీసుకుని మరికొందరు పూజారులు గద్దె దిగారు. పగిడిద్దరాజును పూనుగొండ్లకు, గోవిందరాజును కొండాయికి తీసుకెళ్లారు. చివరగా సారలమ్మను తీసుకొని కన్నెపల్లికి బయల్దేరారు. అమ్మల వనప్రవేశ కార్యక్రమం జరిగినంత సేపూ భక్తులు రెప్ప వాల్చకుండా  చూశారు. దేవతలను గద్దెకు చేర్చే క్రమంలో పోలీసులు ఎలాంటి రక్షణ కల్పించారో అంతే కట్టుదిట్టమైన భద్రత మధ్య దేవతలను వనానికి సాగనంపారు.    

కొన్ని ఇబ్బందులు ఎదురైనా..!
మేడారం మహాజాతరలో గతంలో మాదిరిగా పెద్దస్థాయిలో ట్రాఫిక్‌‌‌‌ ‌‌‌‌జామ్‌‌‌‌‌‌‌‌లు లేవు. భక్తులు సాఫీగానే మేడారం చేరుకున్నారు. జాతర మూడో రోజు ఇద్దరు భక్తులు, చివరి రోజు మరొకరు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. జాతరలో భాగంగా లగ్జరీ టెంట్లు, ఎకోటెంట్లు, హరిత హోటల్‌‌‌‌వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. జాతర నిఘాలో డ్రోన్‌‌‌‌కెమెరాలను వినియోగించారు. వీఐపీల తాకిడి పెరగడంతో పలుమార్లు క్యూలైన్లు గంటల పాటు నిలిపేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా ఈసారి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌కు చెందిన భక్తులు తరలివచ్చి నాలుగు రోజులు ఇక్కడే ఉండి మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం, క్యూలైన్లలో కొబ్బరి చిప్పలు, బెల్లం ముద్దలు పేరుకుపోవడంతో పలువురు భక్తులకు జారిపడి స్వల్ప గాయాలపాలయ్యారు. ఈసారి విజయవంతంగా ముగిసిన జాతర తిరిగి 2024 మాఘమాసంలో జరగనుంది.

తల్లులూ పోయస్తం.. అమ్మలు అడవికి.. భక్తులు ఇండ్లకు

‘తల్లీ సమ్మక్క .. అమ్మా సారక్క.. ఇగ పోయస్తం.. సల్లంగ బతుకుతె రెండేండ్లకు మళ్లస్తం..అప్పటిదాక మమ్ముల కడుపుల పెట్టుకొని కాపాడున్రి’ అంటూ భక్తులు  అమ్మలకు మరోసారి దండం బెట్టి, తిరుగుముఖం పట్టిన్రు. దేవతలు అటు వన ప్రవేశం చేయగానే ఎడ్లబండ్లు, ఆటోలు, డీసీఎంలు, బస్సులు.. ఇలా ఎట్ల వచ్చిన వాళ్లు అట్ల శనివారం సొంతూళ్లకు బయలుదేరిన్రు. నాలుగురోజుల్లో ఏం తక్కువ కోటి మంది భక్తులు తల్లుల దర్శనానికి రాగా, గుడారాలు, దుకాణాలతో జాతర ఏరియా మినీ సిటీని తలపించింది.  పిల్లపాపలు, ముల్లె మూటలతో తరలివచ్చి గుడారాలు వేసుకొని నాలుగురోజుల పాటు ఇక్కడే ఉండి తల్లులను దర్శనం చేసుకున్న భక్తులతో పాటు జాతర డ్యూటీ చేసిన పోలీసులు, ఉద్యోగులు వెళ్లిపోవడంతో మేడారం పరిసరాలు ఒక్కసారిగా బోసిపోయాయి. నిన్నటిదాక కనుచూపుమేర ఇసుకేస్తే రాలనంత జనం, చెవులు చిల్లులుపడేంత హోరుతో మారుమోగిన కొండకోనల్లో నిశ్శబ్దం అలుముకుంది.

సీఎం రాలే, గవర్నర్‌‌‌‌ వచ్చారు : మంత్రి ఎర్రబెల్లి
గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క,- సారలమ్మ మహాజాతరకు వరసగా రెండోసారి గవర్నర్‌‌‌‌‌‌‌‌ తమిళి సై వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. 2020లో గవర్నర్‌‌‌‌‌‌‌‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌  మేడారం రాగా ఈ సారి మాత్రం గవర్నర్‌‌‌‌‌‌‌‌ మాత్రమే వచ్చారు. శుక్రవారం కేసీఆర్​ మేడారం వస్తారని సీఎంవో ముందుగా ప్రకటించినా.. ఆయన రాలేదు. పడిశెం పట్టి రాలేకపోయారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌ రావు ప్రకటించారు.