మేడారం పనులు ముమ్మరం..కొనసాగుతున్న గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెల నిర్మాణం

మేడారం పనులు ముమ్మరం..కొనసాగుతున్న గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెల నిర్మాణం

ములుగు, తాడ్వాయి, వెలుగు : ఆసియా ఖండంలోని అతి పెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క –సారలమ్మ మహా జాతరకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరో రెండు నెలల్లో పనులు పూర్తయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించారు. గతేడాది కంటే ఈసారి భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 

కొనసాగుతున్న గద్దెల నిర్మాణం.. 

మాస్టర్ ప్లాన్ లో భాగంగా మేడారం సమ్మక్క –సారలమ్మ జాతరలో గోవిందరాజులు, పగిడిద్దరాజుల గద్దెల పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న స్థానం నుంచి మార్చి సమ్మక్క–సారలమ్మల గద్దెలు ఒకే వరులలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరిలో జరగనున్న మహా జాతర నేపథ్యంలో డిసెంబర్ చివరి కల్లా నిర్మాణ పనులు పూర్తయ్యే విధంగా పనులు వేగంగా జరుగుతున్నాయి. 

భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. గద్దెల నిర్మాణాలను ఆదివాసి సాంప్రదాయ పద్ధతి ప్రకారం కొనసాగిస్తుండగా, పూజారులు సూచించిన అంశాలను పరిగణలోనికి తీసుకున్నారు. మాస్టర్​ ప్లాన్​ అమలులో భాగంగా ప్రభుత్వం రూ.215 కోట్లు విడుదల చేసింది. జాతర పనులను పర్యవేక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను ఆదేశించారు.