నాడెం చెరువు తూము ధ్వంసం

నాడెం చెరువు తూము ధ్వంసం
  • అర్ధరాత్రి రాడ్​ను విరగ్గొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
  • దర్యాప్తు చేపట్టిన పోలీసులు 
  • ఇదే చెరువు బఫర్ జోన్​లో ఎమ్మెల్యే పల్లా కాలేజీ

ఘట్​కేసర్,​ వెలుగు : మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్​మండలం వెంకటాపూర్ గ్రామంలోని నాడెం చెరువు తూమును ధ్వంసం చేశారు. తూము ఓపెన్​చేయడానికి ఉపయోగించే రాడ్​ను శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విరగ్గొట్టారు. దీంతో దాన్ని ఎటూ కదపడానికి వీల్లేకుండా పోయింది. జేసీబీ సాయంతో తూము గోడలను, గేటును కూల్చే ప్రయత్నం చేసినట్టుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. రెండ్రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో నాడెం చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్​లోకి నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

ఆ నీళ్లు రాకుండా చేసేందుకే తూము గేట్లను ధ్వంసం చేసినట్టుగా అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ ఏఈ పరమేశ్, రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ కావ్య, పోచారం ఐటీ కారిడార్ పీఎస్​సీఐ రాజు.. చెరువు తూమును పరిశీలించారు. ఘటనపై వెంకటాపూర్ మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు నీరడి లింగం ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా, ఇరిగేషన్ ఏఈ పరమేశ్​ పోలీసులకు కంప్లయింట్​ఇచ్చారు.  

సీసీ కెమెరాలు పని చేయట్లేదట!  

బీఆర్ఎస్​ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డికి చెందిన అనురాగ్ కాలేజీ ఎదురుగానే నాడెం చెరువు తూము ఉంటుంది. కాలేజీలో సీసీ కెమెరాలు ఉన్నాయి. పోలీసులు ఆ ఫుటేజీలు అడగ్గా.. పని చేయడం లేదని సెక్యూరిటీ చెప్పడం అనుమానాలకు తావిస్తున్నది.