ముంపు ప్రాంతంలో మెడికల్ కాలేజీ

ముంపు ప్రాంతంలో మెడికల్ కాలేజీ
  • జీజీహెచ్ నిర్మాణానికి ప్లాన్
  • మంచిర్యాల సాయికుంటలో14 ఎకరాలు కేటాయిస్తూ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం
  • సబ్​మెర్జ్​ ఏరియాల్లో పర్మిషన్లు ఇవ్వొద్దన్న మంత్రి 
  • కేటీఆర్ ​ఆదేశాలు బేఖాతర్
  • ఇప్పటికే వరదల్లో మునిగిన ఎంసీహెచ్ 
  • లీడర్ల భూముల రేట్లు పెంచుకునేందుకేనా?

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల అనేక ఎకరాల ప్రభుత్వ భూములున్నప్పటికీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ నిర్మాణాలకు ముంపు భూమిని కేటాయించడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థానిక సాయికుంటలోని 662, 675 సర్వేనంబర్లలోని 14.13 ఎకరాల మున్సిపల్ భూమిని కాలేజీ కోసం కేటాయిస్తూ సోమవారం కౌన్సిల్ లో తీర్మానం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాంతం తోళ్లవాగు, గోదావరికి దగ్గర ఉండడంతో నిరుడు జూలైలో వచ్చిన వరదలకు పలు కాలనీలు మునిగాయి. తాజాగా మెడికల్ కాలేజీకి కేటాయించిన ప్రాంతమంతా జల దిగ్బంధమైంది. ఇక్కడ వందల కోట్లు ఖర్చు పెట్టి  మెడికల్ కాలేజీ, హాస్పిటల్ కడితే రానున్న రోజుల్లో ముంపు ముప్పు తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు. అంతేగాకుండా సబ్​మెర్జ్​ ఏరియాల్లో బిల్డింగుల నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వరాదని మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఆదేశాలు చేశారు. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు పునరాలోచన చేయడం లేదు.

అనాలోచిత నిర్ణయాలతో అవస్థలు 

ప్రజాప్రతినిధులు, అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే గోదావరి ఒడ్డున ఉన్న భూదాన్ భూముల్లో రూ.18 కోట్లతో మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్) నిర్మించారు. గత సంవత్సరం మార్చిలో హెల్త్ మినిస్టర్ హరీశ్​రావు దీన్ని అట్టహాసంగా ప్రారంభించగా, ఏప్రిల్​లో సేవలు ప్రారంభించారు. తర్వాత రెండు నెలలకే అంటే జూలైలో వచ్చిన వరదలకు ఎంసీహెచ్ బిల్డింగ్ పూర్తిగా మునిగిపోయింది. ముంపు ముప్పును అంచనా వేసి రాత్రికి రాత్రే గర్భిణులు, బాలింతలను గవర్నమెంట్ హాస్పిటల్​కు షిఫ్ట్ చేసి ఏడు నెలలుగా అక్కడే సేవలందిస్తున్నారు. జీజీహెచ్​లో సరైన వసతులు లేకపోవడంతో రూ.15 లక్షలతో తూతూమంత్రంగా రిపేర్లు చేసి ఈ నెల18న ఎంసీహెచ్​ను రీ ఓపెన్ చేసి ఓపీ సేవలు పునరుద్ధరించారు. ఆ పక్కనే ఉన్న భూదాన్ భూముల్లో 22 ఎకరాలను మెడికల్ కాలేజీ, హాస్పిటల్, నర్సింగ్ కాలేజీల కోసం కేటాయించారు. ఎంసీహెచ్ వరదల్లో మునగడంతో మరో చోట అనువైన స్థలాల కోసం అన్వేషించారు. నస్పూర్​లో సింగరేణికి చెందిన భూమిని పరిశీలించినప్పటికీ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దీంతో మున్సిపల్​ స్థలమైన సాయికుంటలో జాగాను కేటాయించారు. 

భూముల ధరలు పెంచుకునేందుకే..

సాయికుంట ప్రాంతంలో పలువురు లీడర్లకు చెందిన భూములుండడంతో వాటి ధరలు పెంచుకునేందుకే మున్సిపల్ స్థలాన్ని కేటాయించారన్న విమర్శలు వస్తున్నాయి. పోయిన ఏడాది వచ్చినట్టే భారీ వరదలు వస్తే ఓవైపు తోళ్లవాగు, మరోవైపు గోదావరి వరద ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టడం ఖాయం. గత వరదలకు సాయికుంటలోని శివారు కాలనీలన్నీ మునిగాయి. నాలుగైదు ఫీట్ల వరకు నీళ్లు రావడంతో చాలామంది ఇండ్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. మళ్లీ ఆ స్థాయి వరదలు వస్తే మెడికల్ కాలేజీ, హాస్పిటల్ పరిస్థితి ఏమిటన్న చర్చ జరుగుతోంది. అంతేగాకుండా జిల్లా కేంద్రంలో చాలా చోట్ల ప్రభుత్వ భూములున్నప్పటికీ మున్సిపల్ స్థలాన్ని కేటాయించడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే మున్సిపల్ అవసరాలకు జాగలు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పునరాలోచన చేయాల్సిన అవసరముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

కాంగ్రెస్ నిరసన.. 

సాయికుంటలోని ముంపు భూమిని మెడికల్ కాలేజీకి కేటాయించడాన్ని కాంగ్రెస్ కౌన్సిలర్లు వ్యతిరేకించారు. మున్సిపల్ కౌన్సిల్​ను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్ ప్రజాప్రతినిధులు, అధికారుల తీరును తప్పుబట్టారు. ఇప్పటికే ఎంసీహెచ్ వరదల్లో మునిగిందని, రానున్న రోజుల్లో మెడికల్ కాలేజీ, హాస్పిటల్​కు కూడా ముంపు ముప్పు తప్పదన్నారు. అధికార పార్టీ లీడర్లకు చెందిన భూముల ధరలు పెంచుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. పట్టణంలోని మరో అనువైన స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు.