మేనేజ్​మెంట్ కోటాలో ఎక్కువ సీట్లు ఇతర రాష్ట్రాలోళ్లకే

మేనేజ్​మెంట్ కోటాలో ఎక్కువ సీట్లు ఇతర రాష్ట్రాలోళ్లకే

హైదరాబాద్, వెలుగు: మన రాష్ట్రంలోని మెడికల్ సీట్లను ఇతర రాష్ట్రాల స్టూడెంట్లు తన్నుకుపోతున్నారు. మేనేజ్‌‌మెంట్ కోటా సీట్ల భర్తీలో లోకల్ కోటా, రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో ఇతర రాష్ట్రాల స్టూడెంట్లు వచ్చి ఇక్కడ పాగా వేస్తున్నారు. రాష్ట్ర సర్కార్ అడ్మిషన్ రూల్స్‌‌ మార్చకపోవడంతో మెడిసిన్ చదవాలని ఆశపడుతున్న మన స్టూడెంట్లకు సీట్లు రాక నిరాశే ఎదురవుతోంది. మేనేజ్‌‌మెంట్ కోటా సీట్లను కూడా లోకల్ స్టూడెంట్లకే కేటాయించేలా నిబంధనలు మార్చాలని మూడేండ్లుగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర సర్కార్ స్పందించడం లేదు. కనీసం ఈ ఏడాదైనా రూల్స్ మార్చాలని ప్రభుత్వానికి పేరెంట్స్‌‌ విజ్ఞప్తి చేస్తున్నారు. కొంతమంది స్టూడెంట్ల తల్లిదండ్రులు ‘‘తెలంగాణ వైద్య విద్యార్థుల బీ కేటగిరీ సీట్ల సాధన సమితి’’ పేరుతో ఓ అసోసియేషన్‌‌ ఏర్పాటు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరి మన రాష్ట్రంలోనూ లోకల్ స్టూడెంట్లకే మేనేజ్‌‌మెంట్ కోటా సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రసర్కార్​ను ఆదేశించాలని కోరుతూ కోర్టుకు వెళ్లాలని అసోసియేషన్‌‌ నిర్ణయించింది. 

ఉత్తరాది స్టూడెంట్లకే ఎక్కువ సీట్లు.. 

ప్రస్తుతం మన దగ్గర ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని సగం సీట్లను మాత్రమే మన రాష్ట్ర స్టూడెంట్లకు కేటాయిస్తున్నారు. మిగతా 50 శాతం సీట్లను మేనేజ్ మెంట్ కోటా (బీ, సీ కేటగిరీ) కింద భర్తీ చేస్తున్నారు. ఇందులో 35 శాతం సీట్లను బీ కేటగిరీ కింద విభజించి ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు. ఈ సీట్లకు మన దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల స్టూడెంట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. నీట్ ఆల్‌‌ ఇండియా ర్యాంకును బట్టి సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇక మిగిలిన 15 శాతం సీట్లను సీ కేటగిరీ (ఎన్‌‌ఆర్‌‌‌‌ఐ కోటా)గా విభజించి భర్తీ చేస్తున్నారు. ఈ సీట్లకు నీట్ క్వాలిఫై అయిన దేశ, విదేశీ స్టూడెంట్లు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెండు కేటగిరీల్లో కలిపి మన రాష్ట్రంలో దాదాపు 1,600 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. నీట్‌‌లో మన రాష్ట్ర స్టూడెంట్ల కంటే ఉత్తరాది రాష్ట్రాల స్టూడెంట్లకు మంచి ర్యాంకులు వస్తున్నాయి. దీంతో ఈ రెండు కేటగిరీల్లో ఎక్కువ శాతం సీట్లు వాళ్లకే దక్కుతున్నాయి. దీన్నే మన రాష్ట్ర స్టూడెంట్లు, పేరెంట్స్ వ్యతిరేకిస్తున్నారు. బీ కేటగిరీ సీట్లను పూర్తిగా లోకల్ స్టూడెంట్స్‌‌కే రిజర్వ్ చేసి, సీ కేటగిరీ సీట్లను మాత్రమే ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఫైనల్ రౌండ్ కౌన్సెలింగ్ తర్వాత కూడా బీ కేటగిరీ సీట్లు మిగిలిపోతే, అప్పుడు వాటిని ఓపెన్‌‌ కేటగిరీలోకి మార్చాలని సూచిస్తున్నారు. కర్నాటక, మహారాష్ట్రలో ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారని, మన దగ్గర కూడా ఆ పద్ధతి పాటించడానికి ఇబ్బందేమిటని ప్రశ్నిస్తున్నారు. 

బహుజనులకు అన్యాయం.. 

మేనేజ్‌‌మెంట్ కోటా సీట్లలో లోకల్ కోటా లేకపోవడంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా అమలు చేయడం లేదు. దీంతో ఆయా వర్గాల స్టూడెంట్లు కూడా నష్టపోతున్నారు. పోయినేడాది మన రాష్ట్రంలోని మేనేజ్‌‌మెంట్ కోటాలో సుమారు 1,200 సీట్లు ఓసీలకే దక్కాయి. ఇంకో 400 సీట్లు మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల స్టూడెంట్లకు వచ్చాయి. దీనికి రిజర్వేషన్లు లేకపోవడం ఓ కారణమైతే.. ఫీజులు, డొనేషన్లు అడ్డగోలుగా ఉండడం మరో కారణమని మెడికోలు చెబుతున్నారు. ప్రస్తుతం మన స్టేట్‌‌లో బీ కేటగిరీ సీటు ఫీజు కాలేజీని బట్టి ఏడాదికి రూ.11 లక్షల నుంచి రూ.14 లక్షలు ఉండగా... సీ కేటగిరీ ఫీజు రూ.22 లక్షల నుంచి రూ.28 లక్షల వరకు ఉంది. 

మన సీట్లు మనకు ఇయ్యరా?

మెడికల్ సీట్ల కేటాయింపు రూల్స్ లోకల్ స్టూడెంట్లకు అన్యాయం చేసేలా ఉన్నాయి. మన సీట్లు మనకేనన్న నినాదాన్ని తుంగలో తొక్కి, మేనేజ్‌‌మెంట్ కోటా పేరిట సగం సీట్లను నాన్‌‌ లోకల్స్‌‌కు కట్టబెడుతున్నారు. తెలంగాణ వాళ్లు మేనేజ్‌‌మెంట్‌‌ కోటాలో డబ్బులు పెట్టి చదివేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు.. వేరే రాష్ట్ర స్టూడెంట్లకు అవకాశం ఎందుకివ్వాలి?. ఇది పూర్తిగా లోకల్ స్టూడెంట్స్‌‌కు అన్యాయం చేయడమే అవుతుంది. దీనిపై ప్రభుత్వం ఆలోచించి రూల్స్‌‌ను పూర్తిగా మార్చాలి. ఈ విషయాన్ని హెల్త్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తాం. అయినా స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తాం.
- డి.రవిప్రసాద్‌‌, తెలంగాణ వైద్య విద్యార్థుల బీ కేటగిరీ సీట్ల సాధన సమితి