తెలంగాణలో జోరుగా పంటల సాగు .. ఈ సీజన్‌‌‌‌లో ఇప్పటికే 50 లక్షల ఎకరాలకు చేరువైన పంటలు

తెలంగాణలో జోరుగా  పంటల సాగు .. ఈ సీజన్‌‌‌‌లో ఇప్పటికే 50 లక్షల ఎకరాలకు చేరువైన పంటలు
  • ఇప్పటి వరకు అత్యధికంగా 35 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
  • 2 లక్షల ఎకరాలు దాటిన వరి నాట్లు
  • 3 లక్షల ఎకరాల్లో కంది.. 2.50 లక్షల ఎకరాల్లో మక్కలు
  • వానాకాలం పంటల సాగులో ఆదిలాబాద్ టాప్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు జోరందుకుంది. ఈ సీజన్‌‌‌‌లో ఇప్పటికే దాదాపు 50 లక్షల ఎకరాల వరకు పంటలు సాగు అయ్యాయి. ప్రధానంగా ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, నారాయణపేట్, నల్గొండ, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆసిఫాబాద్ జిల్లాల్లో పంటల సాగు ఊపందుకుంటోంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో సీజన్ ప్రారంభంలోనే రైతులు పత్తితో పాటు మక్కలు వేశారు. సీజన్ ప్రారంభంలో వానలు ముఖం చాటేసినా ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు ఊపందుకోవడంతో ఇప్పటికే పత్తి, మొక్క జొన్న పంటలు మొలిచాయి. వీటితో పాటు పునాస పంటలైన కందులు, పెసర, నువ్వులు, జొన్నల సాగులో కూడా వేగం పుంజుకుంది. 

3 లక్షల ఎకరాల్లో కంది సాగు.. 

వానాకాలం సీజన్‌‌‌‌లో అత్యధికంగా సాగయ్యే పంటల్లో పత్తి ముందుంది. ఇప్పటికే 35 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో ఈ పంట సాగు 4 లక్షల ఎకరాలు దాటేసింది. పత్తి తర్వాత కంది పంట 3 లక్షల ఎకరాల వరకు సాగైంది. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 75 వేల ఎకరాల్లో ఈ పంట వేశారు. నారాయణపేట్‌‌‌‌లో 57 వేల ఎకరాల వరకు సాగైంది. ఆదిలాబాద్ జిల్లాలో 50 వేల ఎకరాల్లో కందులు వేశారు. సంగారెడ్డి 44 వేల ఎకరాల్లో సాగైంది. ఆ తర్వాత సోయా పంటల సాగు రాష్ట్రవ్యాప్తంగా 2.63 లక్షల ఎకరాల్లో సాగైంది. 

నిర్మల్ జిల్లాలో అత్యధికంగా ఈ పంట సాగు లక్ష ఎకరాలకు చేరువైంది. కామారెడ్డి జిల్లాలో 51 వేల ఎకరాలకు పైగా వేశారు. సంగారెడ్డి జల్లాలో 47 వేల ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 45 వేల ఎకరాల్లో సోయా సాగైంది. మక్కలు 2.50 లక్షల ఎకరాల్లో సాగు కాగా, అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 55 వేల ఎకరాల్లో సాగైంది. నిజామాబాద్ జిల్లాలో 45 వేల ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 33 వేల ఎకరాల్లో మక్క పంటను రైతులు సాగు చేశారు. 

సాగులో ఆదిలాబాద్ టాప్, మేడ్చల్ లాస్ట్

వానాకాలం సాగులో ఆదిలాబాద్ జిల్లా టాప్‌‌‌‌లో నిలిచింది. ఇప్పటికే జిల్లాలో వానాకాలం పంటల్లో 5 లక్షల ఎకరాలు దాటేసింది. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 4.64 లక్షల ఎకరాల్లో పంటలు సాగై రెండో స్థానంలో నిలిచింది. ఆసిఫాబాద్ జిల్లాలో 3.50 లక్షల ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో 2.80 లక్షల ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 2.50 లక్షలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2.50 లక్షలు, నల్గొండ జిల్లాలో 2.40 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2.11 లక్షల ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో వానాకాలం పంటలు సాగయ్యాయి. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 2,500 ఎకరాల్లో, వనపర్తి జిల్లాలో 6 వేల ఎకరాల్లో మాత్రమే ఇప్పటివరకు ఈ సీజన్‌‌‌‌లో రైతులు పంటలు వేశారు.

ఖమ్మం జిల్లాలో అత్యధికంగా వరి నాట్లు..

రాష్ట్రంలోని రైతులు జూన్ నెల ప్రారంభం నుంచే వరి నార్లు పోయగా, గత నెలాఖరు నుంచి నాట్లు షురూ అయ్యాయి. ఈ నెలాఖరకు వరకు వరి నాట్లు మరింత జోరందుకోనున్నాయి. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా నాట్లు వేయకుండా నేరుగా వరి విత్తనాలు జల్లే పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ముందస్తు సాగయ్యే నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 1.50 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడడం గమనార్హం. ఆ తర్వాత కామారెడ్డి జిల్లాలో 30 వేల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. జనగామ జిల్లాలో 15 వేల ఎకరాల్లో వరిని సాగు చేశారు. మరోవైపు, మిగతా పంటల్లో పెసర్లు 30 వేల ఎకరాలు, జొన్నలు 25 వేల ఎకరాల్లో వేశారు. మినుములు 10 వేల ఎకరాల్లో వేశారు. చెరుకు పంట 15 వేల ఎకరాల్లో వేయగా, వేరు శనగ, సజ్జ నామమాత్రంగా సాగు చేశారు. నువ్వులు, సన్ ఫ్లవర్, ఆముదం, ఉలువలు వంటి పంటల సాగు ఇంకా షురూ కాలేదు.