పేరుకే జనరిక్ ...​అమ్మేది ప్రైవేట్​ మెడిసిన్​!

పేరుకే జనరిక్ ...​అమ్మేది ప్రైవేట్​ మెడిసిన్​!

వరంగల్‍, వెలుగు :  సర్కారు దవాఖానల్లో నడిచే మెడికల్‍ షాపుల్లో కేవలం జనరిక్‍ మెడిసిన్‍ మాత్రమే అమ్మాలనే నిబంధన రాష్ట్రంలో అమలు కావడంలేదు. హైదరాబాద్‍లోని గాంధీ హాస్పిటల్‍ నుంచి మొదలుకుంటే వరంగల్‍ ఎంజీఎం హాస్పిటల్‍ దాకా దవాఖానల ఆవరణలో నడుస్తున్న మెడికల్‍ షాపుల్లో ప్రైవేట్‍ మెడిసిన్‍ దందానే నడుస్తోంది. జనరిక్‍ మందులు అమ్ముతామనే పేరుతో లైసెన్సులు తీసుకుని.. ప్రైవేట్ కంపెనీల మెడిసిన్‍ అమ్ముతున్నారు. ఇంకో అడుగు ముందుకేసి.. స్వయంగా కొన్ని ఏజెన్సీలతో కలిసి రెగ్యులర్​గా నడిచే మందులను తక్కువ ధరకు తయారు చేయించి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. జనాలు నిజంగా అది జనరిక్‍ మెడిసిన్‍ అని నమ్మేలా ఎక్కువ ఎమ్మార్పీ ప్రింట్ ​చేసి సగం డిస్కౌంట్​ ఇస్తున్నట్టు నటిస్తూ దందా చేస్తున్నారు. హాస్పిటల్స్​లోని కొందరు డాక్టర్లను అనుకూలంగా మార్చుకుని తమ షాపులో దొరికే మెడిసిన్స్ ​మాత్రమే రాయిస్తున్నారు.  

సర్కారు రూల్స్​ బేఖాతర్​

రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్​లో కొనసాగే మెడికల్‍ షాపుల్లో బ్రాండెడ్‍ జనరిక్‍ మెడిసిన్‍ జాబితాలో ఉన్న మందులు తప్ప ప్రైవేట్‍ కంపెనీల మెడిసిన్‍ అమ్మొద్దని 2022 మే నెలలో సర్కారు రూల్​ పెట్టింది. జనరిక్‍ మెడిసిన్స్ ​అమ్మే షాపులను  ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో సుమారు 24 షాపులకు పర్మిషన్‍ ఇచ్చింది. ఇందులో దాదాపు అన్ని షాపుల్లోనూ ఓనర్లు తమకు లాభాలు తీసుకువచ్చే ప్రైవేట్‍ కంపెనీల మందులు, సొంతంగా తయారు చేయించిన మెడిసిన్స్ అమ్ముతున్నారు. రోజూ వేలాది మంది పేషెంట్లు వచ్చే వరంగల్‍ ఎంజీఎం, ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్స్​లోనూ ఈ దందానే సాగుతోందనే ఆరోపణలున్నాయి. సర్కారు దవాఖానలకు వచ్చే పేషెంట్లకు ప్రభుత్వమే ఫ్రీగా మందులివ్వాలి. మందులు లేనప్పుడు బయటకు రాయాల్సి వస్తే అందుబాటులో ఉండే జనరిక్‍ మెడిసిన్​ మాత్రమే రాయాలి. కానీ, ఎక్కడా అలా జరగడంలేదు. కనీసం కేంద్ర ప్రభుత్వ జన ఔషధి మందులు కూడా విక్రయించట్లేదు. దీంతో రూ.100 నుంచి 200 ఖర్చు చేయాల్సినచోట రూ.1000 పెట్టాల్సి వస్తున్నది. ఈ మెడికల్​షాపులపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతోనే యథేచ్ఛగా దందా నడుస్తోంది.  

సొంతంగా తయారీ..ఇష్టమున్నంత ఎమ్మార్పీ  

కొన్ని జనరిక్​ మెడికల్​ షాపుల ఓనర్లు ఏకంగా మెడికల్‍ ఏజెన్సీలతో కలిసి సొంతంగా మందులు తయారు చేయిస్తున్నారు. వీటిని అమ్మడమే కాకుండా ఎక్కువ మంది పేషెంట్లు వచ్చే సర్కారు దవాఖానల్లోని మెడికల్‍ షాపుల్లోనూ విక్రయిస్తున్నారు. డిస్కౌంట్‍ ఎక్కువ ఇస్తేనే జనరిక్‍ మెడిసిన్‍ అని నమ్ముతారనే ఉద్దేశంతో రూ.40 రూపాయలు ఉండాల్సిన ఎమ్మార్పీని రూ.105 ప్రింట్‍ చేసి..పేషెంట్‍కు రూ.40 రూపాయలకు అంటగడుతున్నారు. ఆ కంపెనీ మెడిసిన్‍, సిరప్‍ లు రాసేలా హాస్పిటల్స్​లోని డాక్టర్లతో ముందస్తు సెటిల్‍మెంట్లు చేస్కుంటున్నారు. ప్రిస్క్రిప్షన్‍పై ఎక్కడా డాక్టర్ పేరు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

'పీఎంబీజేపీ' పథకం.. పక్కదారి  

కేంద్ర ప్రభుత్వం ..‘ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన' (పీఎంబీజేపీ) పేరుతో తక్కువ ధరకే పేషెంట్లకు క్వాలిటీ మెడిసిన్‍ అందించేలా పథకం రూపొందించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని మేజర్‍ గవర్నమెంట్ హాస్పిటల్స్​లో మెడికల్‍ షాపులకు లైనెన్సులు ఇచ్చింది. ఇందులో దాదాపు 1451 రకాల మందులు, 250 రకాల సర్జికల్‍ ఐటెంలు అందుబాటులో ఉంచింది. పీఎంబీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ షాపుల్లో సూచించిన లిస్టులోని మెడిసిన్‍ మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. కానీ, లైసెన్సులు పొందిన ఓనర్లు మాత్రం చాటాచోట్ల ప్రైవేట్‍ లేదంటే సొంత మందులనే అమ్ముతున్నారు.  

 'ప్రైవేట్‍ బ్రాండెడ్‍'- 'జనరిక్‍' తేడా ఏంటంటే

వ్యాధుల ఆధారంగా ఫార్మా కంపెనీలు వాటిని నయం చేసే మెడిసిన్‍ తయారు చేస్తాయి. దీని కోసం కావాల్సిన సిబ్బంది, ఇన్​ఫ్రాస్ట్రక్చర్, కెమికల్స్​కోసం రూ.లక్షల నుంచి రూ.కోట్లు ఖర్చు చేస్తాయి. కాబట్టి మందును కనిపెట్టిన సదరు కంపెనీకి కొన్నేండ్ల వరకు పేటెంట్​ఇస్తారు. ఈ టైంలో మెడిసిన్​తయారు చేసిన కంపెనీ వారు తప్పా వేరే కంపెనీ ఆ మందును తయారుచేయడానికి గాని, అమ్మడానికి గాని వీల్లేదు. పేటెంట్‍ గడువు ముగిశాక ఫార్ములా రివీల్​చేస్తారు కాబట్టి అదే మెడిసిన్‍ను ఇతర కంపెనీలు తక్కువ ఖర్చుతో తయారు చేసి అమ్ముకుంటాయి. వీరికి పెద్ద ఖర్చేమీ ఉండదు కాబట్టి తక్కువ ధరకే అమ్ముతుంటాయి. వీటినే బ్రాండెడ్‍ జనరిక్‍ మెడిసిన్స్​అంటారు. రెండింటి ప్రభావం ఒక్కటే... అయినా మొదటి నుంచి మార్కెట్​లో మెడిసిన్‍ అమ్మిన కంపెనీ పేరు ఫేమస్‍ కావడంతో ఆ మందు వాడితేనే తగ్గుతుందని చాలామంది భ్రమ పడుతుంటారు. ఉదాహరణకు.. జ్వరం వస్తే చాలా మంది ‘డోలో 650’ ట్యాబ్లెట్​షీట్​ను రూ.30కి కొనుక్కుంటారు. ఇందులో ‘పారాసెటమాల్‍' అనే మందు ఉంటుంది. ఇదే మందును ‘పారాసెటమాల్​650' పేరుతో జనరిక్​లోనూ దొరుకుతుంది. దీని ధర కేవలం రూ.4.50 మాత్రమే. ఈ రెండు మందుల పనితనమూ ఒక్కటే. అయినా జనాలు బ్రాండెడ్​మెడిసిన్​అయితేనే పని చేస్తుందని అనుకుంటారు. ఇందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలపై భారం పడకుండా 'మెడికల్‍ మాఫియా' నుంచి రక్షించడానికి బ్రాండెడ్‍ జనరిక్‍ మందులను అందుబాటులోకి తెస్తున్నాయి. అలాంటి మందులను అమ్మే షాపులనే ప్రభుత్వ హాస్పిటల్స్​లో నడిపించేలా ప్రోత్సహిస్తున్నాయి.

జనరిక్​ మాత్రమే రాయాలి... 

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రతి దవాఖాన, వెల్‍నెస్‍ సెంటర్లలో కేవలం జనరిక్‍ మందులను మాత్రమే రాయాలని ఈ నెల 12న డైరెక్టర్‍ జనరల్‍ ఆఫ్ హెల్త్​సర్వీసెస్ ​డాక్టర్‍ అతుల్‍ గోయల్‍ డాక్టర్లు, హాస్పిటల్స్​ ఇన్​చార్జీలను మళ్లీ ఒకసారి ఆదేశించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంతమంది డాక్టర్లు ప్రైవేట్‍ బ్రాండెడ్‍ కంపెనీలకు లాభం చేకూర్చేలా జనరిక్‍ లిస్టులో లేని ప్రైవేట్​ మెడిసిన్‍ రాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటివారిపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. కాగా, జనరిక్‍ మందులను ప్రొత్సహించి.. మెడికల్‍ మాఫియాకు అడ్డుకట్ట వేయడంలో కేంద్ర ప్రభుత్వం ముందున్నా...రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ తరహా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందనే విమర్శలున్నాయి.

జనరిక్‍మందుల పేరుతో మోసం  

రాష్ట్రవ్యాప్తంగా జనరిక్‍, పీఎంబీజేపీ మెడిసిన్‍ లైసెన్సులు తీసుకున్న మెడికల్‍ షాపుల్లో జనరిక్‍ మందుల బదులు సొంత బ్రాండ్‍ మందులు అమ్ముతున్నారు. సర్కారు హాస్పిటల్స్​లో నడిచే మెడికల్‍ షాపుల్లోనూ జనరిక్‍ మందులే అమ్మాలన్న నిబంధన అమలు కావడంలేదు. ఎక్కువ లాభం వచ్చే ప్రైవేట్‍ కంపెనీల మందులు అంటగడుతున్నారు. కొందరు ఓనర్లు ఏజెన్సీలతో సొంతంగా మందులు తయారు చేయించి..వాటిపై ఎక్కువ ఎమ్మార్పీ వేసి తక్కువ ధరకు ఇస్తూ మోసం చేస్తున్నారు. ఇది నేను స్వయంగా పరిశీలించి తెలుసుకున్నా... ఇదే విషయాన్ని డ్రగ్స్​అసిస్టెంట్‍ డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాం.  
- చక్రపాణి
 (వినియోగదారుల మండలి రాష్ట్ర అధ్యక్షుడు)