చాలన్ చీటింగ్ కేసులో..మీ సేవ సెంటర్లపై వేటు

చాలన్  చీటింగ్  కేసులో..మీ సేవ సెంటర్లపై వేటు
  • యాదాద్రిలో రెండు, జనగామలో నాలుగు కేంద్రాలపై చర్యలు 
  • లైసెన్సులు రద్దు చేయాలని టెక్నికల్​ డిపార్ట్​మెంట్​కు సిఫార్సు

యాదాద్రి/జనగామ, వెలుగు: ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన భూ రిజిస్ట్రేషన్​ చాలన్​ పేమెంట్​ను దారి మళ్లించిన మీ సేవ సెంటర్లపై వేటుకు రంగం సిద్ధమైంది. వాటి సేవలను ఇప్పటికే నిలిపివేయగా, వాటి లైసెన్సులు రద్దు చేయాలని టెక్నికల్​ డిపార్ట్​మెంట్​కు అధికారులు సిఫార్సు చేశారు. 

యాదాద్రి, జనగామ జిల్లాల్లో 1,080 భూ రిజిస్ట్రేషన్​ డాక్యుమెంట్లకు సంబంధించిన చాలన్​ చెల్లించేందుకు పట్టాదారుల నుంచి మీ సేవ, ఇంటర్నెట్  సెంటర్ల నిర్వాహకులు, డాక్యుమెంట్​ రైటర్లు పూర్తి డబ్బులు తీసుకున్నారు. 

ఆ తరువాత ఎడిట్​ ఆప్షన్​ ఉపయోగించి 10 శాతం వరకు డబ్బులు ప్రభుత్వానికి చెల్లించి, రూ.3.90 కోట్లు సొంత అకౌంట్లలోకి మళ్లించుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే యాదాద్రి, జనగామ జిల్లాల్లో 22 కేసులు నమోదు చేసి, 30 మందిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. 

కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా..

చీటింగ్​ వ్యవహారంలో యాదాద్రి జిల్లాలోని రెండు, జనగామ జిల్లాలోని నాలుగు మీ సేవ సెంటర్లలో ఎలాంటి లావాదేవీలు జరగకుండా ఆఫీసర్లు మూసి వేయించారు. సెంటర్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చే కలెక్టర్లకు వాటిని రద్దు చేసే అధికారం కూడా ఉంది. అయితే మీ సేవ నిర్వాహకులు కోర్టుకు వెళ్లే అవకాశం ఉండడంతో, టెక్నికల్​ డిపార్ట్​మెంట్​కు ఆయా సెంటర్ల లైసెన్సులు రద్దు చేయాలని సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

 యాదాద్రి జిల్లాలో కొత్త మీ సేవ సెంటర్ల ఏర్పాటుకు గతంలో నోటిఫికేషన్​ ఇస్తే కొందరు నిర్వాహకులు  కోర్టుకు వెళ్లారు. దీంతో అనుమతుల రద్దు విషయంలో అలాంటి అవకాశం లేకుండా తెలంగాణ టెక్నికల్​ సెంటర్​కు సిఫార్సు​ చేశారు.