పాపం ఉయ్యాలవాడ వారసులు: వివాదంపై చిరంజీవి కామెంట్స్

పాపం ఉయ్యాలవాడ వారసులు: వివాదంపై చిరంజీవి కామెంట్స్

50 కోట్లా.. అంత డబ్బు ఎక్కడినుంచి తేవాలి..

ఉయ్యలవాడ నరసింహారెడ్డి వారసులు సినిమా మొదలుపెట్టే ముందు మాట్లాడిన తీరుకు, ఇప్పడు మాట్లాడుతున్న తీరుకు చాలా తేడా ఉందని మెగా స్టార్ చిరంజీవి అన్నారు. వాళ్లకు సాయం చేయాలని అనుకున్న మాట వాస్తవమని చెప్పారాయన. కానీ, ఒక్కో కుటుంబానికి రూ.2 కోట్ల చొప్పున 25 కుటుంబాలకు రూ.50 కోట్లు అడుగుతున్నారని, అంత డబ్బు తామెక్కడి నుంచి తెచ్చివ్వాలని ప్రశ్నించారు.

బ్రిటిషర్లపై పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో చిరంజీవి హీరోగా సైరా నరసింహారెడ్డి సినిమా తీసిన విషయం తెలిసిందే. ఈ కథ కోసం డైరెక్టర్ సురేంద్రర్ రెడ్డి, ప్రొడ్యూసర్ రామ్ చరణ్ ఉయ్యాలవాడ వారసులు కొందర్ని కలిశారు. వారికి అప్పడు సహాయం చేస్తామని మాటిచ్చారు. అయితే సైరా సినిమా టీం తమని మోసం చేసిందని ఇటీవలే హైకోర్టులో ఉయ్యాలవాడ వారసులు పిటిషన్ వేశారు. తమకు రూ.50 కోట్లు ఇప్పించాలని కోరుతున్నారు.

సాయం చేయాలనుకున్నాం.. కానీ,

ఉయ్యాలవాడ వారసులు కోర్టుకెక్కడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తాము మొదటి నుంచి ఉయ్యాలవాడ కుటుంబానికి ఏదో ఓ సాయం చేయాలనే అనుకున్నామని చెప్పారు. కానీ తమతో పడనివాళ్లెవరో కావాలనే ఇలా రెచ్చగొట్టి వాళ్లను డబ్బులు అడిగేలా చేస్తున్నారని చిరంజీవి ఆరోపించారు. పాపం ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు చాలా సాధారణ ఆర్థిక పరిస్థితి కావడంతో వాళ్ల ఉచ్చులో పడిపోయారని అన్నారు.

ఏ వారసులకూ హక్కు ఉండదు

వాళ్లు ముందు కలిసి మాట్లాడిన తీరు.. ఇప్పుడు వాళ్లు మాట్లాడిన తీరు ఒకలా లేదన్నారు. ఒక్కో కుటుంబానికి 2 కోట్ల చొప్పున 25 కుటుంబాలకు 50 కోట్లు ఇవ్వాలంటున్నారని, అంత అడిగితే తామెక్కడనుంచి తెస్తామని అన్నారు. అయినా 100ఏళ్లు దాటిన తర్వాత ఏదైనా చరిత్ర అవుతుందని, ఇది చరిత్ర గాథే, చరిత్రపై ఏ వారసులకు హక్కు ఉండదని చిరంజీవి అన్నారు.