బతుకుతో పోరాడుతున్న వారి కోసం టిస్సర్‌‌‌‌ ఆర్టిసన్‌‌ ట్రస్ట్‌‌

బతుకుతో పోరాడుతున్న వారి కోసం టిస్సర్‌‌‌‌ ఆర్టిసన్‌‌ ట్రస్ట్‌‌

కళలు... మనుషుల్ని బతికించడమే కాదు, ఊరికి గుర్తింపుని కూడా తెస్తాయి. అక్కడి కల్చర్​ను వేరే ప్రాంతాలకి పరిచయం చేస్తాయి. అలాంటి వందల రకాల కళలకి ఈ రోజు సరైన ఆదరణలేక మరుగున పడిపోతున్నాయి. వాటినే వృత్తిగా చేసుకున్నవాళ్లు ఇప్పుడు బతుకుతో పోరాడుతున్నారు. వాటికి తిరిగి ప్రాణం పోయడానికి మేఘా ఫన్‌‌సల్కర్‌‌‌‌ మొదలుపెట్టిందే ‘టిస్సర్‌‌‌‌ ఆర్టిసన్‌‌ ట్రస్ట్‌‌’.
ముంబైలో పుట్టి పెరిగిన మేఘ మూడు సబ్జెక్టుల్లో డిగ్రీ చదివింది. పీహెచ్‌‌డీ పూర్తిచేసి వరల్డ్‌‌ బ్యాంక్‌‌తో మల్టీ వాటర్‌‌‌‌ శానిటేషన్‌‌, గ్రామీణ జీవనోపాధి లాంటి ప్రాజెక్టుల్లో పనిచేసింది. ఇప్పుడు అర్బన్‌‌ రీజినల్‌‌ ప్లానర్‌‌‌‌గా పనిచేస్తోంది. 2015లో టిస్సర్‌‌‌‌ ఆర్టిసన్‌‌ ట్రస్ట్‌‌ పెట్టింది. (టిస్సర్ అంటే నేయడం అని అర్థం). దాని ద్వారా దేశంలోని 18 రాష్ట్రాల్లో 1000కి పైగా గ్రామాల్లోని ఆడవాళ్లకు భరోసా కల్పిస్తోంది. 10వేల కుటుంబాలు లాభం పొందుతున్నాయి. ఇదంతా చేయడానికి కారణం ఏంటంటే..

తన ప్రాజెక్టుల్లో భాగంగా దేశంలో ఉన్న చాలా గ్రామాలకు తిరిగింది మేఘ. అప్పుడే గ్రామాల్లో ఇంటికే పరిమితమైన ఆడవాళ్లను, సొంతంగా ఏదైనా చేయాలని ఉన్నా కుటుంబ బాధ్యత వల్ల చేయలేకపోతున్న వాళ్లను గమనించింది. దేశంలో ప్రసిద్ధి చెందిన హస్త కళలున్నా వాటిని పట్టించుకునే వాళ్లు లేక మరుగున పడుతున్నాయి. వాటినే నమ్ముకున్నవాళ్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కార్పొరేట్‌‌ మార్కెట్‌‌ వల్ల ట్రెడిషనల్‌‌ ఆర్ట్‌‌ కనపడకుండా పోతోంది. వాటిని తిరిగి మార్కెట్‌‌లోకి తీసుకురావడానికి కృషి చేసింది. ఎక్కడెక్కడ ఏ కళ ప్రసిద్ధి చెందిందో తెలుసుకుంది. ఆ కళ మీద ఆధారపడి బతికేవాళ్లను కలిసింది. వాళ్లకు కావాల్సిన సాయం చేయడం మొదలుపెట్టింది. 

టిస్సర్‌‌‌‌ ఏం చేస్తుంది?

ఆర్టిస్ట్‌‌లు తయారుచేసిన వస్తువులను దళారులకు, ఇతర మార్కెటింగ్‌‌ కంపెనీలకు అమ్మకుండా టిస్సర్‌‌‌‌తో కలిసి సొంతంగా మార్కెటింగ్‌‌ చేస్తారు. కస్టమర్లు ఆర్టిస్ట్‌‌ల దగ్గరనుంచి నేరుగా వస్తువులు కొనేలా మధ్యవర్తిగా ఉంటుంది టిస్సర్‌‌‌‌. వాటిని అమ్మగా వచ్చిన డబ్బును మళ్లీ ఆర్టిస్ట్‌‌లకే చేరుస్తుంది. ప్రస్తుతం 2,500 పైగా చేతి కళల వస్తువులను మార్కెటింగ్‌‌ చేస్తూ దేశంలోని అందరికీ పరిచయం చేస్తుంది టిస్సర్‌‌‌‌. ఇందులో 50కి పైగా చేనేత వస్త్రాలు, 20 రకాల టెక్స్‌‌టైల్‌‌ పెయిం టింగ్స్‌‌, 200 రకాల హస్త కళలు, బొమ్మలు, ఆర్నమెంట్స్‌‌ ఉన్నాయి. లక్షమందికి పైగా ఆడవాళ్లు ఈ ఉమెన్‌‌ ఎంపవర్‌‌‌‌మెంట్‌‌ ప్రోగ్రామ్‌‌ ద్వారా సాయం పొందుతున్నారు. ఈ వస్తువులు కొనాలంటే టిస్సర్‌‌‌‌ వెబ్‌‌సైట్‌‌లో చూడొచ్చు.

ఇవేకాకుండా...

వర్క్‌‌ వచ్చిన వాళ్లకే కాదు, ఇంట్రెస్ట్‌‌ ఉన్న ఆడవాళ్లకు కొత్త డిజైన్‌‌లు నేర్పించడానికి గ్రామాల్లోకి డిజైనర్లను తీసుకెళ్లి క్లాస్‌‌లు కూడా చెప్పిస్తుంది‌‌ మేఘ. ఇవేకాకుండా సేవ్‌‌ ది చిల్డ్రన్‌‌, గ్రామ్‌‌ మెడికల్‌‌ ప్రాజెక్ట్‌‌, యుఎన్‌‌డిపి వర్లీ ప్రాజెక్ట్‌‌లాంటి వాటిలో పాల్గొంది. నారీ శక్తి పురస్కారం అందుకుంది. ‘మన దేశం హస్త కళలకు ప్రసిద్ధి. ఇతర దేశాల్లోని మార్కెట్స్‌‌లో మన ఆర్ట్‌‌ ఇష్టపడతారు. కానీ, అసలైన హ్యాండి క్రాఫ్ట్స్‌‌ మాత్రం గ్రామాల్లోని ఆర్టిస్ట్‌‌ల దగ్గరే ఉంటున్నాయి. వాటిని మరింత అభివృద్ధి చేసి వీటి గురించి ప్రపంచానికి తెలిసేలా చేస్తా. వచ్చిన అవార్డులు నా బాధ్యతను మరింత పెంచు తున్నాయి’ అంటోంది మేఘ.