
- కాలి పగుళ్లు, గాలి ద్వారా శరీరంలోకి ‘బర్క్‌హోల్డేరియా సూడోమల్లీ’ బ్యాక్టీరియా
- సాధారణ రక్త, మూత్ర పరీక్షల్లో వ్యాధి బయటపడదు
- చీము, బ్లడ్ కల్చర్ టెస్టుల ద్వారానే వ్యాధి నిర్ధారణ
- సకాలంలో గుర్తిస్తే బెటర్.. లేదంటే ప్రాణాంతకమే
- గతంలో నిమ్స్ డాక్టర్ల స్టడీలో 58 శాతం డెత్ రేట్.. ఇక్కడికి వచ్చిన 12 కేసుల్లో ఏడుగురు మృతి
- ఏపీలో మెలియాయిడోసిస్ లక్షణాలతో 2 నెలల్లో 20 మంది మృతి
- గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన అక్కడి ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: మెలియాయిడోసిస్ అనే కొత్త రకం వ్యాధి తెలుగు రాష్ట్రాలను కలవరపెడ్తున్నది. ఫీవర్, దగ్గు, కీళ్ల నొప్పులతో సాధారణ జ్వరం మాదిరిగానే కనిపించే ఈ వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. బురద, తడి మట్టిలో ఉండే ‘బర్క్‌హోల్డేరియా సూడోమల్లీ’ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఈ వ్యాధి.. మానవ శరీరంలోకి రెండు రకాలుగా వ్యాప్తి చెందుతుంది. ఒకటి బురదలో నడిచినప్పుడు కాలి పగుళ్లు, గాయాల ద్వారా శరీరంలోకి చొచ్చుకుపోతుంది. అలాగే గాలిలో తేమశాతం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా శరీరంలోకి చేరే అవకాశం ఉంది. వర్షాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందే ఈ వ్యాధి.. ప్రధానంగా వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలకే సోకుతున్నది.
అలాగని వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికీ ఈ వ్యాధి వ్యాప్తి చెందదు. ఇమ్యూనిటీ తక్కువగా ఉండే డయాబెటిక్ పేషెంట్స్, కిడ్నీ సంబంధ సమస్యలు, క్యాన్సర్ ఉన్నవారు, అతిగా మద్యం సేరించేవారికి వ్యాధి సోకే అవకాశం ఎక్కువ. దీన్ని సాధారణ రక్త, మూత్ర పరీక్షల ద్వారా గుర్తించలేమని.. చీము(పస్), బ్లడ్ కల్చర్ టెస్టుల ద్వారానే నిర్ధారించాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. కాగా, కల్చర్ టెస్టులు చేయాలంటే మైక్రోబయాలజీ ల్యాబ్‌లు అవసరం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ పరీక్షలు చేయడం వల్ల వ్యాధిని సకాలంలో గుర్తించేకపోతున్నారు. దీంతో వ్యాధి ముదిరి అవయవాలు దెబ్బతిని ప్రాణంతకంగా మారుతోందని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపుతున్న ఈ మెలియాయిడోసిస్కేసులు మన రాష్ట్రంలో కూడా నమోదవుతున్నాయి. నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ఏటా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని.. సకాలంలో చికిత్స అందించకపోవడం వల్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటోందని డాక్టర్లు చెబుతున్నారు.
జ్వరమే కదా అని లైట్ తీస్కొవద్దు..
మెలియాయిడోసిస్ వ్యాధి సోకిన వారిలో సాధారణ జ్వర లక్షణాలతో పాటు స్కిన్ ఇన్ఫెక్షన్స్లక్షణాలు కనిపిస్తాయి. బ్యాక్టీరియా వ్యాపించే రకాన్ని బట్టి లక్షణాలు కనిపిస్తాయి. గాలి ద్వారా బ్యాక్టీరియా సోకినవారిలో సాధారణ జ్వరం వచ్చినప్పుడు ఉండే లక్షణాలే కనిపిస్తాయి. 80% మందిలో చలిజ్వరం ప్రధానంగా ఉంటుంది. అలాగే కీళ్ల నొప్పులు, శ్వాసకోశ సమస్యలు, దగ్గు, ఛాతి నొప్పి తదితర లక్షణాలు సాధారణంగా ఉంటాయి. దీంతో న్యూమోనియాగా భావించే డాక్టర్లు.. ఆ మేరకు చికిత్స అందిస్తున్నారు. దీని వల్ల కొంత ఉపశమనం కనిపించినా, మందులు మానేయగానే వ్యాధి మళ్లీ తిరగబెడుతున్నది. ఇక బురద, మట్టి నీళ్ల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందిన వారిలో చర్మంపై గడ్డలు, చీము కారడం,- నొప్పి, వాంతులు, డయేరియా, రక్తంలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెంది సెప్టిక్ షాక్‌కు దారితీస్తుంది. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో నాడీ సంబంధ మూర్చ సమస్యలు కుడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు ఎక్కువ రోజులు కనిపిస్తే మెలియాయిడోసిస్ వ్యాధిగా అనుమానించాల్సి ఉంటుంది. కానీ ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన లేక సరైన చికిత్స తీసుకోలేకపోతున్నారు. పైన పేర్కొన్న లక్షణాలు ఎక్కువ రోజులు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా మైక్రో బయాలజీ డిపార్ట్ మెంట్ ఉన్న పెద్దాసుపత్రుల్లో పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో మైక్రో బయాలజీ డిపార్ట్మెంట్ లో డాక్టర్ ఉమబాల, డాక్టర్ పద్మజ మెలియాయిడోసిస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా కూడా చికిత్స అందుబాటులో ఉంది.
రెండు దశల్లో ట్రీట్‌మెంట్..
మెలియాయిడోసిస్ వ్యాధి సోకినవారికి రెండు దశల్లో యాంటీ బయాటిక్స్ చికిత్స అందిస్తారు. మొదటి దశలో ఉన్నప్పుడు సెఫ్టాజిడైమ్, మెరోపెనెమ్ వంటి యాంటీబయోటిక్స్‌ను ఇంట్రావీనస్ ద్వారా 10 నుంచి-14 రోజులు ఇస్తారు. ఎరాడికేషన్ దశలో కో-ట్రైమాక్సజోల్, డాక్సీసైక్లిన్ వంటి ఓరల్ యాంటీబయోటిక్స్‌ను 3- నుంచి 6 నెలల పాటు ఇస్తారు. ఈ చికిత్సను సకాలంలో ప్రారంభిస్తేనే రోగులు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ వ్యాధి ముదిరిన తరువాత హైదరాబాద్ లోని నిమ్స్, ఉస్మానియా వంటి ఆసుపత్రులకు రోగులు వస్తున్నారు. అప్పటికే ఆలస్యం కావడం వల్ల చాలా సందర్భాల్లో యాంటీబయాటిక్ చికిత్స అందించినా.. ఫలితం లేకుండా పోతోందని వైద్యులు చెప్తున్నారు. ఈ బ్యాక్టీరియా రక్తంలోకి చొచ్చుకుని వ్యాప్తి చెందితే సెప్సిస్ అనే బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చి, సెప్టిక్ షాక్‌కు దారితీస్తుందని అంటున్నారు. జ్వరం, దగ్గు, చర్మ గడ్డలు వంటి లక్షణాలు కనిపిస్తే బ్లడ్ కల్చర్, పస్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.
అవగాహన అవసరం...
గతంలో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు చెందిన ఆరుగురు డాక్టర్ల బృందం.. 12 మంది మెలియాయిడోసిస్ రోగులపై స్టడీ నిర్వహించింది. 15 నెలల కాలంలో 39 ఏండ్ల సగటు వయసున్న రోగులలో ఎక్కువ శాతం వ్యవసాయం చేసే, డయాబెటిస్ ఉన్నవారే వ్యాధి బారినపడినట్లు గుర్తించారు. వ్యాధి సోకిన వారిలో లంగ్స్, బోన్, లివర్, స్కిన్, సాఫ్ట్ టిష్యూ, బ్రెయిన్, కిడ్నీలు ఎఫెక్ట్ అయినట్లు తేల్చారు. స్టడీ ప్రకారం 12 మందిలో ఏడుగురు చనిపోయినట్లు ప్రకటించారు. మొత్తం మీద 58 శాతం డెత్రేట్ఉన్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంత వైద్యుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని స్టడీ స్పష్టం చేసింది.
ఏపీలో కలకలం..
మెలియాయిడోసిస్ వ్యాధి పొరుగున ఉన్న ఏపీలో కలకలం రేపుతున్నది. అక్కడి గుంటూరు జిల్లాలోని తురకపాలెం గ్రామంలో వ్యాధి లక్షణాలతో 2 నెలల కాలంలోనే 20 మంది మరణించారు. దీంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయింది. గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. గ్రామస్తుల నుంచి శాంపిల్స్ సేకరించి చెన్నైకి పంపారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందిస్తున్నారు. ఆహారం, తాగునీరు ప్రభుత్వమే అందించాలని నిర్ణయించింది.వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు.
సకాలంలో గుర్తిస్తే నయం చేయవచ్చు..
మెలియాయిడోసిస్‌ను సకాలంలో గుర్తిస్తే యాంటీబయోటిక్స్‌తో పూర్తిగా నయం చేయవచ్చు. ఆలస్యమైతే సెప్సిస్, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు. తద్వారా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, డాక్టర్లు ఈ వ్యాధిపై అవగాహనతో ఉండాలి. దీనికి సరైన సమయంలో రోగ నిర్ధారణ కీలకం. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.
- ప్రొఫెసర్ ఎంవీఎస్ సుబ్బలక్ష్మి, హెచ్‌వోడీ, జనరల్ మెడిసిన్, నిమ్స్ హాస్పిటల్