ఉద్యోగుల సమస్యలపై హరీష్‭కు USPC వినతి

ఉద్యోగుల సమస్యలపై హరీష్‭కు USPC వినతి

తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్‭లో ఉన్న కరువు భత్యాన్ని చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సభ్యులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రి హరీష్ రావును కలిసి విన్నవించారు. అలాగే పీఆర్సీ సిఫారసు మేరకు ఆర్‭పిఎస్ 2020కి అనుబంధంగా... ఇవ్వవలసిన అన్ని  సదుపాయాలను వారికి కల్పించాలని హరీష్ రావును కోరారు. స్పెషల్ స్కేలు, కన్వేయన్స్, ఏజన్సీ తదితర అలవెన్సులను ఇవ్వాలన్నారు.  సెలవులు తదితర అంశాలపై రివైజ్డ్ ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు నెల మొదటి తేదీన చెల్లింపుకు చర్యలు తీసుకోవాలని హరీష్ రావును కోరారు. 

అలాగే.. ట్రెజరీల్లో పాస్ అయిన సప్లిమెంటరీ వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ రీయింబర్స్మెంట్, సెలవు వేతనాలు, జిపిఎఫ్, టిఎస్ జిఎల్ఐ  క్లైములు తదితర బిల్లులను.. టోకెన్ నంబర్ల వారీగా చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ( USPC ) సభ్యులు హరీష్ రావును కోరారు. ఇహెచ్ఎస్ పథకాన్ని పటిష్ట పరచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరికీ ఆరోగ్య కార్డులపై నగదురహిత వైద్యం అందించాలని అన్నారు. మోడల్ స్కూల్స్, గురుకుల, కెజిబివి, యుఆర్ఎస్, ఎయిడెడ్ తదితర విద్యాసంస్థల్లోని... ఉపాధ్యాయులు, ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని,  మెడికల్ రీయింబర్స్మెంట్ పరిమితిని కనీసం రూ. ఐదు లక్షలకు పెంచాలని హరీష్ రావును కోరారు. 

ఉద్యోగులకు హరీష్ రావు హామీ

ఉద్యోగుల సమస్యలపై స్పందించిన మంత్రి హరీష్ రావు.. బదిలీలు, పదోన్నతులకు రంగం సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విధించిన ఆర్థిక ఆంక్షల ఫలితంగా.. డిఎ ప్రకటన, జీతాల చెల్లింపు ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగు పరచుకుని అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుందామని తెలిపారు. ఆరోగ్య కార్డులపై నగదు రహిత వైద్యం అందరికీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు స్పష్టం చేశారు.