స్కూళ్లల్లో శానిటరీ ప్యాడ్స్ ఫ్రీగా ఇవ్వాలి..నెలసరి పరిశుభ్రత బాలికల ప్రాథమిక హక్కు

 స్కూళ్లల్లో శానిటరీ  ప్యాడ్స్ ఫ్రీగా ఇవ్వాలి..నెలసరి పరిశుభ్రత బాలికల ప్రాథమిక హక్కు
  •     నెలసరి పరిశుభ్రత బాలికల ప్రాథమిక హక్కు: సుప్రీంకోర్టు
  •     బాలికల కోసం స్కూళ్లలో సెపరేట్ టాయిలెట్లు ఉండాల్సిందే
  •     యూజ్ చేసిన ప్యాడ్లను పారేసే వసతుల్ని కూడా కల్పించాలి
  •     ఇది ఆరోగ్యం మాత్రమే కాదు.. బాలికల ఆత్మగౌరవం
  •     ఆదేశాలను అమలు చేయకపోతే గుర్తింపు కోల్పోతారు
  •     రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని స్కూళ్లకు సుప్రీం వార్నింగ్

న్యూఢిల్లీ: నెలసరి పరిశుభ్రత కూడా ప్రాథమిక హక్కేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద జీవించే హక్కులో ఫండమెంటల్ రైట్స్ అనేది భాగమని పేర్కొంది. పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌‌ అందించాలని, క్లీనింగ్ కోసం మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ను జస్టిస్ జేబీ పార్డివాలా, జస్టిస్​ ఆర్.మహదేవన్ కూడిన బెంచ్ విచారించింది. స్కూళ్లలో బాలికల కోసం ఒక జాతీయ విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈమేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పాఠశాలలకు పలు కీలక సూచనలు చేసింది. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలందరికీ పాఠశాలల్లో ఉచితంగా పర్యావరణహితమైన ప్యాడ్లు పంపిణీ చేయాలని తీర్పు వెలువరించింది. ‘‘గవర్నమెంట్, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్ల​లో బాలికల కోసం శుభ్రమైన, సురక్షితమైన టాయిలెట్లు ఉండాలి. దివ్యాంగుల అవసరాలకు తగినట్లుగా వసతులు కల్పించాలి. యూజ్ చేసిన ప్యాడ్లను పారేసేందుకు తగిన సౌకర్యం కల్పించాలి. లేదంటే ప్రైవేటు పాఠశాలలు గుర్తింపు కోల్పోవాల్సి ఉంటుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదించి, దేశవ్యాప్తంగా ఒకే రకమైన ‘మెన్​స్ట్రువల్ హైజీన్ పాలసీ’ని కేంద్రం అమలు చేయాలి. ఇది కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, బాలికల ఆత్మగౌరవం’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది.

బాలికల విద్యా హక్కును దెబ్బతీస్తున్నది

రుతుక్రమ సమయంలో తగిన వసతులు లేకపోవడంతో 23% మంది బాలికలు స్కూల్స్​కు వెళ్లడం మానేస్తున్నారని, ఇది వారి విద్యా హక్కును దెబ్బతీస్తోందని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. పీరియడ్స్ అనేవి శారీరక ప్రక్రియ మాత్రమే. దీనిచుట్టూ ఉన్న సామాజిక అపవాదులను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన అనేది రాష్ట్రాల బాధ్యత. దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు.  గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో సరైన వసతుల్లేక.. పీరియడ్స్ టైమ్​లో లక్షలాది మంది బాలికలు ఇండ్లకే పరిమితం అవుతున్నారు. ఈ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తగిన పరిష్కారం చూపితే.. బాలికల డ్రాపౌట్ రేటు తగ్గుతుంది. మహిళా విద్య, సాధికారత మెరుగుపడుతుంది. ఆరోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది’’ అని సుప్రీం కోర్టు బెంచ్ పేర్కొన్నది. తాము ఇచ్చే తీర్పు.. న్యాయవ్యవస్థలో భాగమైన వారికోసం మాత్రమే కాదని, సహాయం అడిగేందుకు సంకోచించే విద్యార్థినులు, నిధుల కొరత వల్ల సహాయం చేయలేని స్థితిలోని ఉపాధ్యాయుల కోసం కూడా అని తెలిపింది. ఒకవేళ బాలికలకు టాయిలెట్లు, ఫ్రీగా శానిటరీ ప్యాడ్లు అందించడంలో విఫలమైతే ప్రభుత్వాలనే బాధ్యులను చేస్తామని బెంచ్ హెచ్చరించింది.

ఆటిజం ట్రీట్​మెంట్​కు స్టెమ్ సెల్ థెరపీ చట్టవిరుద్ధం

ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్​డీ) ఉన్న పిల్లలకు ట్రీట్​మెంట్ కోసం స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించొద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ ట్రీట్​మెంట్​ను ప్రోత్సహించడం, ప్రాక్టీస్ చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఆటిజం చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీ పనిచేస్తుందని నిరూపించడానికి సరిపడా శాస్త్రీయ ఆధారా లు, క్లినికల్ ట్రయల్ డేటా లేదని కోర్టు పేర్కొన్నది. ‘‘ఆటిజం బాధిత చిన్నారుల పేరెంట్స్ తమ పిల్లలు కోలుకుంటారనే ఆశతో లక్షలు ఖర్చు చేసి ఈ చికిత్సను చేయిస్తున్నారు. దీనిని అవకాశంగా తీసుకుని ఆస్పత్రుల యాజమాన్యాలు వారిని దోపిడీ చేయకుండా ఈ తీర్పు అడ్డుకుంటుంది. ఇలాంటి ట్రీట్​మెంట్లతో పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఒక్కోసారి వారి ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంది. స్టెమ్ సెల్ థెరపీకి సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలను నిలిపివేయాలి. ఎన్ఎంసీ రూపొందించిన గైడ్​లైన్స్​ను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలి’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.