వీడియో గేమింగ్​తో​ మెంటల్​ డిజార్డర్​

వీడియో గేమింగ్​తో​ మెంటల్​ డిజార్డర్​

నాటి పాతరాతి యుగం నుంచి నేటి డిజిటల్‌‌‌‌‌‌‌‌ నానో యుగం వరకూ మానవాళి పరిణామ క్రమంలో ఊహకందని మార్పులను చవిచూశాం. అంతర్జాల వలలో భావి పౌరులు తేలిపోతున్నారు. అరచేతిలో వైకుంఠం వలె స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్ రూపాంతరం చెందింది. ఒక్క క్లిక్‌‌‌‌‌‌‌‌తో సమాచార సునామీ వెల్లువెత్తుతోంది. దూరాలు సమసిపోయాయి, సరిహద్దుల నిర్వచనాలు మారిపోయాయి. నేటి ఆధునిక మనిషి జీవనశైలిలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. చంటి పిల్లల నుంచి పండు ముసలి వరకు సెల్​ఫోన్​ మోజులో ఊగిపోతున్నారు. సమాచార మాధ్యమాల వెల్లువతో క్షణాల్లో ప్రపంచ ఘటనలు మానవాళి చెంతకి అప్రయత్నంగానే చేరుతున్నాయి. స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌, టాబ్, లాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌ వెలుగుల తెరలపై మనుషులు అతుక్కుపోతున్నారు. స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ చిత్రాలు చూపందే చంటోళ్లకు ముద్ద దిగడం లేదు. మైదానాల్లో ఆడాల్సిన పిల్లలు, యువత డ్రాయింగ్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌ లేదా బెడ్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌ల నుంచి వీడియో గేమ్స్‌‌‌‌‌‌‌‌ ఆడుతూ ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. వీడియో గేమింగ్‌‌‌‌‌‌‌‌ సైట్లు/యాప్‌‌‌‌‌‌‌‌లు పుట్టగొడుగుల్లా వెలువడటం కూడా మానసిక రుగ్మతలకు కారణం అవుతున్నాయి. 

రోజుకు ఏడెనిమిది గంటలు వీడియో గేమ్స్ మాయలో పడిపోయి నేటితరం భవిష్యత్తును, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. మితిమీరిన వీడియో గేమ్స్‌‌‌‌‌‌‌‌ ఆడుతున్న యువత దుష్ప్రభావాలకు లోనవుతూ వీడియో గేమింగ్‌‌‌‌‌‌‌‌ రుగ్మతల (గేమింగ్‌‌‌‌‌‌‌‌ డిజార్డర్‌‌‌‌‌‌‌‌, డిజిటల్‌‌‌‌‌‌‌‌ డిజార్డర్‌‌‌‌‌‌‌‌) ‌‌‌‌‌‌‌‌విషవలయంలో చిక్కి తీవ్ర మానసిక, శారీరక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. హైస్పీడ్‌‌‌‌‌‌‌‌ బ్రాడ్‌‌‌‌‌‌‌‌బాండ్‌‌‌‌‌‌‌‌, స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ ఉచిత డాటా అందరికీ అందుబాటులోకి రావడంతో బాలలు, యువత నిత్యం వీడియో గేమ్స్‌‌‌‌‌‌‌‌ చూస్తూ వ్యసనపరులు అవుతున్నారు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ తరగతులు కొనసాగడంతో బాలలు, విద్యార్థుల చేతికి స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ లేదా లాప్​టాప్‌‌‌‌‌‌‌‌లను అందిస్తున్నారు తల్లిదండ్రులు. పిల్లలు ఏ ఆటలు, ఆడియోల మోజులో మునిగిపోతున్నారో తెలియడం లేదు. 12 ఏండ్లలోపు బాలలు కూడా వీడియో గేమింగ్‌‌‌‌‌‌‌‌ రుగ్మతల బారిన పడడం విచారకరమని పెద్దలు తెలుసుకోవాలి. 

వీడియో గేమింగ్‌‌‌‌‌‌‌‌ డిజార్డర్​ అంటే..

వీడియో గేమ్స్‌‌‌‌‌‌‌‌, ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌ ఆడుతున్న యువత స్వయం నియంత్రణ కోల్పోయి దుర్వ్యసనాలపాలు కావడాన్ని ‘వీడియో గేమింగ్‌‌‌‌‌‌‌‌ రుగ్మత లేదా గేమింగ్‌‌‌‌‌‌‌‌ అడిక్షన్‌‌‌‌‌‌‌‌ లేదా ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌ గేమింగ్‌‌‌‌‌‌‌‌ డిజార్డర్‌‌‌‌‌‌‌‌’ అని అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, డబ్ల్యూహెచ్‌‌‌‌‌‌‌‌ఓలోని మరో విభాగమైన ‘ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ క్లాసిఫికేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ డిసీజేస్(ఐసీడీ)‌‌‌‌‌‌‌‌-11‘ నిర్వచనం ప్రకారం వీడియో గేమింగ్‌‌‌‌‌‌‌‌ దురలవాటుకులోనైన బాలలు, యువతీ, యువకులు తమ చదువులను, ఉద్యోగాలను మరిచి అనేక గంటలు నీలి తెరల్లో దృష్టి కేంద్రీకరించి, దినచర్యను పక్కనబెట్టి అంతర్జాల ఆటల్లో సమయాన్ని వృథా చేయడమే కాకుండా పలు శారీరక మానసిక రుగ్మతలకు గురి కావడం సర్వసాధారణం అవుతున్నది. వీడియో గేమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రుగ్మతలతో వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, విద్య, ఉద్యోగ ఉపాధులను సహితం నిర్లక్ష్యం చేయడాన్ని గేమింగ్‌‌‌‌‌‌‌‌ రుగ్మతలుగా గుర్తిస్తున్నారు. డిజిటల్‌‌‌‌‌‌‌‌ గేమింగ్‌‌‌‌‌‌‌‌ రుగ్మతను నిర్ధారించడానికి వ్యక్తి ప్రవర్తనలో వచ్చిన మార్పులను పరిశీలించాల్సి ఉంటుంది. 

దుష్ప్రభావాలు

 వీడియో గేమింగ్‌‌‌‌‌‌‌‌ క్రీడల్లో రోజుకు 7, 8 గంటలు వరకు గడపడం ప్రమాదకరమని, ఆసక్తి ఉన్నవారు రోజుకు అరగంట వరకు సమయాన్ని వెచ్చించవచ్చని, ప్రాథమిక విధులను మరిచి గంటల పాటు ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌ గేమింగ్‌‌‌‌‌‌‌‌ వలయంలో చిక్కితే పలు అనారోగ్యాలను ఆహ్వానించినట్లు అవుతుందని మర్చిపోకూడదు. పిల్లలు, యువతను వీడియో గేమింగ్‌‌‌‌‌‌‌‌ రుగ్మత నుంచి తప్పించాల్సిన బాధ్యత తల్లితండ్రులు, కుటుంబ పెద్దలు, ఉపాధ్యాయుల మీద అధికంగా ఉంటుంది. వీడియో గేమింగ్‌‌‌‌‌‌‌‌ దురలవాటుతో క్షణికావేశం, నిరాశ, ఆందోళన, ఒంటరితనం, మానసిక వ్యాకులత, చురుకుదనం కోల్పోవడం, ఆకలి లేకపోవడం, నిద్ర లేమి, స్థూలకాయం, సామాజిక నైపుణ్యాలను కోల్పోవడం, బైపోలార్‌‌‌‌‌‌‌‌ రుగ్మతలు, హింసా ప్రవృత్తి పెరగడం, కంటిపై భారం, చిరుప్రాయంలోనే కంటి అద్దాలు రావడం, మెడ/వెన్ను నొప్పులు, పనిలో ఏకాగ్రత లోపించడం, విచిత్ర ప్రవర్తనలు లాంటి తీవ్ర ప్రభావాల్ని చూపే అనారోగ్యాలు కలుగుతాయి. వీడియో గేమింగ్‌‌‌‌‌‌‌‌తో మానసిక వ్యాకులత దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటుందని పరిశోధనలు వివరిస్తున్నాయి.

చికిత్సా మార్గాలు

ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌ గేమింగ్‌‌‌‌‌‌‌‌ లేదా టెక్నాలజీ రుగ్మతలను కట్టడి చేయడానికి ‘సైకోథెరపీ లేదా టాక్‌‌‌‌‌‌‌‌ థెరపీ’ ఉపయోగపడుతుంది. గేమింగ్‌‌‌‌‌‌‌‌ డిజార్డర్‌‌‌‌‌‌‌‌ చికిత్సకు మానసిక వైద్యులు(సైక్రియాట్రిస్ట్‌‌‌‌‌‌‌‌), సైకాలజిస్ట్‌‌‌‌‌‌‌‌లను సంప్రదించాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న చికిత్సల్లో ‘కాగ్నిటివ్ బిహేవియరల్‌‌‌‌‌‌‌‌ థెరపీ’, ‘గ్రూప్‌‌‌‌‌‌‌‌ థెరపీ’, ‘ఫామిలా లేదా మ్యారేజ్‌‌‌‌‌‌‌‌ కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌’ విధానాలు ప్రయోగిస్తారు. గేమింగ్‌‌‌‌‌‌‌‌ రుగ్మతకు చికిత్స కన్న వాటి వలలో పడకుండా తల్లితండ్రులు జాగ్రత్త పడడం ఉత్తమమైన మార్గమని తెలుసుకోవాలి. మానసిక చికిత్సతో పాటు కుటుంబ సభ్యుల పాత్ర, జీవనశైలి మార్పులకు ప్రయత్నించడం లాంటి చర్యలు కూడా సత్ఫలితాలను ఇస్తాయి. డిజిటల్‌‌‌‌‌‌‌‌ యుగం తెచ్చిన అభివృద్ధి వరంతో పాటు ఇలాంటి దుష్ప్రభావాలు కూడా శాపంగా మారడం విచారకరం.  వెలుతురు వెంట నీడ, పగలు వెంట రాత్రి, సుఖం వెంట దుఃఖం, శాస్త్ర, సాంకేతిక ఉపయోగాల వెంట దుష్ప్రభావాలు జతగా ఉంటాయి. సాంకేతిక కత్తికి ఇరువైపుల పదునుంటుంది.   ప్రతి ఒక్కరు ఆధునిక శాస్త్రసాంకేతిక ఆయుధాన్ని మానవాళి సుస్థిరాభివృద్ధికి మాత్రమే వినియోగించుకోవాలి. 

-  డా.బుర్ర మధుసూదన్ రెడ్డి,
​ ఎనలిస్ట్​