ఒక్క రోజులోనే మెటా వాల్యూ రూ.18 లక్షల కోట్లు డౌన్‌!

ఒక్క రోజులోనే మెటా వాల్యూ రూ.18 లక్షల కోట్లు డౌన్‌!
  • రూ. 2.25 లక్షల కోట్లు తగ్గిన జూకర్‌‌బర్గ్‌ సంపద
  • యూఎస్ హిస్టరీలోనే అతిపెద్ద సింగిల్‌ డే లాస్‌
  • రిచ్‌ లిస్టులో అదానీ, అంబానీ దిగువకు మార్క్‌ జూకర్‌‌బర్గ్‌
  • ఆసియాలోనే రిచెస్ట్ పర్సన్‌గా ఎదిగిన గౌతమ్ అదానీ

ఒకే రోజులో 30 బిలియన్ డాలర్లు నష్టపోవడంతో ధనవంతుల లిస్టులో గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీ దిగువకు జూకర్‌‌‌‌బర్గ్‌‌ పడిపోయారు. ఫోర్బ్స్‌‌ రియల్‌‌ టైమ్‌‌ బిలియనీర్‌‌‌‌  ఇండెక్స్‌‌లో గౌతమ్‌‌ అదానీ సంపద 90.8 బిలియన్ డాలర్లకు పెరగగా, ముకేశ్ అంబానీ సంపద 89.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. జూకర్‌‌‌‌బర్గ్‌‌ సంపద 84.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఫోర్బ్స్ రియల్‌‌ టైమ్‌‌ బిలియనీర్ లిస్టులో అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ఎదగగా, రెండో ప్లేస్‌‌కు ముకేశ్ అంబానీ దిగిపోయారు. గ్లోబల్​ లిస్టులో 10 వ ప్లేస్‌‌లో అదానీ, 11 వ ప్లేస్‌‌లో అంబానీ, 12 వ ప్లేస్‌‌లో జూకర్‌‌‌‌బర్గ్‌‌ ఉన్నారు.

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: ఒకే రోజులో రూ. 18.57 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం.. మెటా (గతంలో ఫేస్‌‌బుక్‌‌) వాల్యూ ఒక్క రోజులోనే  251 బిలియన్ డాలర్లు తగ్గింది. కంపెనీ షేరు హోల్డర్లకు చేదు జ్ఞాపకం మిగిల్చింది.  యూఎస్ హిస్టరీలో ఒక కంపెనీ వాల్యూ ఒక్క రోజులోనే ఇంతలా ఎప్పుడూ పడలేదు. మెటా షేర్లు గురువారం ఒక్క సెషన్‌‌లోనే 26 శాతం పతనమయ్యాయి. మార్కెట్‌‌లో లిస్టింగ్ అయిన తర్వాత కంపెనీ షేర్లు ఇంతలా పడడం ఇదే మొదటిసారి. మెటా గురువారం నష్టపోయిన మార్కెట్ వాల్యూ, మన  దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీ మొత్తం మార్కెట్ క్యాప్‌‌ కంటే ఎక్కువ కావడం గమనించాలి. మెటాలో మార్క్‌‌ జూకర్‌‌‌‌బర్గ్‌‌కు 12.8 శాతం వాటా ఉండగా, గురువారం ఒక్క సెషన్‌‌లోనే ఆయనకు 30 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. దీంతో ఆయన సంపద 84.8 బిలియన్ డాలర్లకు తగ్గింది. 

యాపిల్‌‌, మైక్రోసాఫ్ట్‌‌లకూ తప్పలేదు..

గతంలో యాపిల్‌‌, మైక్రోసాఫ్ట్‌‌ కంపెనీల వాల్యూ  కూడా ఒకే రోజులో భారీగా తగ్గింది. 2020, సెప్టెంబర్ 3 న యాపిల్ వాల్యూ 180 బిలియన్ డాలర్లు పడింది. అదే ఏడాది మార్చి 16న మైక్రోసాఫ్ట్‌‌ వాల్యూ 177 బిలియన్ డాలర్లు తగ్గింది. మెటా విషయానికొస్తే, షేర్ల పతనంతో  కంపెనీ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు.  డిసెంబర్ క్వార్టర్‌‌‌‌ రిజల్ట్స్  పర్వాలేదనిపించినా, ఈ ఏడాదికి సంబంధించి కంపెనీ గైడ్‌‌లైన్స్‌‌ ఇన్వెస్టర్లను భయపెట్టాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. కంపెనీకి కిందటేడాది 40 బిలియన్ డాలర్ల ప్రాఫిట్ వచ్చింది. మెటాను ఇబ్బందుల్లో పెట్టింది ఫేస్‌‌బుక్ ప్లాట్‌‌ఫామేనని చెప్పొచ్చు. ఫేస్‌‌బుక్  డైలీ యాక్టివ్ యూజర్లు డిసెంబర్‌‌ క్వార్టర్‌‌లో 1.929 మిలియన్లకు  తగ్గారు.  మెటా షేర్లు పడడంపై దీని ప్రభావం ఉంది. అంతేకాకుండా  టిక్‌‌టాక్‌‌, టెలిగ్రామ్‌ల  నుంచి కాంపిటేషన్ పెరగడం మెటాను ఇరకాటంలో పెడుతోంది.