లేఆఫ్‌ల గండం మళ్లీ వచ్చేసింది.. మెటాలో 6వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన..!

లేఆఫ్‌ల గండం మళ్లీ వచ్చేసింది.. మెటాలో 6వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన..!

కాస్ట్ కటింగ్ లో భాగంగా పలు దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెటాలో మరో రౌండ్ లేఆఫ్‌లు మొదలవనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ ధృవీకరించారు. ఈ మధ్య జరిగిన ఓ మీటింగ్‌లో ఆయన ఎంప్లాయిస్‌కి ఈ సమాచారాన్ని అందజేశారు. నిజం చెప్పాలంటే ఉద్యోగులకు ఇదేం అంత షాక్ కు గురిచేయే విషయమేం కాదు. కానీ ప్రభావం మాత్రం చాలా గట్టిగానే ఉంటుంది.

ఈ ఏడాది మే నెలలో మరో రౌండ్ లేఆఫ్‌లు తప్పవని సీఈవో జుకర్‌ బర్గ్ గతంలోనే స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ... ఎంత మంది స్టాఫ్ ను తొలగిస్తున్నారన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం కొన్ని రిపోర్ట్‌ల ఆధారంగా చూస్తే... వేలాది మందిని తొలగించనున్నట్టు సమాచారం. కనీసం 6 వేల మందిని ఇంటికి పంపే ఛాన్స్ ఉన్నట్టు పలు నివేదికలు చెబుతున్నారు. ఈ ప్రక్రియ వచ్చే వారంలో మొదలవుతుందని సమాచారం.

గతేడాది నవంబర్‌లో 11 వేల మందిని, ఈ ఏడాది మార్చిలో 10 వేల మందిని మెటా తొలగించింది. ఈ సారి 6 వేల మందిని తీసేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫేస్‌బుక్‌లో 4 వేల మందిని తొలగించింది. బిజినెస్‌ టీమ్స్‌లోనే ఎక్కువ సంఖ్యలో లేఆఫ్‌లు ఉంటాయని నిక్ క్లెగ్‌ సంకేతాలిచ్చారు. ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో ఉద్యోగులను తీసివేయడమే తప్ప మరే మార్గం కనిపించడం లేదని ఆయన చెప్పారు. ఏం చేయాలో అర్థం కాక ఉద్యోగులను తొలగిస్తున్నట్టు నిక్ వివరించారు.