IPL  2024: అంపైర్లను అంబానీ కొనేశారు..! నెట్టింట RCB ఫ్యాన్స్ విస్తృత చర్చ

IPL  2024: అంపైర్లను అంబానీ కొనేశారు..! నెట్టింట RCB ఫ్యాన్స్ విస్తృత చర్చ

సొంత మైదానంలో హార్దిక్ సేన అదరగొట్టిన సంగతి తెలిసిందే. గురువారం(ఏప్రిల్ 11) వాంఖ‌డే గడ్డపై ముంబై ఇండియన్స్ బ్యాటర్లు.. బెంగళూరు బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (34 బంతుల్లో 69), రోహిత్‌ శర్మ (24 బంతుల్లో 38) విధ్వంసానికి సూర్య(19 బంతుల్లో 52) మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వడంతో పాండ్యా జట్టు అలవోకగా విజయం సాధించింది. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని 93 బంతుల్లోనే చేధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ ఘోర ఓటమిని ఆర్‌సీబీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

అంపైర్లను కొనేశారు..!

ఈ మ్యాచ్‌లో అంపైర్లు.. ముంబై ఇండియన్స్‌కు అనుకూలంగా నిర్ణయాలు ఇచ్చారని ఆర్‌సీబీ అభిమానులు ఆరోపిస్తున్నారు. అందుకు సాక్ష్యాలుగా కొన్ని స్క్రీన్ షాట్లను పోస్ట్ చేస్తున్నారు. అందులో ఒకటి నో బాల్ కాగా.. ఆన్‌ఫీల్డ్ అంపైర్ ఇవ్వలేదు. దీనిని సమీక్షించిన థర్డ్ అంపైర్.. ఆన్‌ఫీల్డ్ అంపైర్ల నిర్ణయానికి కట్టుబడి ఉండటం గమనార్హం. మరొక స్క్రీన్ షాట్‌లో ముంబై ఫీల్డర్ బౌండరీ లైన్‌కు ఆనుకొని ఉన్న సమయంలో బంతి అతని కాలికి తగిలి ఉంది. అయినప్పటికీ.. దీన్ని ఆన్‌ఫీల్డ్ అంపైర్లు ఫోర్ గా ప్రకటించలేదు. ఇవన్నీ చూస్తుంటే.. మ్యాచ్ ముందే ఫిక్సయినట్లు కనిపిస్తోందని ఆర్‌సీబీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

కింద నుండి రెండో స్థానం

గత మ్యాచ్ వరకూ ఐదారు స్థానాల్లో ఉంటూ అభిమానులకు సంతోషాన్ని కలిగించిన ఆర్‌సీబీ జట్టు.. ఉన్నట్టుండి పాయింట్ల పట్టికలో కిందకు పడిపోయింది. 6 మ్యాచ్‌ల్లో ఐదు ఓటములతో కింద నుండి రెండో స్థానం(పైనుండి తొమ్మిదో ప్లేస్)లో ఉంది. వీరి కంటే కింద ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కరే ఉన్నారు. శుక్రవారం(ఏప్రిల్ 12) ఢిల్లీ జట్టు.. లక్నోతో తలపడాల్సి ఉంది. అందులో పంత్ సేన విజయం సాధిస్తే.. ఆర్‌సీబీ అట్టడుగుకు చేరుతుంది.