టాప్‌‌ 3 లో ఇండియా : దేశ ఎకానమీపై ముకేశ్ అంబానీ​​ నమ్మకం 

టాప్‌‌ 3 లో ఇండియా : దేశ ఎకానమీపై ముకేశ్ అంబానీ​​ నమ్మకం 

ఎకానమీపై ముకేశ్​​ నమ్మకం  పదేళ్లలోపే సాధించేస్తామన్న రిలయన్స్​ చైర్మన్​

‘ప్రీమియం డిజిటల్‌‌ సొసైటీ’ గా ఇండియాకు చాన్స్​     ఉత్సాహంగా మైక్రోసాఫ్ట్ డీకోడెడ్ సమ్మిట్‌‌

 

మొబైల్‌‌ నెట్‌‌వర్క్‌‌ వేగంగా విస్తరిస్తుండటంతో ‘ప్రీమియర్‌‌‌‌ డిజిటల్‌‌ సొసైటీ’గా మారడానికి ఇండియాకు అవకాశం ఉందని ముకేశ్ అంబానీ అన్నారు. వచ్చే పదేళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎకానమీగా ఇండియా అవతరించనుందని అభిప్రాయపడ్డారు. మైక్రోసాఫ్ట్‌‌ ఫ్యూచర్‌‌‌‌ డీకోడెడ్‌‌ సీఈఓ సమ్మిట్‌‌లో ముకేశ్ పాల్గొన్నారు. ముకేశ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. ప్రీమియం డిజిటల్‌‌ సొసైటీగా మారడానికి  మొబైల్‌‌ నెట్‌‌వర్క్‌‌ చాలా అవసరమని అన్నారు.  ఇండియాలో మొబైల్‌‌ నెట్‌‌వర్క్‌‌ ముందు కంటే ఇప్పుడు వేగంగా విస్తరిస్తోందని  తెలిపారు. ఇది ఇండియా ప్రీమియర్‌‌‌‌ డిజిటల్‌‌ సొసైటీగా మారేందుకు మంచి అవకాశం కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. గ్లోబల్‌‌ టాప్‌‌ 3 ఎకానమీలో ఇండియా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని, కానీ దీనిని సాధించడానికి ఐదేళ్లా లేదా పదేళ్లా అనేది చర్చనీయాంశమన్నారు.  ఐఎంఎఫ్‌‌ డేటా ప్రకారం ప్రస్తుతం ఇండియా అతిపెద్ద ఐదో ఎకానమీగా ఉంది.

టెక్నాలజీ సంస్కరణలలో మేము భాగమయ్యాం…

నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌‌లో చేరినప్పుడు(1992లో) ఇండియా ఎకానమీ 300 బిలియన్‌‌  డాలర్లుగా ఉండేదని ముకేశ్ అన్నారు.  ప్రస్తుతం ఇండియన్‌‌ ఎకానమీ 3 ట్రిలియన్‌‌ డాలర్లకు (ట్రిలియన్‌‌ అంటే  లక్ష కోట్లు) ఎదిగిందన్నారు. ఈ అభివృద్ధంతా టెక్నాలజీ సహకారంతోనే జరిగిందని తెలిపారు. అప్పట్లో   టీసీఎస్‌‌, ఇన్ఫోసిస్‌‌ రాకతో టెక్నాలజీ ఊపందుకుని, ఫైనాన్షియల్, ఎకనమిక్ సంస్కరణలకు దారి తీశాయని గుర్తుచేశారు. కానీ నరేంద్ర మోడీ 2014 లో అధికారంలోకి వచ్చాక, డిజిటల్‌‌ ఇండియాతో  దేశంలో ఆర్థిక సంస్కరణలు సూపర్‌‌‌‌ ఛార్జ్‌‌ అయ్యాయని పొగిడారు.  జియో లాంచ్‌‌తో ఈ టెక్నాలజీ సంస్కరణలలో మాకు కూడా చిన్న పాత్ర ఉండడం గౌరవంగా ఉందన్నారు.

ఇంటర్నెట్ స్పీడ్ పెంచిన జియో

2016లో జియో లాంచ్‌‌ చేయక ముందు ఇండియాలో ఇంటర్నెట్‌‌ స్పీడ్‌‌ 256 కేబీపీఎస్‌‌ అని, జియో మార్కెట్‌‌లోకి వచ్చాక ఈ స్పీడ్‌‌ 21 ఎంబీపీఎస్‌‌కు చేరిందని అన్నారు. ప్రస్తుతం ఇండియాలోని ప్రతి మారుమూల గ్రామంలోనూ ఇంటర్నెట్‌‌ వాడుతున్నారని తెలిపారు. జియోకి ముందు ఒక జీబీ డేటా కాస్ట్‌‌ రూ. 300–500 మధ్య ఉండేదని, ఇప్పుడు రూ. 12–14 మాత్రమేనని వివరించారు. కేవలం మూడేళ్లలోనే  38 కోట్ల మంది కస్టమర్లు జియో 4జీ ప్లాట్‌‌ఫార్మ్‌‌కు మారారని ముకేశ్ చెప్పారు.

కొత్త ఇండియాను చూస్తారు..

ఇండియాలో  యూపీఐ ట్రాన్సాక్షన్‌‌లో 100 శాతం గ్రోత్‌‌ ఉందని అన్నారు. ప్రస్తుతం రూ. 2 లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయని తెలిపారు.  ఈ జర్నీ ప్రారంభంలోనే ఉన్నామని, మరింత  వేగంగా ముందుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇండియాలో గేమింగ్ ఇండస్ట్రీ అతిపెద్ద గేమ్‌‌ ఛేంజర్‌‌‌‌ అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇది మ్యూజిక్, మూవీస్‌‌, టీవీ షోల మొత్తానికి సమానంగా ఎదుగుతుందన్నారు.‘నువ్వు( నాదెళ్ల), నేను చూసిన దాని కంటే భిన్నమైన ఇండియాను తర్వాతి తరం చూడనుంది’ అని ముకేశ్ తెలిపారు. డొనాల్డ్‌‌ ట్రంప్‌‌ ఇండియా విజిట్‌‌ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇండియా అంతకుముందు అమెరికా ప్రెసిడెంట్‌‌ బిల్‌‌క్లింటన్‌‌ లేదా బరాక్ ఒబామా చూసిన  దానికంటే భిన్నంగా ఉందన్నారు. ట్రంప్‌‌కు స్వాగతం పలకడానికి వచ్చిన లక్షల మంది ప్రజలు ఇప్పుడు స్ట్రాంగ్‌‌ మొబైల్‌‌ నెట్‌‌వర్క్‌‌ను అనుభవంలో చూస్తున్నారని తెలిపారు.

రూ.వెయ్యి, ఒక చైర్‌‌‌‌ మాత్రమే పెట్టుబడి….

50 ఏళ్ల క్రితం ధీరూబాయ్‌‌ అంబానీ రిలయన్స్‌‌ని స్థాపించారని, అప్పుడు రూ. 1000 క్యాపిటల్‌‌, ఒక చైర్‌‌‌‌ మాత్రమే ఆయన పెట్టుబడన్నారు. ఆ తర్వాత ఈ కంపెనీ దేశంలోనే అతిపెద్ద ఎంటర్‌‌ప్రైజ్‌‌గా ఎదిగిందన్నారు. ధీరూబాయ్‌‌ అంబానీలా మారడానికి ఇండియాలో ఉన్న ప్రతి స్టార్టప్‌‌ ఓనర్‌‌కూ అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే ఇండియాను ఇతర దేశాల కంటే మెరుగ్గా, భిన్నంగా చూపిస్తోందన్నారు. ఇండియాలో ఎంఎస్‌ఎంఈలే 70 శాతం ఉద్యోగాలు ఇస్తున్నాయన్నారు.

టెక్నాలజీ మెరుగుపడాలి : సత్య నాదెళ్ల

ఇండియన్‌‌ బిజినెస్‌‌ లీడర్లు తమ కంపెనీల టెక్నాలజీ సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకోవాలని మైక్రోసాఫ్ట్‌‌ సీఈఓ సత్యనాదెళ్ల అన్నారు. మూడు రోజుల పర్యటన‌‌లో భాగంగా ఇండియాకు వచ్చిన ఆయన, మైక్రోసాఫ్ట్‌‌ ఫ్యూచర్‌‌‌‌ డీకోడెడ్‌‌ సీఈఓ సమ్మిట్‌‌లో మాట్లాడారు.  ఇండియన్‌‌ సీఈఓలు తమ టెక్నాలజీ సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రొడక్టివిటీని పెంచడానికి డిజిటల్‌‌ వ్యవస్థ అవసరమని అన్నారు.  ఇండియాలోని సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ ఇంజినీర్లలో 72 శాతం మంది టెక్నాలజీ ఇండస్ట్రీకి వెలుపల పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ మార్పుపై కంపెనీ ఉద్యోగులకు ట్రైనింగ్‌‌ ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని ఇదే ఈవెంట్‌‌లో పాల్గొన్న టీసీఎస్‌‌ చీఫ్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌, మేనేజింగ్‌‌ డైరక్టర్‌‌‌‌ రాజేష్‌‌ గోపీనాథన్‌‌ అన్నారు. స్కిల్స్‌‌ ఉన్నవాళ్లను వెతుక్కోవడం కంటే, టాలెంట్‌‌ ఉన్నవాళ్లను నిలుపుకోవడం దీని ద్వారా వీలవుతుందని తెలిపారు. ప్రస్తుత యువతరం తొందరగా నేర్చుకునే స్వభావం కలవారన్నారు.