మూడు కార్లలో ఢిల్లీకి గంజాయి ట్రాన్స్ పోర్ట్

మూడు కార్లలో ఢిల్లీకి గంజాయి ట్రాన్స్ పోర్ట్
  • నల్గొండ జిల్లాలో అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడు అరెస్ట్, మరో ఆరుగురు పరార్
  • 250 కేజీల గంజాయి, 2 కార్లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం 

చిట్యాల, వెలుగు: ఒడిశా, ఏపీ నుంచి ఢిల్లీకి గంజాయిని తరలిస్తున్న ఢిల్లీకి చెందిన అంతర్రాష్ట్ర ముఠాలోని ఒకరిని నల్గొండ జిల్లా చిట్యాల పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ శివరాంరెడ్డి మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం తెల్లవారుజామున చిట్యాల ఎస్ఐ రవికుమార్ సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. టౌన్ లోని సుజనా థియేటర్ సమీపంలో రోడ్డు పక్కన అనుమానాస్పదంగా హోండా సిటీ కారు ఆగి ఉంది. పోలీసులు వెళ్లడంతో  అందులోని వ్యక్తి పారిపోయేందుకు యత్నించగా పట్టుకున్నారు.

 ఢిల్లీకి చెందిన నూర్ మహమ్మద్ అలియాస్ రాజాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదే సమయంలో మరో ముగ్గురు స్విఫ్ట్ డిజైర్ కారులో రాగా ఆపేందుకు పోలీసులు యత్నించగా స్పీడ్ గా పోనిచ్చారు.  కొద్ది దూరంలో  ఆపారు. ఆ వెంటనే సియాజ్ కారులో మరో ముగ్గురు రాగా.. అందులో వెళ్లిపోయారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సమీపంలోని పోలీసు స్టేషన్లకు సమాచారం అందించారు. నూర్ మహమ్మద్ చెప్పిన వివరాల ఆధారంగా ఢిల్లీకి చెందిన మోనిశ్ అలియాస్ రాహుల్ మిశ్రా ముఠాలో భాను, కన్హయి అధికారి, జమీల్, యూపీకి చెందిన బబ్లు, మంగల్,  నూర్ మహమ్మద్ సభ్యులుగా ఉన్నారు.

 ఢిల్లీకి గంజాయి తెస్తే రూ. 20 వేల చొప్పున ఇస్తానని, మూడు కార్లు ఇచ్చి మోనిశ్​ ముఠా సభ్యులను పంపించాడు. వీరు ఒడిశా, ఏపీకి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద 500 కేజీల గంజాయి కొన్నారు.  హోండా సిటీ, సియాజ్ కార్లలో 250 కిలోల చొప్పున తీసుకుని వస్తున్నారు.  అయితే.. హోండా సిటీ కారుతో నూర్ మహమ్మద్ పట్టుబడడంతో 250 కేజీల గంజాయిని, 2కార్లను, 6తత సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ నాగరాజు, ఎస్ఐ రవికుమార్, సిబ్బందిని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.  

కోరుట్లలో పట్టుబడిన మరో ముఠా  

అర కేజీ గంజాయి, 3 బైకులు, 5 సెల్​ఫోన్లు​ స్వాధీనం

కోరుట్ల,వెలుగు:  గంజాయి అమ్ముతున్న ముఠాను జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీసులు అరెస్టు చేశారు. గురువారం కోరుట్ల సీఐ సురేశ్​బాబు వివరాలు తెలిపారు.  కోరుట్ల టౌన్ శివారులోని గౌతమ్​మోడల్ స్కూల్ వెనక ప్రాంతంలో గురువారం ఆరుగురు వ్యక్తులు గంజాయి తాగుతున్నారనే సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ఎండీ అమీర్​ఖాన్(28), ఎండీ ముష్(29), ఎండీ సోహెల్(26), కోరుట్లకు చెందిన అబ్బూ హురీరా(23), షేక్​ మజీద్(24), ఎండీ ఉమర్(26) పట్టుబడ్డారు. 

నిందితుల వద్ద రూ.15 వేల విలువైన అర కిలో గంజాయి, 3 బైకులు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల, కోరుట్లకు చెందిన ఆరుగురు నిందితులు  బైకులపై నిర్మల్ కు వెళ్లి, అర కిలో గంజాయి కొనుగోలు చేశారు. ఆ తర్వాత కోరుట్లలో  అమ్మేందుకు వచ్చి పట్టుబడినట్టు పోలీసులు తెలిపారు.  గంజాయి సరఫరా చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడని చెప్పారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్​కు  తరలించినట్లు సీఐ సురేశ్​బాబు తెలిపారు. ఆరుగురు వ్యక్తులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్​ఐ లు చిరంజీవి , రామచంద్రం, కానిస్టేబుల్స్​  పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.