ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: తెలంగాణ వచ్చి ఎనిమిదేండ్లైనా వలసలు ఆగలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి ఆవేదన వ్యక్తం చేశారు.  శనివారం నాగర్‌‌‌‌ కర్నూల్‌‌లో ‘ప్రజా గోస బీజేపీ భరోసా యాత్ర’ బైక్ ర్యాలీని ప్రారంభించారు.  అనంతరం ఆమె మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌‌ లైన్‌‌తో ఏర్పడ్డ  తెలంగాణలో సీఎం కేసీఆర్‌‌‌‌ వాటినే మరిచిపోయారని విమర్శించారు.  80 వేలు పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి 8 వేల పోస్టులు కూడా భర్తీ చేయలేదన్నారు.  నిరుద్యోగులకు భృతి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.  పైగా దళితుల భూములు గుంజుకొని కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు  నిర్మించారని మండిపడ్డారు. సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు  భూకబ్జాలు,  ఇసుక, మట్టి దందాలు చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.  తన కుటుంబం లిక్కర్‌‌‌‌ స్కామ్‌‌లో ఇరుక్కోవడంతో కేసీఆర్ అయోమయంలో పడ్డాడని విమర్శించారు.   హరితహారం, ఈజీఎస్, గ్రామపంచాయతీ భవనాలు, రైతు వేదికలు, ధాన్యం కొనుగోలు లాంటి ఎన్నో కార్యక్రమాలను కేంద్రం ద్వారానే జరుగుతున్నాయని గుర్తు చేశారు.   వచ్చే ఎన్నికలలో డబుల్ ఇంజన్ పాలన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పట్టణంలోని పలు కాలనీలలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దిలీప్ ఆచారి, సుబ్బారెడ్డి, సుధాకర్ రెడ్డి, బంగారు శ్రుతి, శ్రీనివాసులు పాల్గొన్నారు. 

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని హైకోర్టు జడ్జి విజయసేనారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జడ్పీ మీటింగ్ హాల్‌‌లో నిర్వహించిన జాతీయ కాలుష్య నివారణ దినోత్సవ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. ఈ భూమిపై మానవులు మనుగడ సాగించాలంటే ప్లాస్టిక్‌‌ను తరిమేయడం ఒక్కటే మార్గమన్నారు.  ప్రభుత్వం ప్లాస్టిక్‌‌పై నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలంటే ప్రతి ఒక్కరిలో స్వతహాగా మార్పు రావాలన్నారు.  కాగితపు సంచులు, బట్ట సంచులు వాడేలా  పల్లెలు, పట్టణాల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉందన్నారు.  పలులు, కోతులు అడవులను వదిలి గ్రామాల మీదకు వస్తున్నాయంటే.. అడవులు అంతరించడమే కారణమన్నారు. భవిష్యత్ తరాలకు మంచి గాలి, నీరు, మట్టి అందించడమే గొప్ప ఆస్తి అని అభిప్రాయపడ్డారు.  పీయూ వీసీ ప్రోఫెసర్ లక్ష్మికాంత్ రాథోడ్ , జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి,  జడ్జి ప్రేమావతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, న్యాయవాది మల్లారెడ్డి, రాజేశ్వర్, లక్ష్మిరెడ్డి  పాల్గొన్నారు. 

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజర్‌‌‌‌ రెడ్డి, కలెక్టర్లు సూచించారు.  శనివారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ట్రై సైకిళ్లతో పాటు ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.   గోపాల్ పేటకు చెందిన డిగ్రీ స్టూడెంట్‌‌ జి.పవన్ కుమార్‌‌‌‌కు మంత్రి  నిరంజన్ రెడ్డి ‘సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్‌‌’ ద్వారా మూడు టైర్ల స్కూటీ పంపిణీ చేశారు.  గద్వాల అందుల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన మీటింగ్‌‌లో సీనియర్ సివిల్ జడ్జి గంట కవితా దేవి మాట్లాడుతూ దివ్యాంగులకు చులకనగా చూడొద్దని, ఏమైనా సమస్యలు ఉంటే లీగల్ సర్వీసెస్ వారిని కలవాలని సూచించారు.

-నెట్‌‌వర్క్‌‌, వెలుగు

పీఆర్‌‌‌‌ఎల్‌‌ఐపై వివక్ష    

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు:  పాలమూరు–-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్‌‌‌‌ వివక్ష చూపుతున్నారని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ ఆరోపించారు. శనివారం డీసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ సీఎం పాలమూరు జిల్లాకు ఇచ్చిన ఒక హామీని కూడా నెరవేర్చలేదని,  కుర్చి వేసుకొని పీఆర్‌‌‌‌ఎల్‌‌ఐని పూర్తి చేస్తానని చెప్పి మోసం చేశారని విమర్శించారు.  కాళేశ్వరం ప్రాజెక్టును త్వరతగతిన పూర్తి చేసిన ఆయన.. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులను కూడా మోసం చేస్తున్నారని వాపోయారు.  మల్లన్నసాగర్ నిర్వాసితులకు రూ.12.50 లక్షలు ఇచ్చి పాలమూరు  నిర్వాసితులకు మాత్రం రూ.3.50 లక్షలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలను  అక్రమంగా అరెస్టు సరికాదన్నారు. స్వీపర్లను కూడా ఆరెస్టు చేయడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు.  టీపీసీసీ కార్యదర్శి ఎస్.వినోద్ కుమార్ మాట్లాడుతూ  నియోజకవర్గంలో  అనర్హులు, ధనికులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారని ఆరోపించారు.  లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక  చేయాలని డిమాండ్ చేశారు.  మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బెక్కరి అనిత, నాయకులు తాహెర్, ముజీబ్ పాల్గొన్నారు. 

రాజకీయ పార్టీలు సహకరించాలి

ఓటరు జాబితా అబ్జర్వర్‌‌‌‌ విజయేంద్ర బోయి 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  ఓటర్ల జాబితాను తప్పుల్లేకుండా రూపొందించడంలో రాజకీయ పార్టీలు సహకరించాలని ఓటరు జాబితా అబ్జర్వర్,  రాష్ట్ర రవాణా, ఆర్‌‌అండ్‌‌బీ స్పెషల్‌‌ సెక్రెటరీ విజయేంద్ర బోయి కోరారు. శనివారం కలెక్టర్‌‌ కార్యాలయంలో కలెక్టర్ ఉదయ్ కుమార్‌‌‌‌తో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై  రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు రానివ్వొద్దని, జనవరి 1, 2023 నాటికి 18 యేండ్లు పూర్తయిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని సూచించారు. చనిపోయిన, శాశ్వతంగా వలసవెళ్లిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించాలని చెప్పారు.  డిసెంబర్ 8 వరకు క్లెయిమ్స్‌‌ స్వీకరణ ఉంటుందని, జనవరి 5న తుది ఓటర్‌‌ జాబితా ప్రచురిస్తారమన్నారు.  ఇందులో భాగంగానే ఈ నెల 3,4  తేదీల్లో  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.  బూత్‌‌ స్థాయి అధికారులు పోలింగ్‌‌ కేంద్రాలలోనే ఉంటారని, అక్కడే క్లెయిమ్స్‌‌ సమర్పించవచ్చన్నారు. 

ప్రజలను చైతన్యపరిచేందుకు పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని  సూచించారు.  కలెక్టర్‌‌ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. ఫారం 6, 7, 7ఏకు సంబంధించి అన్ని బూతుల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నామని చెప్పారు.  కొత్త ఓటర్ల కోసం ఆన్లైన్ ద్వారా 3,247,  ఆఫ్‌‌లైన్‌‌ ద్వారా 2,348 దరఖాస్తులు వచ్చాయన్నారు.  అంతకు ముందు అచ్చంపేట, అమ్రాబాద్, వంగూర్ మండలాల్లోని తిప్పారెడ్డిపల్లి, మాచారం, అచ్చంపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటర్ నమోదు పోలింగ్‌‌ కేంద్రాలను  విజయేంద్ర బోయి పరిశీలించారు   ఈ సమావేశంలో అడిషనల్‌‌ కలెక్టర్ మోతిలాల్, ఆర్డీవోలు నాగలక్ష్మి, హనుమాన్ నాయక్, పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు. 

సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయాలి

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌ పాలమూరు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం.రాఘవాచారి, అధ్యక్షుడు ప్రోఫెసర్ హరగోపాల్  శనివారం ఒక ప్రకటనలో కోరారు.  ఏనిమిదేండ్లు గడిచినా పాత సమస్యలు తీరలేదని వాపోయారు. రైతులు సాగునీరు, ఉద్యోగాలు, వ్యాపారాలు స్థానికులకు దక్కాలని  ఇక్కడి ప్రజలు ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. నేటికీ వలసలు ఆగలేదని, నారాయణ పేట లాంటి ప్రాంతాలకు సాగునీరు అందడం లేదని వాపోయారు.  సీఎం మేథావులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలే తప్ప.. ఎక్కడిక్కడ కట్టడి చేయడం సరికాదన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తాయన్నారు.