మేమూ కొంటం గోల్డ్​

మేమూ కొంటం గోల్డ్​

మిలీనియల్స్ ​లో పెరుగుతున్న ఇంట్రెస్ట్

ఆర్థిక సమస్యలు వస్తే వెంటనే అమ్ముకోవడానికి వీలవుతుంది కాబట్టి మన పూర్వీకులు బంగారానికి పెద్దపీట వేసేవారు. ఇప్పుడు మిలీనియల్స్ కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. గోల్డ్​కు ఎప్పుడూ డిమాండ్​ ఉండటం, ఇన్​ఫ్లేషన్​ను ఎదుర్కొనే శక్తి ఉండటం, రాబడులు బాగా ఇస్తుండటంతో తమ పోర్ట్​ఫోలియోలో గోల్డ్​కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు.

బిజినెస్​ డెస్క్​, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి ఇన్వెస్ట్​మెంట్​ పోర్ట్​ఫోలియోలో బంగారానికి చాలా ముఖ్యమైన స్థానం ఉంటుంది. భారతీయులకు పూర్వకాలం నుంచే బంగారం అంటే ఎంతో ఇష్టం. ఇది మన కల్చర్​లో భాగంగా మారింది కూడా. ఇతర దేశాల్లోనూ బంగారానికి ఎంతో విలువ ఉంది. మన పూర్వీకులు మాదిరే మిలీనియల్స్ (1980–1990 మధ్యకాలంలో పుట్టినవారు) కూడా ఇన్వెస్ట్​మెంట్​ను బంగారంతో మొదలుపెడుతున్నారు. ఎందుకంటే బంగారం పాడవదు. ఎంతకాలమైనా దాచిపెట్టుకోవచ్చు.  ఎప్పుడైనా, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. గతంలో కంటే బంగారం కొనడం చాలా పెరిగిందని మైగోల్డ్​కార్ట్ డైరెక్టర్​ విదిత్​ గార్గ్​ చెప్పారు.  భారతదేశం బంగారానికి ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. దీనిని బట్టి పసిడిపై మన దేశానికి ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన ఇటీవలి ఆర్థిక సంక్షోభం పుత్తడిపై ఆసక్తిని మళ్లీ పెంచింది. 2021 మొదటి క్వార్టర్​లో బంగారం డిమాండ్ 37 శాతం పెరిగిందని ఒక స్టడీ వెల్లడించింది. 

ఎన్నో మార్గాల్లో ఇన్వెస్ట్ ​చేయొచ్చు 

మిలీనియల్స్​ బంగారం కొనడానికి చారిత్రక, ఆర్థిక, భౌగోళిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. దీనికితోడు కరోనా రావడం కూడా కొనుగోళ్లను పెంచింది. బంగారానికి స్థిరత్వం, లిక్విడిటీ, డిమాండ్​ ఎక్కువ, వోలటాలిటీ తక్కువ కావడం వల్ల మిలీనియల్స్‌‌‌‌‌‌‌‌ను బాగా ఆకర్షిస్తోంది. సాధారణ బంగారం వద్దనుకుంటే  గోల్డ్ ఫ్యూచర్స్, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ కంపెనీలు, గోల్డ్ ఈటిఎఫ్‌‌‌‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ బులియన్, గోల్డ్ జువెలరీ, డిజిటల్ గోల్డ్‌‌‌‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇతర అసెట్​ క్లాసెస్​తో పోలిస్తే డిజిటల్​, ఫిజికల్​ బంగారంలో ఇన్వెస్ట్​మెంట్​ మంచిదనే ఆలోచన మెజారిటీ మిలీనియల్స్​లో ఉంది.  

ఆపదలో ఆదుకుంటుంది...

ఇన్​ఫ్లేషన్​ను తట్టుకునే శక్తి బంగారానికి ఉంటుందని కరోనా సమయంలో మరోసారి రూడీ అయింది. గత 18 ఏళ్లుగా ఫైనాన్షియల్​ మార్కెట్లు ఎన్నో ఆటుపోట్లకు గురయ్యాయి కానీ బంగారం ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇంతకుముందు కూడా కరోనా వంటి సంక్షోభ పరిస్థితులు వచ్చినా బంగారం ఇన్​ఫ్లేషన్​ను తట్టుకుంది. ధరలు అమాంతం పడిపోలేదు సరికదా పెరిగాయి. ఎకానమీకి ఎటువంటి సవాళ్లు ఎదురైనా బంగారం ధరలు మాత్రం తగ్గడం లేదు. ఇక నుంచి కూడా బంగారానికి మంచి భవిష్యత్​ ఉంటుందని ఈ సెక్టార్​ ఎక్స్​పర్టులు చెబుతున్నారు. అత్యంత సురక్షితమైన పెట్టుబడుల్లో బంగారానికి మొదటిస్థానం ఇవ్వొచ్చని అంటున్నారు. అందుకే మిలీనియల్స్​ డిజిటల్​గోల్డ్​ తెగ కొంటున్నారు. అంచనాలకు తగ్గట్టే ఇది మంచి రాబడులను ఇస్తోంది. ఇన్​ఫ్లేషన్​ ఇబ్బందులు ఉండవు. స్థిరత్వానికి, డిమాండ్​కు ఢోకా ఉండదు కాబట్టే డిజిటల్​గోల్డ్​కు ఇన్వెస్ట్​మెంట్లు పెరుగుతూనే ఉన్నాయి.