
- దాడి ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్
వరంగల్/ఖిలా వరంగల్, వెలుగు: వరంగల్ మిల్స్ కాలనీ పీఎస్ ఎస్ఐ శ్రీకాంత్ బిర్యానీ సెంటర్ నిర్వాహకురాలితో పాటు వర్కర్ ను కొట్టిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు.. వరంగల్ ఏసీ రెడ్డి నగర్‍కు చెందిన నండ్ర మరియమ్మ ఖిలా వరంగల్ రోడ్డులో వాల్ మార్ట్ ఏరియాలో రెడ్ బకెట్ బిర్యానీ సెంటర్ నిర్వహిస్తోంది.
శుక్రవారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో ఎస్ఐ శ్రీకాంత్ వెళ్లి వంటచేసే గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లడంతో వదిలేయాలని కోరింది. దీంతో ఎస్ఐ ఆగ్రహంతో మరియమ్మ చెంపపై కొట్టి కులం పేరుతో తిట్టాడు. అడ్డుకోబోయిన వర్కర్ పైనా దాడికి దిగాడు. ఎస్ఐ మద్యం మత్తులో ఉన్నాడని.. తమ అంతు చూస్తానని బెదిరించాడని బాధితులు వాపోయారు.
అదేరాత్రి మిల్స్ కాలనీ పీఎస్ లో కంప్లయింట్ చేసేందుకు మరియమ్మ వెళ్లగా ఉన్నతాధికారులు లేరు. దీంతో బాధితురాలు స్థానిక సీఐ రమేశ్‍కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఘటనపై సీఐ బొల్లం రమేశ్ వివరణ ఇస్తూ.. మరియమ్మను ఎస్ఐ శ్రీకాంత్ కొట్టలేదని.. అనుకోకుండా చెయ్యి తాకిందని చెప్పారు.
రోజూ అర్ధరాత్రి 11 గంటల తర్వాత బిర్యానీ సెంటర్ బంద్ చేయాలని పలుమార్లు తెలిపినా ఆమె పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. ఎస్ఐ కొట్టిన దెబ్బలకు మహిళకు దవడపై గాయాలు కావడం, వర్కర్ కూడా తీవ్రంగా గాయపడడంతో శనివారం ఆస్పత్రికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.