కనీస వేతనాల అమలు జరిగేనా?

కనీస వేతనాల అమలు జరిగేనా?

భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చి 73 సంవత్సరాలు గడిచింది. దేశం అనేక రంగాల్లో అభివృద్ధిని సాధించింది. స్వావలంబన దిశగా వడివడిగా ప్రయాణిస్తోంది. రానున్న ఐదు సంవత్సరాలలో దేశం నయాభారత్ గా రూపు దిద్దుకుంటుందని ప్రపంచంలో మూడో అభివృద్ధి దేశంగా ముందుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాలలో నొక్కి చెబుతున్నారు. సాంకేతిక రంగంలో అనేక దేశాల కంటే ముందడుగులో ఉన్నది వాస్తవమే. అయినా దురదృష్టవశాత్తు దేశం కోసం, ప్రజల కోసం, వారి అవసరాలు తీర్చుకొనుటకు నిరంతరం, అహోరాత్రులు, శ్రమిస్తున్న కార్మికులు, కర్షకుల జీవితాల్లో ఎటువంటి మార్పులేదు. స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న పరిస్థితులే ఇప్పుడు కూడా కొనసాగుతుండటం విచారకరం. కర్మాగారాల్లో నిరంతరం పనిచేస్తూ దేశాన్ని ప్రగతిపథంలోనికి నడిపిస్తున్న కార్మికులకు తగినంత జీవన భృతి లభించుటలేదు. ఎన్ని పోరాటాలు చేసినా విజ్ఞప్తులు చేసినా పరిస్థితులలో చెప్పుకోదగ్గ మార్పు కానరావడం లేదు. చెవిటివాని ముందు శంఖం ఊదిన విధంగానే ఉంది. 

జాతీయస్థాయిలో 2016–17 సంవత్సరంలో జరిపిన శాంపుల్ సర్వే ప్రకారం భారతదేశంలో మొత్తం 47.41 కోట్ల మంది వివిధ వృత్తుల్లో పనిచేస్తూ జీవనం వెళ్లదీస్తున్నారు. వీరిలో సుమారు 43.7 కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. భారతదేశంలోని మొత్తం కార్మికుల్లో 51 శాతం మంది స్వయం ఉపాధిపై ఆధారపడినవారు ఉన్నప్పటికీ వీరికి ఎటువంటి చట్టాలు అమలు కావడం లేదు. అసంఘటిత కార్మికులలో ఎక్కువ భాగం వ్యవసాయ కూలీలు, పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, మత్స్యకారులు, బీడి పరిశ్రమలో పనిచేసేవారు, పాల ఉత్పత్తి కేంద్రాలు, ప్యాకేజింగ్, భవన నిర్మాణరంగం, చేనేత కార్మికులు, బరువులు మోయుట(హమాలీలు) ట్రాన్స్​పోర్ట్ రంగం, ఇంటి పనివారు తదితర వృత్తులు చేసేవారు అందరూ అసంఘటిత రంగంలో ఉన్నారు.

 కనీస వేతన చట్టం-1948

వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు చట్టబద్ధమైన వేతన నిర్ధారణ కమిటీ ఆవశ్యకతను 1943లో మూడవ త్రైపాక్షిక ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ గుర్తించింది. కార్మికులకు కనీస వేతన చట్టం రూపొందించాలని నిర్ణయించి ఏప్రిల్ 11, 1946 సంవత్సరంలో అప్పటి భారత ప్రభుత్వంలో ఉన్న లేబర్ మెంబర్ డా. బీఆర్. అంబేద్కర్ కనీస వేతన బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లును ఆమోదించటంలో కొంతజాప్యం జరిగింది. ఆఖరుకు బిల్లు ఆమోదించబడి అది కనీస వేతన చట్టం -1948గా అమలులోకి వచ్చింది. 15వ ఇండియన్  లేబర్ కాన్ఫరెన్స్ 1957వ సంవత్సరంలో కనీస వేతనాలు శాస్త్రీయ పద్ధతులు ఏవిధంగా నిర్ణయించాలో సూత్రీకరించి ఇప్పటికి 65 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఈ చట్టాన్ని సమగ్రంగా అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర సాధనకు తొలిదశ, మలిదశ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాటంలో దాదాపు 1600 మంది తెలంగాణ భూమి పుత్రులు ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ వచ్చింది.  అనంతరం రాష్ట్రంలో మాయ మాటలు చెప్పి అధికారంలోనికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి గడచిన తొమ్మిదిన్నరేండ్లు బంగారు తెలంగాణ పేరుతో ప్రజలకు భవిష్యత్తులో కూడా బతకులేని తెలంగాణగా మార్చింది. రాజ్యాంగంలోని ఏ ఒక్క అధికరణను కూడా అమలుకు ఇష్టపడని అధికార నియంతృత్వ పార్టీ చట్టాలను తుంగలోకి తొక్కి తెలంగాణ ప్రజల అకాంక్షలను నెరవేర్చకపోగా అందిన కాడికి దోచుకొని, రాష్ట్రాన్ని దివాలా తీయించింది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, రాష్ట్ర ప్రజల సంపదను కూడా పెట్టుబడిదారులకు దోచిపెట్టి, అందినకాడికి దోచుకున్నారు.

తెలంగాణలో అమలుకాని కనీస వేతనాల చట్టం 

రాష్ట్రంలో 76 షెడ్యూల్  నాన్ షెడ్యూల్ రంగాలలో పనిచేస్తున్న దాదాపు ఒక కోటి పైగా సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతనాలు చట్టం ప్రకారం గత పది సంవత్సరాలుగా పెంచకుండా నియంతృత్వ పాలన సాగింది. కనీస వేతనాలు నిర్ణయించటానికి ట్రై పార్టీ సభ్యుల (ప్రభుత్వ, యజమాన్య, కార్మిక సంఘాల ) తో కనీస వేతనాల బోర్డు ఏర్పాటు చేయాలి. 2014 అక్టోబర్ లో, 2016లో కనీస వేతనాలు బోర్డు వేసినప్పటికీ బోర్డు రికమండేషన్ లను  అమలులో పెట్టుటలేదు. గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలో కనీస వేతనాల బోర్డు కూడా లేదు.

2018లో ఐదు షెడ్యూల్ ఉపాధి రంగాలలో  వేతనాలు పెంచుతూ బోర్డు నిర్ణయించింది. అమలు చేయాలని కార్మిక సంఘాలు ఉద్యమించిన నేపథ్యంలో 2021లో జీవో విడుదల చేశారు. కానీ గెజిట్ నోటిఫికేషన్ చేయకుండా బడా పెట్టుబడిదారులకు, బడా కాంట్రాక్ట్ వ్యాపారులకు  ఊడిగం చేస్తూ అనుకూలంగా వ్యవహరించింది. 

సమాన పనికి సమాన వేతనం అమలు ఏది?

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో వివిధ షెడ్యూల్లో పనిచేస్తున్న  దాదాపు నాలుగు లక్షల కాంట్రాక్టు, క్యాజువల్, డైలీ వేజ్ ​ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ యాజమాన్యంలో చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్నా..రెగ్యులర్ చేయకపోగా కనీసం సమాన పనికి సమాన వేతనం కూడా చట్ట ప్రకారం చెల్లించడం లేదు. సమాన పనికి సమాన వేతన చట్టం1972 నుంచి అమలులో ఉన్నా అమలు కావడం లేదు. దేశ సర్వోన్నత న్యాయస్థానం  2017లో పర్మినెంట్ ఉద్యోగి నిర్వహిస్తున్న విధులను తాత్కాలిక ఉద్యోగి కనుక నిర్వహిస్తున్నట్లయితే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది.

తెలంగాణలో కనీస వేతనాలు అమలు చేయాలి

 తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన నూతన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల  కార్మిక సంఘాలు ఎంతగానో  ఆశాభావంతో ఎదురుచూస్తున్నాయి.. కార్మిక శాఖ పర్యవేక్షణకు మంత్రిని నియమించి.. జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులతో  కనీస వేతనాల బోర్డును వెంటనే నియమించాలి.73 షెడ్యూల్ ఆఫ్ ఎంప్లాయిమెంట్స్ లో  గత పది సంవత్సరాలుగా వేతనాలు రివిజన్ లేకుండా ఉన్న నేపథ్యంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా  కనీస వేతనాలను సవరించి జీవో లు ఇచ్చి అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

న్యాయస్థానాలు చెప్పినా..

అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు  బోర్డు రికమండేషన్ లను  చేసినా,  వేతనాలు అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు. రాష్ట్రంలో అసంఘటిత రంగాలైన 149 ఉపాధి రంగాలను షెడ్యూల్ ఉపాధి రంగాలలో చేర్చాల్సి ఉండగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అదనంగా ఏ ఒక్క ఉపాధి రంగాన్ని కూడా షెడ్యూల్ ఉపాధి రంగాలలో చేర్చలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 16ను 1995 మే 25న విడుదల చేసిన తర్వాత ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి   ఉపాధి రంగాల కనీస వేతనాలు పెంచి, వీడిఏ కలిగిన ఉపాధి రంగాల కనీస వేతనాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి పెంచుతూ  కనీస వేతనాల అమలు చట్టంలోకి సెక్షన్ 3,4,5ను అమలుచేసింది.

ALSO READ: అడవుల్లో ఇంటర్​నెట్ కనెక్టివిటీ పెంచాలి

అందులో నైపుణ్యం లేని కార్మికులు, కనీస నైపుణ్యం కలిగిన కార్మికులు,  నైపుణ్యం కలిగిన కార్మికులు, అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులుగా విభజించి  డా. అక్రాయిడ్ ఫార్ములా ప్రకారం 1992 లో దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పులను, మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను పెంచి జీవోలు విడుదల చేస్తూ, 60 షెడ్యూల్ రంగాలకు గత 12 సంవత్సరాల క్రితం, మిగతా 13 షెడ్యూల్ రంగాలకు 15 సంవత్సరాల క్రితం మాత్రమే కనీస వేతనాలు పెంచి గెజిట్లో ప్రచురించారు.

- ఉజ్జిని రత్నాకర్ రావు, ఏఐటియుసి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు