గిరిజన సమాఖ్యలకు 11 ఇసుక ర్యాంపులు : ఎండీ భవేశ్ మిశ్రా

గిరిజన సమాఖ్యలకు 11 ఇసుక ర్యాంపులు : ఎండీ భవేశ్ మిశ్రా
  • ములుగు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో ఇచ్చేలా ప్లాన్​ చేయండి
  • మైనింగ్ శాఖ ఎండీ భవేశ్ మిశ్రా

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లాల్లో గిరిజన మహిళా సమాఖ్యలకు 11 ఇసుక ర్యాంపులు ఇచ్చేలా ప్లాన్​చేయాలని మైనింగ్ శాఖ ఎండీ భవేశ్ మిశ్రా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో కలెక్టర్​జితేశ్​వి.పాటిల్, భద్రాచలం, ములుగు ఐటీడీఏ పీవోలు రాహుల్, చిత్ర మిశ్రాతో కలిసి పలు శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్​నిర్వహించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 8, ములుగు జిల్లాలో 3 ఇసుక ర్యాంపులను గిరిజన మహిళా సమాఖ్యలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. గిరిజన సొసైటీల ద్వారా వీటి నిర్వహణతో గిరిజన కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయని పేర్కొన్నారు.

సమాఖ్య సభ్యులకు సాయంగా ఉండేందుకు ఐటీడీఏ నుంచి ఒక అధికారిని అందుబాటులో ఉంచాలన్నారు. రెండు వారాల్లో ఇసుక ర్యాంపుల నిర్వహణకు ఆసక్తి ఉన్న యువతులను గుర్తించాలని చెప్పారు. ప్రయోగాత్మకంగా ఈ రెండు జిల్లాల్లో ఒక్కో ర్యాంపును ప్రారంభించేందుకు మహిళా సమాఖ్య సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆర్డీవోలు మధు, దామోదర్, స్పెషల్​ఆఫీసర్​అశోక్ కుమార్, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్​మేనేజర్​శంకర్ నాయక్, ఏడీ మైన్స్​దినేశ్​కుమార్​పాల్గొన్నారు.