ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కృషి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కృషి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
  • ప్రాజెక్టుల భూసేకరణపై దృష్టి పెట్టాలి : మంత్రి ఉత్తమ్‌‌
  • హ్యామ్‌‌ స్కీమ్‌‌ కింద రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం : మంత్రి

నల్గొండ, వెలుగు : మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల సహకారంతో ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌ చెప్పారు. మంత్రులు ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డితో కలిసి బుధవారం నల్గొండ కలెక్టరేట్‌‌లో ఉమ్మడి జిల్లా రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, రైతులకు సంబంధించిన అంశాలపై ప్రతి రోజు మండల స్థాయి ఆఫీసర్లతో మాట్లాడాలని సూచించారు. రైతు భరోసా, రైతు బీమా, ఎరువులు, విత్తనాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. గత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.

 జిల్లాలోని ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇందిదిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులు, వ్యవసాయ విద్యుత్‌‌ కనెక్షన్లకు సంబంధించి విద్యుత్‌‌ శాఖ ఆఫీసర్లు, ఎమ్మెల్యేల విజ్ఞప్తుల మేరకు సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. రివ్యూ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్‌‌కుమార్‌‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌‌, ప్రభుత్వ విప్‌‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌‌కుమార్‌‌రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్‌‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. జిల్లాలోని పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు.

 కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌‌నాయక్‌‌, డెయిరీ డెవలప్‌‌మెంట్‌‌ కార్పొరేషన్‌‌ చైర్మన్‌‌ గుత్తా అమిత్‌‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్లు ఇలా త్రిపాఠి, తేజస్ నంద్‌‌లాల్‌‌ పవార్, హనుమంతరావు, రెవెన్యూ అడిషనల్‌‌ కలెక్టర్‌‌ జె. శ్రీనివాస్, సబ్‌‌ కలెక్టర్‌‌ నారాయణ అమిత్‌‌, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తాం : మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌రెడ్డి

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రాజక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు కృషి చేస్తామని, ప్రాజెక్టుల భూసేకరణపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు గొప్ప చరిత్ర ఉందని, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి ఉమ్మడి జిల్లాను ఓ స్థాయికి తీసుకెళ్లాలన్నారు. వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలని, నిజాయతీ, పారదర్శకతతో పనిచేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ప్రతి నెల రెండు సార్లు సమీక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

నల్గొండ జిల్లాలోని రోడ్లకే ఎక్కువ నిధులు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి         
   
ఆర్‌‌అండ్‌‌బీ ద్వారా నల్గొండ జిల్లాకే ఎక్కువ నిధులు ఇచ్చామని, భవిష్యత్‌‌లో మరిన్ని నిధులు ఇచ్చేందుకు కృషి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి చ౮ప్పారు. సంగెం బ్రిడ్జికి రూ.45 కోట్లు మంజూరు చేశామన్నారు. హామ్‌‌ స్కీమ్‌‌ కింద రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,200 కోట్లతో అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్‌‌ రోడ్లు వేస్తున్నామన్నారు. ఎస్‌‌ఎల్‌‌బీసీ టన్నెల్‌‌ పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. ఇరిగేషన్‌‌ ప్రాజెక్టుల భూసేకరణపై ప్రత్యేకంగా రివ్యూ చేస్తామన్నారు. ఎస్‌‌డీఎఫ్‌‌ కింద ప్రతి ఎమ్మెల్యేలకు రూ. ఐదు కోట్లు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకు సంబంధించి టోకెన్లు రైజ్‌‌ చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. 

 ఆర్‌‌అండ్‌‌బీ ఎస్‌‌ఈ ఆఫీస్‌‌ ప్రారంభం

నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో రూ. 6 కోట్లతో నిర్మించిన ఆర్‌‌అండ్‌‌బీ ఎస్‌‌ఈ ఆఫీస్‌‌ను మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌‌, కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హ్యామ్‌‌ విధానంలో డబుల్‌‌ రోడ్ల నిర్మాణాన్ని చేపడుతామని, ఈ పనులకు ఆగస్ట్‌‌ ఫస్ట్‌‌ వీక్‌‌లో టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్ 40 శాతం, బ్యాంకు ద్వారా 60 శాతం రుణం తీసుకుని రోడ్ల నిర్మాణాన్ని చేపడుతామన్నారు. ముందుగా 10 ప్యాకేజీలకు సంబంధించి రూ.3 వేల కోట్లతో టెండర్లు పిలుస్తామన్నారు. ఆర్‌‌అండ్‌‌బీ శాఖలో ఖాళీగా ఉన్న 150 ఏఈల నియామకానికి చర్యలు చేపడుతామన్నారు.