ముత్యంపేట షుగర్‌‌ ఫ్యాక్టరీని రీఓపెన్‌‌ చేస్తాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌

ముత్యంపేట  షుగర్‌‌ ఫ్యాక్టరీని రీఓపెన్‌‌ చేస్తాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌

మల్లాపూర్/కోరుట్ల, వెలుగు :  ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ మేరకు ముత్యంపేట షుగర్‌‌ ఫ్యాక్టరీని ఓపెన్‌‌ చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌ కుమార్‌‌ చెప్పారు. మాజీమంత్రి జీవన్‌‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌‌ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే సంజయ్, పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్‌‌ టెక్నాలజీ స్పెషల్ ఛీప్ సెక్రటరీ సంజయ్‌‌కుమార్‌‌, వ్యవసాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రఘునందన్‌‌రావు, డైరెక్టర్‌‌ ఆఫ్‌‌ షుగర్‌‌ ఇండస్ట్రీస్‌‌ నర్సిరెడ్డి, కలెక్టర్ సత్య ప్రసాద్‌‌తో కలిసి శుక్రవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్‌‌ మండలం ముత్యంపేట గ్రామంలోని నిజాం దక్కన్‌‌ షుగర్‌‌ ఫ్యాక్టరీని సందర్శించారు.

 అనంతరం మెట్‌‌పల్లి మండలం వేంపేట గ్రామంలోని ఓ ఫంక్షన్‌‌ హాల్‌‌లో రైతులతో ముఖాముఖి- కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెరుకు రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ముత్యంపేట షుగర్‌‌ ఫ్యాక్టరీని సందర్శించామని చెప్పారు. షుగర్‌‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని గతంలో హామీ ఇచ్చామని, ఇందులో భాగంగా ఫ్యాక్టరీకి సంబంధించిన సుమారు రూ. 172 కోట్లకు పైగా బకాయిలను ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. 

రైతుల నుంచే నేరుగా చెరుకును సేకరించి చక్కెర ఉత్పత్తి చేయాలన్నది సీఎం రేవంత్​రెడ్డి ఆలోచన అని చెప్పారు. చెరుకు సీడ్‌‌, మద్దతు ధర గురించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మాజీమంత్రి జీవన్‌‌రెడ్డి మాట్లాడుతూ... స్థానిక రైతుల ప్రయోజనాల కోసమే షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు ప్రభుత్వం ముందుకు  వచ్చిందన్నారు. ప్రభుత్వ విప్​ఆది శ్రీనివాస్‌‌ మాట్లాడుతూ... రైతును రాజు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, షుగర్‌‌ ఫ్యాక్టరీ రీ ఓపెన్‌‌ కోసం బకాయిలు చెల్లించి ప్రభుత్వం చిత్తశుద్ధి చాటిందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ అశోక్‌‌కుమార్‌‌, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌‌చార్జి జువ్వాడి నర్సింగరావు, నాయకులు జువ్వాడి కృష్ణారావు, కొమిరెడ్డి విజయ్ ఆజాద్‌‌ పాల్గొన్నారు