
- సింగూరును టూరిస్ట్ హబ్ గా మారుస్తా
- మంత్రి దామోదర రాజనర్సింహ
మునిపల్లి, వెలుగు: విద్యా, వైద్యం, రవాణా సౌకర్యాలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి మండలంలోని ఆయా గ్రామాల్లో రూ. 70 కోట్లతో పలు పనులకు శంకుస్ధాపనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. మండలంలోని బుదేరా కాలేజీలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించి రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానన్నారు.
భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మంత్రి పపరిశీలించి వాటి మరమ్మతులకు నివేదికకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. సింగూరు ప్రాజెక్ట్ ను టూరిస్ట్ హబ్ గా మారుస్తానని చెప్పారు. గార్లపల్లి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయన్నారు. బుదేరా నుంచి సిరూర్ వరకు సింగూరు బ్యాక్ వాటర్ వెంట రెండు లైన్ల రోడ్డు ఏర్పాటుకు రూ. 60 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
అనంతరం 2.20 కోట్లతో మహిళా డిగ్రీ కాలేజీలో అదనపు తరగతి గదులు, రూ.43 లక్షలతో మౌలిక సదుపాయాలు, రూ.98 లక్షలతో మునిపల్లి, -ఖమ్మంపల్లి బీటీ రోడ్డు రోడ్డు నిర్మాణం, రూ. 1.24 కోట్లతో మోడల్ స్కూల్, రూ.34.50 లక్షలతో ఎస్సీ బాయ్స్ హాస్టల్, రూ.1.96 కోట్లతో మునిపల్లి చందాపూర్ బీటీ రోడ్డు నిర్మాణం, రూ. 1.26 కోట్లతో తక్కెడల్లి రోడ్డు నిర్మాణం.
రూ.57.50 లక్షలతో కేజీబీవీలో మౌలిక సదుపాయాలు, రూ.37 లక్షలతో కిచెన్నిర్మాణం, రూ.42 కోట్లతో తాటిపల్లి-మక్తక్యాసారం డబుల్ రోడ్డు నిర్మాణం, రూ.17 కోట్లతో గార్లపల్లిలో హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణాలకు శంకు స్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, ఆర్డీవో రవీందర్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.