సానుభూతి కోసమే బీజేపీ దాడులు

సానుభూతి కోసమే బీజేపీ దాడులు

జనగామ: ప్రజల్లో సానుభూతి పొందేందుకే బీజేపీ దాడులకు పాల్పడుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. జిల్లాలోని దేవరుప్పులలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. ఈ దాడిలో గాయపడి జనగామ హాస్పిటల్ లో చికిత్స పొందుతనున్న టీఆర్ఎస్ కార్యకర్తలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. అనంతరం బీజేపీ దాడిని ఖండించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... యాత్ర పేరుతో టీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలపై బండి సంజయ్ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజే ఇలా జరగడం బాధాకరమన్నారు.  దాదాపు 500 మంది గూండాలతో బండి సంజయ్ దేవరుప్పులకు వచ్చారన్నారు.

కేసీఆర్, కేటీఆర్ తో పాటు తనపై కూడా బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడారని, ఈ క్రమంలోనే అక్కడున్న కొంత మంది అలా తిట్టొద్దని బండి సంజయ్ కు సూచించారన్నారు. దీంతో రెచ్చిపోయిన బీజేపీ గూండాలు కర్రలు, రాడ్స్, రాళ్ల తో విచక్షణ రహితంగా దాడులు చేశారన్నారు. ఈ ఘటనతో బీజేపీ వైఖరి అర్ధమైందన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించామన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... బీజేపీ దాడులను తిప్పికొడతామని హెచ్చరించారు.