టీఆర్ఎస్ ను బీఎస్పీగా మార్చిన మంత్రి ఎర్రబెల్లి..!

టీఆర్ఎస్ ను బీఎస్పీగా మార్చిన మంత్రి ఎర్రబెల్లి..!

మహబూబాబాద్ జిల్లా : టీఆర్ఎస్ పార్టీ పేరును బీఎస్పీగా మార్చారంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరిచిపోయి నోరు జారారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు అని చెప్పే బదులు కేసీఆర్ బీఎస్పీని ప్రకటించారని చెప్పారు. కేసీఆర్ ఏ పార్టీ పెట్టారంటూ పార్టీ కార్యకర్తలను వేదికపై నుంచి ఎర్రబెల్లి ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న ఓ కార్యకర్త బీఎస్పీ అని చెప్పడంతో మంత్రి కూడా బీఎస్పీ అని చెప్పారు. అయితే ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా వినిపించుకోలేదు. తొర్రూరులోని యతిరాజారావు పార్కు లో జరిగిన దసరా ఉత్సవాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి ఈ కామెంట్స్ చేశారు. 

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చారు. దీనిపై నిన్న జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.  టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ పార్టీ కార్యవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ  ఆమోదించారు. దీంతో మధ్యాహ్నం 1.19 గంటలకు బీఆర్ఎస్ పార్టీ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. అనంతరం పార్టీ పేరులో మార్పు చేయాలని కోరుతూ ఎన్నికల సంఘానికి సమర్పించనున్న దరఖాస్తు పత్రాలపై సంతకాలు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ చేసిన తీర్మానాన్ని గుర్తించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి పార్టీ జనరల్ సెక్రెటరీ  లేఖ రాశారు.