ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

పెన్షన్లతో ఆత్మగౌరవం పెరిగింది:మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తొర్రూరు, వెలుగు: టీఆర్ఎస్ పేదల ప్రభుత్వమని, 57 ఏండ్లు నిండిన అర్హులకు పెన్షన్లు ఇవ్వడంతో వారి ఆత్మగౌరవం పెరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం కలెక్టర్ శశాంకతో కలిసి తొర్రూరు మండలంలో పర్యటించారు. మొత్తం 22గ్రామాల్లో పర్యటించి, లబ్ధిదారులకు పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. 57 ఏండ్లు నిండిన వారితో పాటు గౌడన్నలకు సైతం పింఛన్లు ఇచ్చారు. ఆయా గ్రామాల ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... ఒకప్పుడు రూ.70 ఉండే పెన్షన్ రూ.200లకు ఆ తర్వాత రూ.2వేలకు ప్రస్తుతం రూ.3వేలకు పెరిగిందన్నారు. పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 10లక్షల మందికి పెన్షన్ మంజూరు చేశామన్నారు. ఇందులో 69 శాతం మ‌‌‌‌హిళ‌‌‌‌లే ఉన్నట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ కేసీఆర్​ కు రుణపడి ఉండాలన్నారు. కార్యక్రమంలో  ట్రైయినీ కలెక్టర్ పింకేశ్వర్ కుమార్, జడ్పీ సీఈవో రమాదేవి, డీఆర్డీఏ సన్యాసయ్యా, డీపీవో సాయిబాబా, ఎంపీపీ చిన్న అంజయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ హరి ప్రసాద్ తదితరులున్నారు.


వర్క్స్ స్పీడప్ చేయాలి

వరంగల్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో అభివృద్ధి పనుల్ని స్పీడప్ చేయాలని బల్దియా కమిషనర్ ప్రావీణ్య ఇంజనీరింగ్ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం తన చాంబర్ లో రివ్యూ నిర్వహించారు. నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. సిటీలో ఐదు బస్తీ దవాఖానాల్లో నాలుగు పూర్తయ్యాయని, మిగిలిన ఒక హాస్పిటల్​ను త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్​ ఇంజనీర్ ప్రవీణ్ చంద్ర, ఈఈలు పాల్గొన్నారు. కాగా, అంతకుముందు మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య కలిసి హైదరాబాద్ లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, ఆస్కి నిర్వహించిన మీటింగ్ కు వర్చువల్ గా హాజరయ్యారు. సఫాయి మిత్ర సురక్షిత్ షెహర్ కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులపై సీడీఎంఏ డా.సత్యనారాయణ పలు సూచనలు చేశారు.

గురుకులాలను శుభ్రంగా ఉంచుకోవాలి
నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లాలోని గురుకులాలను శుభ్రంగా ఉంచేందుకు ఆఫీసర్లు కృషి చేయాలని కలెక్టర్ గోపి సూచించారు. స్వచ్ఛ గురుకులం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన నర్సంపేట నియోజకవర్గంలో పర్యటించారు. నర్సంపేట టౌన్​లోని రెసిడెన్షియల్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్, వల్లబ్​నగర్ రెసిడెన్షియల్, ఖానాపురం మండలం అశోక్​నగర్​ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లను తనిఖీ చేశారు. స్కూళ్ల పరిసరాలు, వంట గదులు, క్లాస్ రూంలు, స్టూడెంట్ల గదులు, టాయిలెట్లను పరిశీలించారు. పిల్లలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలన్నారు. టీచర్లు సమయపాలన పాటించి, నాణ్యమైన విద్య అందించాలన్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో పవన్​కుమార్, తహశీల్దార్ వాసం రాంమూర్తి తదితరులున్నారు.

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

    రూ.2.49లక్షల క్యాష్ సీజ్
కాజీపేట, వెలుగు: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామ శివారులో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. అడిషనల్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ వివరాల ప్రకారం.. గ్రామ పరిధిలో పేకాట ఆడుతున్నట్లుగా సమాచారం రాగా, తనిఖీలు చేశామన్నారు. నలుగురు వ్యక్తులు పట్టుబడగా.. మరో నలుగురు పరారయ్యారన్నారు. వీరి వద్ద రూ.2.49లక్షల క్యాష్, ఒక కారు, 3 బైకులు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టుబడిన వారిలో మడికొండ బుడగజంగాల కాలనీకి చెందిన నూనె చంద్రయ్య, కడమంచి గోపి, వరంగల్ శివనగర్ కు చెందిన కడమంచి పోచయ్య, ముల్కనూర్ కు చెందిన చితారి కోటిలింగం ఉన్నారన్నారు. తదుపరి చర్యల నిమిత్తం స్వాధీనం చేసుకున్న సొత్తును, నిందితుల్ని మడికొండ పోలీసులకు అప్పగించామని వివరించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఎస్సైలు నరేశ్​కుమార్, వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

రాజకీయ యుద్ధానికి బీసీలు సిద్ధం

హనుమకొండ సిటీ, వెలుగు: రాబోయే ఎన్నికల్లో రాజకీయ యుద్ధానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్ అన్నారు. ‘బీసీ మేలుకో.. బీసీకే ఓటు వేసుకో’ అనే నినాదంతో ముందుకెళ్తామన్నారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని ప్రతాపరుద్ర హాల్​ఉమ్మడి వరంగల్ బీసీ లీడర్లతో ఆయన మీటింగ్ నిర్వహించారు. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా బీసీలను మేల్కొలిపి, బీసీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలన్నారు. వెయ్యి మందిని ఎంపిక చేసి, రాజకీయ శిక్షణ తరగతులు కూడా ఇప్పిస్తామన్నారు. మునుగోడులో బీసీ అభ్యర్థికే ఓటు వేయాలన్నారు.

పాతకక్షలతో వృద్ధుడి హత్య

చిట్యాల, వెలుగు: పాతకక్షలు, భూతగాదాల వల్ల ఓ వృద్ధుడిని హత్య చేసిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలోని రాంనగర్​ కాలనీలో జరిగింది. సీఐ పులి వెంకట్ వివరాల ప్రకారం... రాంనగర్ కాలనీకి చెందిన పాముకుంట్ల పోచయ్య(65) ఆర్ అండ్ బీ శాఖలో పనిచేసి, రిటైర్డ్ అయ్యారు. గతంలో గ్రామానికి చెందిన కట్కూరి కొమురయ్య కుటుంబంతో వీరికి భూతగాదా జరిగింది. పెద్ద మనుషుల సమక్షంలో గొడవ సద్దుమణిగింది. ఈక్రమంలో పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని.. కట్కూరి సారయ్య, అయిలయ్య, రాజేందర్, సాంబయ్య, జూపాక కుమార్ కలిసి ప్లాన్ ప్రకారం.. మంగళవారం రాత్రి పోచయ్య ఇంటిపై దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్​కు తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలోనే ఆయన చనిపోయాడు. ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

డిజిటల్ క్లాస్ రూంల ప్రారంభం

భూపాలపల్లి అర్బన్, వెలుగు: భూపాలపల్లి ప్రభుత్వ హైస్కూల్​లో హెచ్ డీఎఫ్ సీ, సేవ్ ది చైల్డ్ ఎన్జీవో సాయంతో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూంలను బుధవారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్​మిశ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డిజిటల్ క్లాసుల వల్ల పాఠాలు ఈజీగా అర్థం అవుతున్నాయన్నారు. వీటిని స్టూడెంట్లు, టీచర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా సంస్థలు మరో 10 స్కూళ్లలో వీటి ఏర్పాటుకు ముందుకురావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి, డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ బుర్ర రమేశ్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ప్రతినిధి విశాల్ భాటియా, సేవ్ ది చైల్డ్ సంస్థ ప్రతినిధి ప్రశాంతి, జడ్పీ వైస్ చైర్​పర్సన్ శోభారాణి, డీఈఓ రాజేందర్ తదితరులున్నారు.

మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
తొర్రూరు, వెలుగు: తొర్రూరులోని సోషల్ వెల్ఫేర్ ఎస్సీ గర్ల్స్ స్కూల్​ను కలెక్టర్ శశాంక తనిఖీ చేశారు. భవనం మొత్తం కలియ తిరిగి సౌకర్యాలపై ఆరా తీశారు. కిచెన్, స్టోర్ రూంను పరిశీలించి పలు సూచనలు చేశారు. పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అనంతరం వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్​స్పైర్ ఓరియంటేషన్ కమ్ వర్క్ షాప్​ ప్రోగ్రాంకు కలెక్టర్ చీఫ్​ గెస్టుగా హాజరయ్యారు.

చేప పిల్లలు క్వాలిటీ లేకుంటే తిరస్కరించాలి

టీఎంకేఎంకేఎస్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ
హనుమకొండ సిటీ, వెలుగు: ప్రభుత్వం చేపట్టిన చేప పిల్లలు నాణ్యతగా లేకపోయినా, వాటి సంఖ్యలో తేడా వచ్చినా మత్స్య కార్మికులు వాటిని తిరస్కరించాలని తెలంగాణ మత్స్య కారులు, మత్స్య కార్మిక సంఘం(టీఎంకేఎంకేఎస్​) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ పిలుపునిచ్చారు. హనుమకొండ రాంనగర్​ లోని సంఘం జిల్లా ఆఫీస్​లో బుధవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.  ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత చేప పిల్లల పంపిణీ స్కీం వల్ల మత్స్య కారులకు ఎలాంటి ఉపయోగం ఉండటం లేదని మండిపడ్డారు. చెరువుల్లో నామమాత్రంగా చేపలు పోస్తూ చేతులు దులిపేసుకుంటున్నారని విమర్శించారు. నిరుడు పోసిన చేప పిల్లలు ఇప్పటికీ 100 నుంచి 200 గ్రాముల కంటే ఎక్కువ సైజ్​ పెరగడం లేదన్నారు. టెండర్లలో పొందుపరిచిన విధంగా చేపలు, రొయ్యలు పంపిణీ చేయాలని డిమాండ్​ చేశారు. సీజన్​ దాటిన తరువాత చేప పిల్లలు ఇస్తుండటం వల్ల మత్స్యకారులకు నష్టం జరుగుతోందని, ఇక నుంచి చేప పిల్లలకు బదులు నగదును మత్స్య సొసైటీ అకౌంట్​ లో జమ చేయాలని డిమాండ్​ చేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొడుగు వెంకట్ మాట్లాడుతూ వరంగల్​ నగరంలో  10 ఎకరాల స్థలం కేటాయించి రూ.50 కోట్లతో  చేపల మార్కెట్లు నిర్మించాలని డిమాండ్​ చేశారు.  

అన్నదానాలు.. ప్రత్యేక పూజలు
హనుమకొండ సిటీ, వెలుగు: వరంగల్ నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మండపాల నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేస్తుండగా.. అంతటా అన్నదాన కార్యక్రమాలతో సందడి నెలకొంది. హనుమకొండ నక్కలగుట్టలోని మాంగళ్య షాపింగ్​మాల్ లో బుధవారం మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో షాపింగ్ మాల్ ప్రతినిధులు ఓంనమః శివాయ, అరుణ్ కుమార్, నాని తదితరులున్నారు.

ఎన్జీవోస్ ఫోరం కమిటీ ఎన్నిక
జనగామ అర్బన్, వెలుగు: జనగామ జిల్లా విద్యాశాఖ ఎన్జీవోస్ ఫోరం కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడు ఖాజా షరీఫ్ ఆధ్వర్యంలో సభ్యులను ఏకగ్రీవంగా నియమించారు. గౌరవ అధ్యక్షుడిగా మహ్మద్ హుస్సేన్, ప్రెసిడెంట్​గా కె.పవన్ బాబు, వైస్ ప్రెసిడెంట్ గా జి.హేమంత్ కుమార్, జనరల్ సెక్రటరీ గా మహ్మద్ నూరుద్దీన్, ట్రెజరర్​గా పి.వరుణ్​కుమార్, జాయింట్​సెక్రటరీగా జి.వేణుమాధవ్, విమెన్స్ సెక్రటరీగా కె.ఉమాదేవి, ఆర్గనైజింగ్​ సెక్రటరీగా ఖాదర్ పాషాలను ఎన్నుకున్నారు. ఈసీ మెంబర్లను సైతం నియమించారు. 

యూనిట్ల ఎంపిక లబ్ధిదారులకే..
భూపాలపల్లి అర్బన్, వెలుగు: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యూనిట్లను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లబ్ధిదారులకే ఇస్తున్నట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. 2018–19 ఏడాదికి గాను జిల్లాలో 170మందిని ఈ పథకానికి ఎంపిక చేశామన్నారు. బుధవారం స్థానిక ఇల్లందు గెస్ట్ హౌజ్ లో లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్ధిదారులు లాభదాయకమైన వ్యాపారాలను ఎంచుకుని, ఆర్థికంగా ఎదగాలన్నారు. మార్కెట్ స్థితిగతులు, నైపుణ్యాలు, అనుభవాన్ని బట్టి యూనిట్​ ను సెలెక్ట్ చేసుకోవాలన్నారు. ఆఫీసర్లు కేవలం అవగాహన మాత్రమే కల్పిస్తారని, చివరి నిర్ణయం లబ్ధిదారుడిదేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ దివాకర, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.వెంకటేశ్వర్లు, జీఎం ఆనంద్ తదితరులున్నారు.

బీజేపీ బలోపేతానికి కృషి
భూపాలపల్లి అర్బన్, వెలుగు: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని చాడ రఘునాథ్ రెడ్డి వెల్లడించారు. బీజేపీ అధిష్టానం వరంగల్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ గా రఘునాథ్ రెడ్డిని నియమించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి, పదవి ఇచ్చిన పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కి ధన్యవాదాలు తెలిపారు. కాగా, భూపాలపల్లికి చెందిన రఘునాథ్ రెడ్డి గతంలో పరకాల వ్యవసాయ మార్కెట్​కమిటీకి చైర్మన్ గా పని చేశారు.

అండర్–17 ఈవెంట్స్ షురూ
ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం ఎంజేపీ స్కూల్ లో ఉమ్మడి జిల్లా అండర్–17 ఆటలపోటీలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఎమ్మెల్యే రాజయ్య చీఫ్ గెస్టుగా హాజరై పోటీలు ప్రారంభించారు. మొత్తం 14 టీంలు వివిధ పోటీల్లో పాల్గొన్నాయి. కార్యక్రమంలో ఎంపీపీ కవిత రెడ్డి, సర్పంచ్ అనిల్ తదితరులున్నారు.

కీలక మీటింగ్ కు ప్రజాప్రతినిధుల డుమ్మా
నెక్కొండ, వెలుగు: ప్రజలపక్షాన ప్రశ్నించాల్సిన ప్రజాప్రతినిధులు సైలెంట్ గా ఉంటున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలకేంద్రంలో బుధవారం జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించగా.. చాలామంది సభ్యులు డుమ్మా కొట్టారు. దీంతో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి.14మంది ఎంపీటీసీలుకు గాను 9 మంది, 39 మంది సర్పంచ్​లకు గాను 10 మంది మాత్రమే హాజరయ్యారు. ఆఫీసర్లు సైతం సగం మంది మీటింగ్ కు రాలేదు. దీంతో మీటింగ్ సాదాసీదాగా సాగింది. సమస్యలపై ఎలాంటి చర్చ జరగకుండా మీటింగ్ ముగిసింది. మధ్యాహ్నం 2గంటల వరకు ఉండి, అందరూ ఇండ్లకు వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఎంపీపీ రమేశ్​పాల్గొన్నారు.

వాగులో పడి పశువుల కాపరి మృతి
మరో ఇద్దరికి తప్పిన ప్రాణాపాయం

చిట్యాల, వెలుగు: పశువుల కాపరి వాగులో పడి చనిపోయిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దెముత్తారంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి కొత్తగొల్ల కొమురయ్య(58), బందెల సారయ్య, వేముల సమ్మయ్య పశువులను మేపుతూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం స్థానిక మోరంచ వాగు అవతల పశువులను మేపేందుకు వెళ్లారు. ముందుగా సమ్మయ్య వాగు దాటి, ఒడ్డుకు చేరగా.. కొమురయ్య వాగు మధ్యలో చిక్కుకున్నాడు. ఆయనకు ఈత రాకపోవడంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ఇవతల ఒడ్డునే ఉన్న సారయ్య.. ఆ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. వాగులో గాలించగా కొమురయ్య మృతదేహం బయటపడింది.