రాష్ట్రంలో అర కోటికి చేరిన ఆసరా పెన్షన్లు

రాష్ట్రంలో అర కోటికి చేరిన ఆసరా పెన్షన్లు
  • దీర్ఘకాలిక రోగులకు కూడా పెన్షన్లు ఇస్తున్నం
  • పెన్షన్ దారులకు గుర్తింపు కార్డులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే
  • పెన్షన్ లబ్దిదారుల తో కలిసి మంత్రి సహపంక్తి భోజనం
  • కొత్త పెన్షన్లు అందజేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ జిల్లా: రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య అరకోటికి చేరిందని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పెన్షన్ ఇస్తున్న దాఖలాలు లేవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం మంత్రి లబ్దిదారులకు కొత్త పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రం రాకముందు 20 లక్షలున్న పెన్షన్ల సంఖ్యను ప్రస్తుతం 50 లక్షలకు పెంచామని తెలిపారు. వృద్ధాప్య పెన్షన్ వయస్సును 65 సంవత్సరాల వయసు నుంచి 57 సంవత్సరాలకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 6 లక్షల పెన్షన్లు మాత్రమే ఇస్తోందని, అందుకోసం రూ.200 కోట్లు ఖర్చు పెడుతోందని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల మందికి ఏడాదికి రూ.1200 కోట్లు ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ కింద రూ.200, వికలాంగుల పెన్షన్ కింద రూ.500 మాత్రమే వచ్చేదని... కానీ కేసీఆర్ పాలనలో వృద్ధులు, వితంతువులకు రూ.2016, వికలాంగులకు రూ.3016 వస్తున్నట్లు పేర్కొన్నారు.  

కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే పెన్షన్లు ఇస్తుండగా... మన రాష్ట్రంలో మాత్రమే బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్, పైలేరియా, డయాలసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్లు అందజేస్తున్నామని మంత్రి వివరించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని, మ్యానిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను ఆయన అమలు చేస్తున్నారని తెలిపారు. తమ పథకాలను కాపీ కొడుతూ గొప్పలు చెప్పుకుంటోందని బీజేపీని విమర్శించారు. దమ్ముంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో తాము ఇచ్చినట్లు పెన్షన్లు ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, ఎంపీపి నల్లా నాగిరెడ్డి, జెడ్పిటీసీ శ్రీనివాస్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, నాయకులు పోషాల వెంకన్న, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.