అంగన్ వాడీల సమస్యలు కేంద్రం పరిధిలోనివే..

అంగన్ వాడీల సమస్యలు కేంద్రం పరిధిలోనివే..

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

పరకాల, వెలుగు :
అంగన్ వాడీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. ఆదివారం పరకాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పరకాల ఐసీడీఎస్ ప్రాజెక్టు మహాసభ నిర్వహించగా.. చీఫ్ గెస్టులుగా మంత్రితో పాటు ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ముందుగా అంగన్ వాడీలు తమకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు ఈసీఐ, ఈపీఎఫ్​ అందించాలని కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఐసీడీఎస్ ప్రాజెక్టు కేంద్రం ఆధీనంలో ఉన్నందున స్కేలు, రిటైర్మెంట్​బెనిఫిట్లకు కేంద్రం పర్మిషన్​ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అంగన్ వాడీలకు రూ.13వేలకు పైగా జీతం ఇస్తున్నా ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.

కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో  ఐదారు వేలకు మించి లేదన్నారు. బీజేపీ నాయకులు తెలంగాణలో పాదయాత్రలు చేయడం కాదని.. కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్​లో చేస్తే తాను కూడా వస్తానన్నారు. తెలంగాణలో అమలయ్యే పథకాలు, అక్కడ కూడా అమలైతే.. క్షమాపణలు చెబుతానన్నారు. రాబోయే రోజుల్లో అంగన్ వాడీలకు సీఎం కేసీఆర్ మంచి బహుమతి ఇస్తారని చెప్పారు. గ్రామాల్లో గర్భిణిలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అంగన్ వాడీలదేనన్నారు. కార్యక్రమంలో వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, టీఆర్ఎస్​కేవీ అంగన్​వాడీల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, రాష్ట్ర నాయకురాలు నల్ల భారతి, పరకాల ప్రాజెక్టు పరిధిలోని అంగన్​వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణనను కేంద్రం పట్టించుకోవట్లే..
వరంగల్​సిటీ, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు రాష్ర్ట ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. కేంద్రం పట్టించుకోవడంలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఆదివారం వరంగల్ సిటీలోని కరీమాబాద్ లో దళిత నేత, దివంగత బొమ్మల కట్టయ్య విగ్రహాన్ని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, స్థానిక కార్పొరేటర్లలతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. అంతకుముందు బుద్ధుడి విగ్రహాన్ని ఆవిష్కరించి, పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు.

ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉంటుందని, ఇది దళిత యువతకు తీరని అన్యాయమన్నారు. కేంద్రం అధికార దాహంతో మతం పేరిట ప్రజల్లో చిచ్చు పెడుతోందన్నారు. కేంద్రంపై పోరాటానికి దళితులంతా ఏకం కావాలన్నారు. కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు దేశంలో ఎక్కడా లేదన్నారు. హక్కుల సాధనకు దళిత యువత ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. బొమ్మల కట్టయ్య జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు.