ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్​లోనే భారీ జెండా 
ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

మహబూబాబాద్ /తొర్రూరు, వెలుగు:  దేశభక్తి, జాతి ఐక్యతను జాతీయ జెండా గుర్తు చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పేర్కొన్నారు. మహబూబాబాద్​జిల్లా తొర్రూరులోని జడ్పీ స్కూల్​లో ఏర్పాటు చేసిన 100 అడుగుల జెండాను మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త చుక్కా రామయ్యతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. అనంతరం జెండా ప్రతిష్టాపన కమిటీ చైర్మన్​డా.పొనుగోటి సోమేశ్వర రావు అధ్యక్షతన నిర్వహించిన మీటింగ్​లో మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్​ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా తొర్రూరు టౌన్​లో 100 అడుగుల జెండాను ఏర్పాటుచేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. డీఆర్డీవో, ఇస్రో సలహాలతో జెండా 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాట చరిత్ర, త్యాగాలను  నేటి తరం యువతకు తెలియజేయాలన్నారు. ఏపీ మన్యం జిల్లా కళాకారుల థింసా, కోయ నృత్యం ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, మున్సిపల్​ చైర్మన్​ రామచంద్రయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్, ఎంపీపీ చిన​అంజయ్య, వందేమాతరం వ్యవస్థాపకుడు రవీంద్ర, పతాక ప్రతిష్టాపన కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.    

అర్హులందరికీ పింఛన్లు ఇప్పిస్తాం..
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల, వెలుగు :
పరకాల నియోజకవర్గంలోని అర్హులందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత నాదేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం పరకాల, నడికూడ మండలాల్లోని వరికోలు, పులిగిల్ల, రాయపర్తి, నాగారం, లక్ష్మిపురం, వెంకటాపూర్​ గ్రామాల్లో కొత్తగా మంజూరైన వారికి పింఛన్​ కార్డులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త పింఛన్​ లిస్టుల్లో పేరు రాలేదని ఎవరూ ఆందోళన చెందొద్దని, సర్పంచ్​లు, పంచాయతీ కార్యదర్శులకు వివరాలు అందిస్తే వారందరికీ పింఛన్లు ఇప్పిస్తానన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీలు అనసూయ, స్వర్ణలత, జడ్పీటీసీలు కోడెపాక కల్పన, అనసూయ, వైస్​ ఎంపీపీలు కుమారస్వామి, మధుసుదన్​రెడ్డి పాల్గొన్నారు.

నర్మెట్ట, వెలుగు: తరిగొప్పుల, నర్మెట్ట మండలాలకు చెందిన లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన1483 పింఛన్​ కార్డులను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. 
ధర్మసాగర్, వెలుగు : ధర్మసాగర్ మండల కేంద్రంలో సోమవారం ఎంపీపీ నిమ్మ కవిత రెడ్డి అధ్యక్షతన కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్​ ​కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజయ్య చీఫ్​గెస్ట్​గా పాల్గొని 1899 మందికి లబ్ధిదారులకు పింఛన్​​కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కొన్ని గ్రామాల సర్పంచ్​లు, ఎంపీటీసీలు హాజరుకాలేదు. 
మూడేండ్లకో నాలుగేండ్లకో కాదు: సీతక్క​
కొత్తగూడ, వెలుగు: మూడేండ్లకో, నాలుగేండ్లకోసారి కాకుండా అర్హులైనవారికి వెంటనే కొత్త పింఛన్​మంజూరు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. మహబూబాబాద్​జిల్లా కొత్తగూడలోని రైతు వేదికలో సోమవారం కొత్తగా మంజూరైన 913 మందికి పింఛన్​ ​కార్డులు, 8 మందికి కల్యాణ లక్ష్మి చెక్​లను పంపిణీ చేశారు. 

ములుగు జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

మంత్రి సత్యవతి రాథోడ్​
ములుగు, వెలుగు :
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్​ సంక్షేమ ఫలాలను అమలు చేస్తుంటే కాంగ్రెస్​, బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్​ స్పష్టం చేశారు. సోమవారం ములుగు కలెక్టరేట్​లో కలెక్టర్​ కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో జిల్లాలోని 8424 కొత్త పింఛన్​ కార్డులను ములుగు జడ్పీ చైర్మన్​ కుసుమ జగదీశ్​తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ములుగు జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. సీఎం కేసీఆర్​ జీపీగా ఉన్న ములుగును మున్సిపాలిటీగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారన్నారు. అనంతరం పింఛన్​దారులతో కలిసి మంత్రి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో అంకిత్​, జడ్పీ వైస్​ చైర్మన్​ నాగజ్యోతి, అడిషనల్ కలెక్టర్​ వై.వి.గణేశ్, ఆర్డీవో కె.రమాదేవి, డీఆర్​డీవో నాగపద్మజ, ఎంపీపీ శ్రీదేవి, జడ్పీటీసీ భవానీ, రైతు బంధు సమితి కోఆర్డినేటర్​ బుచ్చయ్య పాల్గొన్నారు. 
పెన్షన్ల పంపిణీలో పాల్గొనని సీతక్క
ములుగు కలెక్టరేట్​లో కొత్త ఆసరా పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే సీతక్క పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. మొదట మంత్రి సత్యవతితో కలిసి తాడ్వాయి మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ములుగు మండలం ఇంచర్లలో జీసీసీ ఏర్పాటు చేసిన పెట్రోల్​ పంపును ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్​లో జరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి మాత్రం రాలేదు. కార్యక్రమం అనంతరం టీఆర్ఎస్​ జిల్లా కార్యాలయంలో మంత్రి సత్యవతి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సీతక్క రాకపోవడం సరికాదని, ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. 
మల్లంపల్లిలో అర్ధనగ్న ప్రదర్శన 
ములుగు, వెలుగు: మల్లంపల్లిని మండలం చేయాలని కోరుతూ మండల సాధన సమితి నాయకులు సోమవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ములుగు పర్యటనకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్​ను ములుగు కలెక్టరేట్​లో కలిసి వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన మంత్రి మండలం ఏర్పాటుకు 7 ఎంపీటీసీ స్థానాలు ఉండాలని, ఆ దిశగా అందరూ కృషి చేయాలన్నారు. ములుగు జడ్పీ చైర్మన్​, టీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీశ్​సోమవారం రిలేదీక్ష శిబిరం వద్దకు వచ్చి మండలాన్ని సాధిస్తానని హామీ ఇచ్చారు. మల్లంపల్లి మండలం కాకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని సాధన సమితి నాయకుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

ప్లాటు వివాదంలో భార్యపై భర్త గొడ్డలితో దాడి
అడ్డుకోబోయిన కూతురు, బావమరిదికి గాయాలు
హసన్ పర్తి, వెలుగు :
ప్లాటు అమ్మకానికి భార్య అడ్డుపడుతోందని, గొడ్డలితో దాడిచేసిన ఘటన హనుమకొండ జిల్లా గోపాలపురంలో సోమవారం జరిగింది.  కేయూ సీఐ దయాకర్ వివరాల ప్రకారం.. గోపాల్ పూర్ కు చెందిన దాసరి మాధవికి, కమాలపూర్ మండలం దేశాయిపల్లెకు చెందిన ఎల్లబోయిన భిక్షపతితో 27 ఏండ్ల కింద వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుతుళ్లు. తల్లి లక్ష్మీ మాధవికి కట్నం కింద గోపాలపురంలోని కల్లు అడ్డా వద్దనున్న 200 గజాల స్థలాన్ని ఇచ్చింది. తర్వాత భిక్షపతి అక్రమ సంబంధాలు పెట్టుకొని మాధవిని వేధిస్తుండటంతో 2019 లో అతనిపై కేసు పెట్టింది. అప్పటి నుంచి భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే భిక్షపతి ప్లాటు అమ్మకానికి పెట్టిన విషయం తెలుసుకొని మాధవి అడ్డుకుంది. దీంతో ఆమెను ఎలాగైనా చంపాలని భావించిన భిక్షపతి గొడ్డలితో బైక్ పై ప్లాటు వద్దకు వచ్చాడు. అక్కడే ఉన్న మాధవిపై దాడి చేశాడు. అడ్డకోబోయిన కూతురు శ్రావ్య, బావమరిది కోటేశ్వర్ పై కూడా దాడి చేయడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన మాధవిని స్థానికులు హాస్పిటల్​కు తరలించారు . మాధవి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

256 కిలోల ఎండు గంజాయి పట్టివేత

ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్ 
హసన్ పర్తి, వెలుగు :
కారులో తరలిస్తున్న 256 కేజీల ఎండు గంజాయిని టాస్క్​ఫోర్స్, హసన్ పర్తి  పోలీసులు సోమవారం పట్టుకున్నారు. వరంగల్ సీపీ తరుణ్ జోషి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన పల్లపు రాజు (తండ్రి వెంకయ్య), పల్లపు రాజు (తండ్రి వెంకటి), బోడ సుమన్ నాలుగేండ్లుగా భద్రాచలం, డొంకరాయి, సీలేరు, ధారకొండ, ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో ట్రాక్టర్లతో భూమిని చదును చేసేవారు. ఈ క్రమంలో 2022 జనవరిలో ఒడిశా రాష్ట్రంలోని అల్లరి కోటలో సత్తిబాబు అనే వ్యక్తికి చెందిన భూమిని చదును చేసేందుకు రూ.70 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సత్తిబాబు వీరికి డబ్బులు ఇవ్వకుండా గంజాయి ఇస్తానని చెప్పాడు. గంజాయి రవాణాతో ఎక్కువ లాభం వస్తుందని ఆశపడిన నిందితులు... సత్తిబాబుతోపాటు ప్రతాప్​అనే మరో వ్యక్తికి రూ.లక్ష ఇచ్చి256 కేజీల గంజాయి కొన్నారు. దాన్ని ప్యాకెట్లు గా చేసి కారులో ఒడిశా రాష్ట్రం అల్లరి కోట మీదుగా మహారాష్ట్ర బయలుదేరారు. హసన్ పర్తి చెరువు మూలమలుపు వద్దకు రాగానే పోలీసులు వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనంలో 256 కేజీల గంజాయిని గుర్తించి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీపీ వివరించారు.

ఈటల కుటుంబానికి దత్తాత్రేయ పరామర్శ

కమలాపూర్,  హసన్ పర్తి, వెలుగు :  హుజురాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ కుటుంబాన్ని హర్యానా రాష్ట్ర  గవర్నర్​ బండారు దత్తాత్రేయ సోమవారం పరామర్శించారు. కమలాపూర్​లోని ఈటల నివాసానికి చేరుకున్న దత్తాత్రేయ.. ఈటల తండ్రి మల్లయ్య ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజేందర్​ కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. బీజేపీ ఓబీసీ జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్​, మాజీ మంత్రి విజయ రామారావు, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్​ రెడ్డి, మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు, లీడర్లు రావు పద్మ, శ్రీనివాస్​, పాపారావు, సహోదర్​ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, దిలీప్​ కుమార్, యోగానంద్​, విక్రమ్​ రెడ్డి, కాంతారావు, భూంరెడ్డి ఈటల కుటుంబాన్ని పరామర్శించారు. తిరుగు ప్రయాణంలో హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్తి మండల కేంద్రానికి 
చెందిన జనసంఘ్ సీనియర్ కార్యకర్త, బీజేపీ నాయకుడు శీలం సారంగపాణి ఇంటికి దత్తాత్రేయ వెళ్లారు. సారంగపాణి కుటుంబసభ్యులతో మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి, భాజపా పాల్గొన్నారు.

ఆసరా పింఛన్లపై కౌన్సిలర్ల నిలదీత

జనగామ అర్బన్​, వెలుగు:  కొత్తగా మంజూరయిన ఆసరా పింఛన్లు అర్హులందరికీ అందకపోవడంపై పలువురు కౌన్సిలర్లు మున్సిపల్​ మీటింగ్​లో నిలదీశారు. సోమవారం చైర్​పర్సన్​ పోకల జమున ఆధ్వర్యంలో జనగామ మున్సిపల్​సమావేశం జరిగింది. ఈ మీటింగ్​లో కౌన్సిలర్​ మహాంకాళి హరిశ్చంద్రగుప్త మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు ఇప్పటికీ పూర్తిస్థాయిలో రాలేదన్నారు. రాని వారికి ఎప్పుడు ఇస్తారో అని డీఆర్డీవో వినిత ను ప్రశ్నించారు. మరో కౌన్సిలర్​గాదెపాక రాంచందర్​ మాట్లాడుతూ ‘మన ఊరు మన బడి’ నిధులు వచ్చి టెండర్​ అయినా పనిచేయడం లేదని, సంబంధిత అధికారికి ఫోను చేస్తే స్పందించడం లేదన్నారు. కౌన్సిలర్​ ఉడుగుల శ్రీలత మాట్లాడుతూ మా వార్డులో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని, వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. 18 అంశాలను ఎజెండాలో పొందుపర్చగా వివిధ కారణాలతో 5 అంశాలను వాయిదా వేశారు. 

ప్రాథమిక స్థాయిలో తెలుగును తప్పనిసరి చేయాలి
హనుమకొండ సిటీ, వెలుగు:
ప్రాథమిక స్థాయిలో  తెలుగు తప్పనిసరి చేయాలని సినీ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ అన్నారు.  సోమవారం గిడుగు రాంమ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషాదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ  ద్రవిడ స్టూడెంట్స్ ఫెడరేషన్​ ఆధ్వర్యంలో సుబేదారిలోని ఆర్ట్స్ కాలేజీలో సెమినార్​ నిర్వహించారు.  సదస్సుకు  చీఫ్​గెస్ట్ గా హాజరైన పెద్దింటి అశోక్​ కుమార్ మాట్లాడుతూ భాషలు అంతరిస్తే ఆ జాతుల సంస్కృతి అంతరించే ప్రమాదం ఉందన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది పూసల శ్రీకాంత చారి మాట్లాడుతూ తమిళనాడు  తరహాలో తెలుగు మీడియంలో చదివిన వారికి ఉద్యోగాల్లో 30శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. సదస్సులో తెలంగాణ ద్రవిడ స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు వాసం ఆనంద్ కుమార్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్​అయిలయ్య పాల్గొన్నారు.