గవర్నర్ బలహీనవర్గాల వ్యతిరేకి : గంగుల కమలాకర్

గవర్నర్ బలహీనవర్గాల వ్యతిరేకి :  గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు: గవర్నర్ తమిళిసై బడుగు, బలహీనవర్గాల వ్యతిరేకి అని రాష్ట్ర బీసీ సంక్షేమం, సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను తిరస్కరించడంపై ఆయన బుధవారం కరీంనగర్ లో మాట్లాడారు. కుర్ర సత్యనారాయణ ఎస్టీ సామాజిక వర్గానికి, దాసోజు శ్రవణ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులని గుర్తుచేశారు. వాళ్లిద్దరిని ఎమ్మెల్సీలుగా తిరస్కరించడం సరికాదన్నారు. దీంతో బడుగు, బలహీన వర్గాలు హర్ట్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళిసైని గవర్నర్ గా బీజేపీ ఎలా నామినేట్ చేసిందో ఒకసారి గుర్తుచేసుకోవాలన్నారు. గవర్నర్ రాజకీయం చేయొద్దని, ఎమ్మెల్సీల విషయంలో పునరాలోచించుకోవాలని మంత్రి గంగుల కోరారు.    

రేషన్ కార్డుల్లో  పేర్లు తీసే ప్రయత్నం 

 రేషన్ కార్డుదారులను కేంద్ర ప్రభుత్వం విధిగా, నిర్బంధంగా కేవైసీ అప్ డేట్ చేసుకోవాలని చెప్తోందని, దీంతో రాష్ట్ర  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి గంగుల ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ వాళ్లు షోలాపూర్, గల్ఫ్ లో ఉంటారని, వాళ్లు ఇప్పటికిప్పుడు రాలేరని తెలిపారు. ఇదే అదనుగా వారి పేర్లు తీసేసే ప్రయత్నం కేంద్రం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే రేషన్ కార్డుల కేవైసీ ప్రక్రియపై కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్‌కు తాను లేఖరాశానని, రాష్ట్రంలో ఒక్క పేరు తొలగించినా తాము ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.