మానేరు రివర్..ఫ్రంట్ నమూనాల ప్రదర్శన : గంగుల కమలాకర్

మానేరు రివర్..ఫ్రంట్ నమూనాల ప్రదర్శన : గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ రివర్ ఫ్రంట్ అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మారనుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం మానేరు రివర్ ఫ్రంట్ వద్ద చేపట్టే పనులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఐఎన్ఏ స్టూడియో ప్రతినిధులు మంత్రికి వివరించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫారిన్ టూరిస్టులను ఆకర్షించేలా కేబుల్ బ్రిడ్జి, మానేరురివర్ ఫ్రంట్ పనులను చేపట్టినట్లు తెలిపారు. లోయర్ ప్రామినెడ్, అప్పర్ ప్రామినెడ్ పనులు, ఆ తర్వాత  సివిల్ పనులను చేపట్టాలని సూచించారు.  

ప్రజాప్రతినిధులు ప్రజల మన్ననలు పొందాలి 

కరీంనగర్​ రూరల్ : ప్రజాప్రతినిధులు ప్రజల మనసు చూరగొనెలా పనిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండల జనరల్​బాడీ మీటింగ్‌‌‌‌కు మంత్రి హాజరై మాట్లాడుతూ... అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర సీఎం కేసీఆర్​తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు పూర్తిస్థాయి విశ్వాసంతో ఉన్నారన్నారు. పల్లెల్లో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరుతున్నాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్​లు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని, వారిని నమ్మే పరిస్థితి లేదన్నారు.

కరీంనగర్ రూరల్ మండలంలో పెండింగ్ పనులకు రూ.16 కోట్లు మంజూరు చేశామని, ఈ పనులకు టెండర్లు పూర్తయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, జడ్పీ సీఈవో వీర బుచ్చయ్య, ఎంపీపీ లక్ష్మయ్య, జడ్పీటీసీ లలిత, ప్యాక్స్ చైర్మన్ శ్యామ్​సుందర్​రెడ్డి, ఎంపీడీవో జగన్ మోహన్​రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.